బ్రస్సెల్స్‌లో రైతులపై భాష్పవాయు ప్రయోగం

బ్రస్సెల్స్‌లో రైతులపై భాష్పవాయు ప్రయోగంబ్రస్సెల్స్‌ : బ్రస్సెల్స్‌లోని యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు సోమవారం బాష్పవాయువు ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉక్రెయిన్‌ నుంచి చౌకగా దిగుమతయ్యే ఆహార ధాన్యాల కారణంగా తమ వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయని రైతులు నిరసన తెలుపుతున్నారు. తమకు యూరోపియన్‌ యూనియన్‌ మరింత మద్దతు అందించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు యూరోపియన్‌ యూనియన్‌ ప్రధాన కార్యాలయాన్ని తమ ట్రాక్టర్లతో ముట్టడించారు. వారిని చెదరగొట్టటానికి పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు.
మంత్రులు సమావేశమైన భవనాన్ని వందలాది ట్రాక్టర్లతో ముట్టడించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు తమ ట్రాక్టర్ల పాత టైర్లను గుట్టలుగా పేర్చి నిప్పంటించారు.
యూరోపియన్‌ యూనియన్‌ వ్యవసాయ మంత్రులు సమావేశమై వ్యవసాయ క్షేత్రాల తనిఖీల గురించి, చిన్న వ్యవసాయ క్షేత్రాలకు పర్యావరణ అనుమతుల విషయంలో రాయితీలను ఇవ్వటంపై చర్చలు జరుపుతున్న సమయంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మధ్యకాలంలో బ్రస్సెల్స్‌లో రైతులు నిరసన ప్రదర్శన చేయటం ఇది రెండోసారి.