బాలలకు కమ్మని కథలు చెప్పిన ‘ఫ్రెండ్లీ పోలీస్‌’

'Friendly Police' which tells stories to childrenవృత్తి రీత్త్యా ఆయన పోలీసు. ప్రవృత్తి బాల సాహిత్య రచన, కార్యక్రమాల నిర్వహణ. కవి, కథకుడు, వ్యాసకర్త, సామాజిక కార్యక్రమాల్లో తలమునకలై ఉండే ఈ ఎ.ఎస్‌.ఐ పేరు తొగర్ల సురేశ్‌. ఫిబ్రవరి 12, 1968న నిజామాబాద్‌ పట్టణంలోని కోటగల్లిలో పుట్టిన సురేశ్‌ ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా వర్నీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీమతి తొగర్ల సుశీల, శ్రీ సాయన్న వీరి అమ్మానాన్నలు. బడి మొదలకుని గుడి వరకు అనేక సామాజిక కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనే సురేశ్‌ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంచడం, ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు, బహుమతులు అందిస్తుంటారు.
రచయితగా కథలు, కవిత్వం, బాల సాహిత్యం, ఇతర ప్రక్రియలు, రూపాల్లో ముప్పై రచనలు అచ్చువేశారు. వీటిలో బాలల గురించి తపించి రాసిన రచనలు రెండు ఉన్నాయి. బాల సాహిత్యం మరో రెండు రచనలు ఉన్నాయి. పోలీసు కథలను ‘మన కోసం’ పేరుతో ప్రచురించిన సురేశ్‌ సగటు మనుషుల జీవితాల గాథలతో ‘కాల చక్రం’ తీసుకువచ్చారు. ‘కాలేజి అమ్మాయిలు’, ‘శ్రీమతికి ప్రేమలేఖ’, ‘ఉదయ శిఖరం’, ‘మీలో ఒక్కడిని’, ‘పక్కింటి కోడలు’, ‘బావే నా ప్రాణం’, ‘స్వర్గానికి నిచ్చెన’, ‘నేటి విద్యార్థి’, ‘అనుబంధాలు’, ‘అత్తగారి కొత్త కోడలు’, ‘మీరజాలగలడా’ మొదలైనవి సురేశ్‌ కథలు, కథానికా సంపుటాలు. ‘కోమలి’ వీరి కవితా సంపుటి. ‘జావళి’, ‘జవ్వని’ దీర్ఘ కవితలు. ఫ్రెండ్లీ పోలీస్‌గా మన్ననలు పొందిన సురేశ్‌ వృత్తి రీత్యా అందుకున్న పలు పురస్కారాలకు తోడు ప్రవృత్తిరీత్యా సాహిత్య రంగంలోనూ సత్కారాలు అందుకున్నారు. వాటిలో కిరణ్‌ సాహితీ సంస్థ, ధాత్రి సాహితీ సంస్థ, గిడుగు రాంమూర్తి ఫౌండేషన్‌, రాంబత్రి సాహితీ సంస్థ అల్లూరి అవార్డు, చత్రపతి శివాజీ సేవానిలయం, పుడమి సంస్థల అవార్డులతో పాటు సామాజిక తత్వ్తవేత్త బి.ఎస్‌.రాములు స్ఫూర్తి పురస్కారం వంటివి ఉన్నాయి.
