సంజీవనిలాంటి పాదం

ఒక్కవాక్యం చాలు
నీలో నిద్రాణమై ఉన్న నేను
నిప్పురవ్వను చేసి
నిశిరాత్రులు నిండిన
నీ జీవితాన్ని వెలిగించేందుకు

జ్ఞాపకాల తేనెతుట్టెలో దాగిన
తీయని అనుభూతుల్ని తట్టిలేపి
నిన్నునీకే కొత్తగా పరిచయం చేయడానికి
ఒక్క బలమైన వాక్యం చాలు

అప్పుడెప్పుడో మీ ఊరి వాగులో ఈతకొట్టి
కోతికొమ్మచ్చి ఆడుకుంటూ పారేసుకున్న
బాల్యస్మతుల్ని తిరిగివ్వడానికి
సాంద్రమైన అక్షరం చాలు

చిన్నప్పుడు నాయన కోపంతో
నీ వీపుకంటించిన ఐదువేళ్ళను
తన కన్నీళ్లతో తుడుస్తున్న
అమ్మప్రేమని గుర్తుచేసే
అనుభూతి ప్రతీక చాలు

తుప్పుపట్టిన నీ జీవనహారాన్ని
మెరిగిసుకతో రుద్ది మెరిపించడానికి
నీ గుండెపూల పరిమళాన్నీ
నలుగురి దిగులుమనస్సుల్లో
వెలుగువానై కురిపించడానికి
ఒక్కతొలకరి వాక్యం

నువ్వు నడిచిన దారుల్ని రహదారుల్ని చేసి
నీ భవిష్యత్‌ గమనాన్ని మళ్లించే
జీవమున్న ఒక్క వాక్యం

చరిత్ర పుటల్లో నీ పేరు శిలాక్షరమయ్యే
సంజీవనిలాంటి ఒక్కకవిత్వపాదం చాలు
– డా||బాణాల శ్రీనివాసరావు