ఉదారతను చాటిన స్నేహబంధం..

– స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

నవతెలంగాణ-పెద్దవంగర: వారంతా చిన్ననాటి స్నేహితులు, అంతా కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు. పెరిగి పెద్దయి, ఎవరికి వారు జీవితాలలో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదువుకున్న చిన్ననాటి మిత్రుడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడన్న విషయం తెలిసి చలించిపోయారు. ఎలాగైనా స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకుని, బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపారు. తమకు చేతనైన సాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నగదును సేకరించి, ఆ మొత్తాన్ని స్నేహితుడి భార్యకు అందజేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన పిండి శ్రీను (38) జూలై నెలలో కురిసిన వర్షాలకు వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. 2000-01 పదో తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు కలిసి మృతుని ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనే సంకల్పంతో రూ. 12500 సేకరించి, స్నేహితుడి భార్య రాధిక, కుమారుడు సాయి చరణ్ కి అందజేశారు. స్నేహితుడితో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంతోష్, సోమన్న, మల్లేష్, కిషన్, రాజు, రవి, మస్తాన్, సరిత, స్వర్ణ, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.