గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్‌

– రూ.2కోట్ల 80లక్షల 910కేజీల గంజాయి స్వాధీనం : సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్‌
ఒడిశా నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్ల 80లక్షల విలువ చేసే 910కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ కమిషరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీందర్‌ మీడియాకు వెల్లడించారు.
వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా కొద్ది నెలలుగా గంజాయి సరఫరా జరుగుతోంది. ఈ సమాచారం పోలీసులకు అందింది. బాలానగర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, మాదాపూర్‌ పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు జరిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితులైన జీవన్‌సింగ్‌, అంకిత్‌సింగ్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 5 మొబైల్స్‌, డీసీఎం వ్యాన్‌ స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది కూలీలను అడ్డం పెట్టుకొని ఈ వ్యాపారం సాగిస్తున్నారు.
ప్రధానంగా ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు అమాయక ప్రజలను ఎంచుకొని వారికి డబ్బు ఆశ చూపి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు లారీ కింది భాగాన గంజి పెట్టి పైన తౌడు, బ్యాంగిల్స్‌ డబ్బాలు పెట్టి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు గంజాయి ముఠాను అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శివాజీ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా చందానగర్‌, మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు శివాజీని అరెస్టు చేశారు.