ఇవాళెందుకో
పాత మిత్రుడు గుర్తుకొస్తున్నాడు.
వెళ్లి కలుద్దామంటే
అతడు అప్పటిలా ఉండడు.
ఆ వీధులు కూడా అపరిచితంగా వున్నాయి
నా భాష కూడా మారిపోయింది
చిరునామాను ఎలా అడగాలో మర్చిపోయాను.
‘నేను కవిని’ అన్నాను ఒకాయనతో
‘అంటే’ అన్నాడు
‘పని లేని వాడు’ అన్నాను
‘అనుకున్నా అందుకే దిక్కుతోచక తిరుగుతున్నావు’ అన్నాడు.
‘ఈ చందమామ
మా ఊరిలో లాగ లేదు’ అన్నాను
అతడు నవ్వుతూ ముందుకు సాగిపోయాడు.
వెతుకుతూనే వున్నాను పట్టుదల సడల లేదు
జ్ఞాపకాలు బరువెక్కుతున్నాయి
మొయ్యడం కష్టం!
స్నేహితుడు దొరికితే బాగుండు ననిపిస్తుంది
ఓ మూల వద్దని కూడా
అనిశ్చితితో వెను దిరిగాను.
ఎదురుగా ముందు ఎవరో వెళ్తుంటే
పరుగున సమీపించాను
ఇంతసేపూ వెతుకుతున్నది ఇతణ్ణా!
అని ఆశ్చర్యపోయాను. ‘అతడు నేనే!’.
– డా|| ఎన్. గోపి