వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

– సమస్యలపై గలమెత్తిన సభ్యులు
నవతెలంగాణ- తంగళ్ళపల్లి:
అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ది ఫలాలు అందాలని సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. ఎంపీపీ పడగల మానస అధ్యక్షతన తంగళ్లపల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిషత్‌ సమావేశమందిరంలో సభ ప్రారంభం కావడంతోనే వివిధ శాఖల అధికారులు శాఖల వారిగా నివేదికలను చదివి వివరించారు. ప్రతి సమావేశంలో సమస్యలు, సమస్యలుగానే మిగిలిపోతున్నాయని పత్రికలలో వస్తున్న కథనాలు చర్చనీయాంసంగా మారుతున్నాయని సభ్యులు గలమెత్తారు. నెలలు తరబడి సమస్యలు పరిష్కారం కావడం లేదని అంకిరెడ్డిపల్లె ఎంపీటీసీ రాజిరెడ్డి నిలదీశారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. గత సమావేశాల్లో పింఛన్ల సమస్యలు లేవనెత్తితే ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్లు ఎందుకు మంజూరు చేయలేదన్నారు. అర్హులైన వారందరూ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 20 శాతం మందికి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వ పథకాల కోసం రేషన్‌ కార్డును అనుసంధానం చేసినా కూడా ఆర్హులైన నిరుపేదలకు పింఛన్లు అందక పోవడం అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయాల్సింది పోగా, గతంలో ఇళ్లను నిర్మించుకున్న పాత ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింపచేశారని వివరించారు. బీసీబంధు పథకాన్ని గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఎలా ఎంపిక చేస్తారని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వేణుగోపాలరావు ప్రశ్నించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పని చేసినప్పుడే ప్రతి పథకం లబ్ధిదారునికి చేరుతుందన్నారు. మండలంలో కొందరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. బీసీబంధు పథకం కింద ఎంతమంది ఏ ఏ గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్నారో వాటి వివరాలను అందించాలని కోరారు. ఎంపీడీవోను కొందరు చిన్నచూపు చూస్తున్నారని ఎంపీటీసీ కోడి అంతయ్య అన్నారు. కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులు వచ్చిన వాటిని వెంట వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్‌ చేయడం జరుగుతుందని తహసీల్దార్‌ వెంకటలక్ష్మీ తెలిపారు. బీసీబంధు పథకం కింద మండలంలో 343 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 63 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు.