– 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్
దుబాయ్: 2024 పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ సన్నద్ధత అప్పుడే మొదలైంది. ఒలింపిక్స్‌లో 1900 తర్వాత తొలిసారి క్రికెట్‌ను చేర్చారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేస్తున్నట్టు గత ఏడాది 2028 ఒలింపిక్ నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలు ఇంకా రూపొందించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐఓసీ)కి ప్రాథమికంగా సమర్పించిన ప్రణాళిక ప్రకారం మహిళలు, పురుషుల విభాగంలో ఆరు జట్ల చొప్పున పోటీ పడనున్నాయి. ఇందుకోసం ఐసీసీ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోనున్నారు. వారం రోజుల వ్యవధిలో పోటీలు ముగిసేలా టీ20 ఫార్మాట్ మ్యాచులను ఐసీసీ ప్రణాళిక చేయనుంది. మహిళలు, పురుషుల మ్యాచులు ఏక కాలంలో జరిగే అవకాశం ఉంది. లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్ మ్యాచులకు వేదిక ఇంకా ఖరారు కాలేదు. ఇక 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో గ్రేట్ బ్రిటన్ జట్టును బరిలో నిలిపే అంశంపై ఇంగ్లాండ్, స్కాట్లాండ్ చర్చలు మొదలుపెట్టాయి. ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ జట్లు మాత్రమే పోటీపడతాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లాండ్ మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో అర్హత సాధించినా.. గ్రేట్ బ్రిటన్ జెండాతోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్‌తో పాటు స్కాట్లాండ్ క్రికెటర్లు సైతం జట్టులో చోటు సాధిస్తారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఈసీబీతో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు మంతనాలు జరుపుతుంది.