దివంగత మునవ్వర్ రాణా ప్రముఖ కవి. ఉర్దూతో పాటు హిందీ, అవధి భాషల్లో గజల్ రాసేవారు. ఉర్దూ సాహిత్యానికి గాను ఆయనకు 2014 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మునవ్వర్ రాణా జనవరి 14, 2024న తన 71వ ఏట లక్నో, ఉత్తర ప్రదేశ్‌లో గుండెపోటుతో మరణించారు. వారి మరణం సాహితీ లోకానికి, ముఖ్యంగా ఉర్దూ సాహిత్యానికి తీరని లోటు.
మునవ్వర్ రాణా ఉత్తరప్రదేశ్‌లోని సరియు నదీ తీరాన ఉన్న చరిత్రాత్మక నగరమైన రాయబరేలిలో 1952 నవంబర్ 26న ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు సయ్యద్ అన్వర్ అలి తల్లి అయిషా ఖాతూన్.
భారతదేశ విభజన తరువాత, అతని బంధువులు చాలా మంది పాకిస్తాన్‌కు వెళ్లారు. కాని అతని తండ్రి భారతదేశం విడిచి వెళ్లలేదు. దేశ విభజన తర్వాత అతని తండ్రి ‘జమీందారీ’ని కోల్పోయాడు. తన జీవనోపాధి కోసం అతని తండ్రి రవాణా వ్యాపారం ప్రారంభించాడు. వారి ఇంటి వాతావరణం మౌల్వీ సంప్రదాయం.
మునవ్వర్ రాణా బాల్యం చాలా వరకు కోల్‌కతాలో గడిచింది. అతను అక్కడి పాఠశాల నుండి విద్యను అభ్యసించాడు. తర్వాత బి.కాం గ్రాడ్యుయేట్ చేశాడు.
కోల్‌కతాలో నివసిస్తున్నప్పుడు, మునవ్వర్ రాణా ‘నక్సలిజం’ వైపు ఆకర్షితుడయి, వాళ్లను కలవడం ప్రారంభించాడు. వారిలో కొందరు మునవ్వర్ రాణాకు స్నేహితులు కూడా అయ్యారు. ‘నక్సలైట్స్’ తో తన కొడుకుకు సంబంధం గురించి తెలిశాక, అతను మునవ్వర్ రాణాను ఇంటి నుండి బయటకు పంపి, అతనితో కుటుంబ సంబంధాల్ని తెంచేశాడు. రెండేళ్లు ఆవారా జీవితం లాంటిదే గడిపాడు రాణా. అలా గడిపిన కాలంలో మానవ విలువలను, జీవిత పరమార్థాన్ని బాగా అర్థం చేసుకున్నాడు.
మునవ్వర్ రాణా తన తల్లిని చాలా ప్రేమిస్తాడు. తన కవిత్వంలో తల్లి/ అమ్మ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. పంపకంలో ఒకరికి భవనం/ మరొకరికి వ్యాపారం/ ఇంట్లో పిన్నవాడినైన నాకు/ దక్కింది అమ్మ, వరం.
మరో ద్విపదం (షేర్) లో తల్లి గురించి తన గజల్‌లో అంటాడు… ”ఓ చీకటి! చూసుకో నీ మొహం/ మారింది గాడాంధకారం/ అమ్మ తెరిచిన నయనాలకు/ వెలిగింది ఇల్లు దేదీప్యమానం”.
మునవ్వర్ రాణా లక్నో వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతం అతన్ని ఎంతగానో ఆకర్షించింది, లక్నో అతనికి ఇష్టమైన నగరంగా మారింది. అక్కడే స్థిర పడ్డాడు. మునవ్వర్ రాణా లక్నోలో ఉన్నప్పుడు ప్రముఖ గజల్ కవి వలీ అసిని కలిశాడు. వలీ ఆసి సలహా మేరకు కవిత్వం నేర్చుకోవడం ప్రారంభించాడు. గజల్ నైపుణ్యాన్ని జీర్ణించుకున్నాడు. వలీ అసికి కతజ్ఞుడయ్యాడు. మునవ్వర్ తన గజల్ లను మొదటిసారిగా ఢిల్లీలోని ‘ముషాయిరా’లో అలాపించాడు. అతను తన కవితలలో సున్నితమైన సమస్యలను చిత్రీకరించడానికి హిందీ, అవధి భాషల పదాలను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందాడు. మునవ్వర్ రాణా కవితల్లో (గజల్) చెప్పుకోదగ్గ విశేషం ‘అమ్మ’ని గౌరవించడం.
మునవ్వర్ రాణా ఒక ప్రత్యేకమైన స్వరంతో ఇండియాలో, విదేశాలలోనూ అత్యంత ప్రజాదరణ పొందిన కవులలో ఒకరు. అతని అత్యంత ప్రసిద్ధ కవిత ‘మా’. దీనిలో అతను తల్లి సద్గుణాలను కీర్తించడానికి గజల్ శైలిని ఉపయోగించాడు.
మునవ్వర్ రాణ గజల్‌లో గ్రామం, పొలాలు, కూలీలు, నేల, ఉనికి, బీడీలు తయారు చేసే కార్మిక మహిళలు, రైలు డబ్బాలను చీపురు ద్వారా ఊడ్చే స్త్రీలు కేంద్రంగా ఉంటాయి. ఓ ముషాయిరా (కవిత గోష్టి) లో అంటాడు: ”ఎలా తెంచుకొని వెళ్లాలి నా ఉనికి సంకెళ్లను/ జీవితాంతం ముడిపడినవి, ఎక్కడికెళ్లను/ పథ్వియే గదా నా తల్లి/ దాన్నొదిలి నేనెక్కడికి వెళ్లను”.
ఉర్దూలో ప్రచురించబడిన కొన్ని గజల్ సంకలనాలు: ‘బగైర్ నక్షే కా మకాన్, చహరే యాద్ రహతె హై, జంగ్లి ఫూల్, కహో జిల్లే ఇలాహి, మా(తల్లి), సఫేద్ జంగ్లి కబుతర్, ముహజిర్ నామా’ మొదలైనవి. రాణా కవిత్వం హిందీ, ఇంగ్లీష్, గురుముఖి, బంగ్లా భాషలలో కూడా అనువదించ బడినాయి.
– మొహ్మద్ అమ్జద్ అలీ,
00 966 507662638