తొగర్ల సురేశ్‌ పిల్లల కోసం కథలు, అడపాదడపా గేయాలు రాశారు. బాలల నేపథ్యంగా దీర్ఘ కవితను రాశారు. ఇవే కాక అనేక సంస్థలు ప్రచురించిన వివిధ సంకలనాలు, సంచికల్లో వీరి కథలు అచ్చయ్యాయి. ఇటీవల మణికొండ వేదకుమార్‌ సంపాదకత్వంలో బాల చెలిమి తెచ్చిన ‘నిజామాబాద్‌ జిల్లా పెద్దలు రాసిన పిల్లల కథలు’ పుస్తకంలో వీరి కథ ఎంపికై అచ్చయ్యింది. ఇంకా హరిదా రచయితల వారి సంకలనంలో, చీలం జానకీబాయి రచయిత్రుల సంఘం వారి సంకలనంలో వీరి కథలు కొన్ని హిందీలోకి కూడా అనువాదమయ్యాయి. ఇటీవల గుడ్ల పరమేశ్వర్‌ హిందీలోకి తెచ్చిన తెలుగు బాలల కథల్లో కూడా వీరి కథ ఉంది. ‘అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు’ వీరు బాలల కోసం తెచ్చిన కథాసంపుటి. దీనికి తోడు పది పది పేజీలతో బులెటిన్ల రూపంలో సురేశ్‌ కొన్ని పుస్తకాలు తెచ్చారు. వాటిలో ‘చిట్టి కథలు’ బాలల కథల బులెటిన్‌. బాలల నేపథ్యంగా రాసి అచ్చువేసిన దీర్ఘ కవిత ‘గడుగ్గారు’, ఇదే కాక బాలలే ఇతివృత్తంగా ‘వెన్నెల్లో మా పల్లె’ దీర్ఘ కవిత రాసినప్పటికీ అది ఇంకా అచ్చులోకి రాలేదు.
పిల్లల నేపథ్యంగా, వారి కోసం రాసిన ‘గడుగ్గారు’ ఒక చిన్నారి బాలుని కథ. ఇందలోని గడుగ్గారుకి వివిధ కారణాల వల్ల చదువు అబ్బలేదు. కానీ వ్యక్తిగా, నీతి, నిజాయితీ, మానవత్వం వంటి విలువలతో నిలిచి తల్లితండ్రుల పట్ల భక్తి, భార్య పట్ల ప్రేమానురక్తి వంటివి ఈ పాత్రను చక్కగా తీర్చిదిద్దాయి. పాడుకునేందుకు కొంత అనువుగా వున్న ఈ గేయ కవిత అనేక అంశాలు, విషయాలను పిల్లలకు, పెద్దలకు తెలుపుతుంది. కాస్త ఫాంటసీ, మరికొన్ని కల్పనలు, జానపద రీతి వెరసి ఈ దీర్ఘ కవిత. ‘మొండి వాడు/ గడుసువాడు/ వాడి పంతం వాడిదే/ ఎవడు చెబతే వినేవాడు కాదు’ అంటూ మన గడుగ్గారుని వర్ణిస్తాడు తొగర్ల సురేశ్‌.
‘అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు’ సురేశ్‌ పిల్లల కోసం వ్రాసిన కథలు. ఇవన్నీ రచయిత బాల్యపు జాడలు, తన అమ్మమింట్లో విన్నవి, అనుభూతి చెందినవి కావడం విశేషం. ఇది పద్నాలుగు కథల సంపుటి. అన్ని కథల్లోని అంతస్సూత్రం చదువు, దాని విలువ గొప్పదనం కావడం రచయిత తనకు తాను పెట్టుకున్న నియమానికి నిదర్శనంగా ఉన్నాయి. అమాయకత్వం, తెలివితక్కువ ప్రర్తన వల్ల కలిగే యిబ్బంధుల గురించి ‘గడుగ్గారు’ కథ చెబితే, ‘రాత్రి బడికి వెళతాను’ కథ వయోజన విద్య గొప్పదనాన్ని, విద్య విలువను తెలిపే కథ. ఇందులోని ‘చేపలకు నీళ్లెవరు పోస్తారు’ కథ కూడా పిల్లలను ఆలోచింపజేసే మరో మంచి కథ. బాలల కథతో పాటు, అనుబంధంగా ప్రతి కథకు ఒక జానపద గేయాన్ని చేర్చి… కథను, గేయాన్ని పిల్లలకు తాయిలంగా అందించారీ ‘ఫ్రెండ్లీ పోలీస్‌ తొగర్ల సురేశ్‌’. అభినందనలు….. జయహౌ! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548