నలుగురికి ప్రాణం పోసే దానం

మన దేశంలో సరైన సమయానికి సురక్షితమైన రక్తం దొరకక మరణిస్తున్న వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతూనే ఉంది. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావానికి గురౌతున్న మహిళలు, తలసేమియా – సికిల్‌ సెల్‌ – లుకేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. వినియోగానికి అవసరమైనంత రక్తాన్ని నిల్వ చేసుకున్నట్టయిటే ఇలాంటి ప్రమాదాల్ని చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. ఈ విషయాలపట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం, రక్తదానం చేసే దిశగా వారిని చైతన్య పరచటం చాలా అవసరం. ఈ ఉద్దేశ్యంతోనే మన దేశంలో ప్రతి యేట అక్టోబర్‌ ఒకటవ తేదీన ”జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం”గా పాటిస్తున్నారు.
మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. రక్తదానం చేయటం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే కాదు, ఒక కుటుంబంలో ఏర్పడే నష్టాన్ని, దు:ఖాన్ని నిలువరించి, వారికి ఆపన్న హస్తం అందివ్వడం. అందుకే అన్ని దానాల్లోకి ప్రాణ దానం గొప్పది అంటారు.
గతంతో పోలిస్తే రక్తదానం పై అవగాహన, రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగిందనే చేప్పాలి. దానితో పాటు రక్తం వినియోగం కూడ పెరుగుతోంది. ప్రతి యేట మన దేశంలో ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుంటే దాతల నుంచి లభిస్తోంది మాత్రం యాభై లక్షల యూనిట్లు మాత్రమే అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే వినియోగానికి అవసరమైనంత రక్తం లభ్యం కావటం లేదన్నది నిపుణుల అభిప్రాయం.
మనదేశ జనాభాలో కేవలం 37శాతం మంది మాత్రమే రక్తదానానికి అర్హులుగా గుర్తించ బడుతున్నారని నివేదికలు చెపుతున్నాయి.
స్త్రీలలో చాలామంది రక్తహీనత వల్ల, రుతుక్రమం సమయంలో, గర్భవతులుగా ఉన్నప్పుడు, పిల్లలకి పాలిచ్చే కాలంలో రక్తదానం చేయలేక పోతున్నారు.
అలాగే అధిక మోతాదులో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకునే వారు, హెచ్‌.ఐ.వి, హెపటైటిస్‌ బి, సిఫిలిస్‌, కాన్సర్‌, తలసేమియా, సికిల్‌ సెల్‌ వంటి అనేక వ్యాధులతో బాధపడే వారినుంచి కూడా రక్తం సేకరించే అవకాశం వుండటం లేదు.
మన దేశ జనాభాలో 60 యేళ్ళు పైబడిన వారు 10.5 శాతం ఉన్నారని 2021 సంవత్సరపు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గుండెపోటు, గుండెకి శాస్త్ర చికిత్స చేయించుకున్నవారు కూడా రక్తదానం చేయటానికి అనర్హులనీ వైద్య నిపుణులు చెపుతున్నారు.
ఈ కారణాల వల్లే మన దేశంలో రక్తదానం చేసే అర్హత కలిగిన వారి సంఖ్య తక్కువగా ఉంది.
ఈ క్రింది అర్హతలు వున్నవారేవరైనా రక్తదానం చేయచ్చు.
18 నుంచి 60 సంవత్సరాల వయసు వుండి, ఆరోగ్యంతో ఉన్న ఏ వ్యక్తి అయినా రక్తదానం చేయచ్చు.
రక్తదానం చేసే వారి బరువు కనీసం 50 కేజీలు వుండాలి.
రక్తదానం చేసే మహిళల్లో హిమోగ్లోబిన్‌ కనీస స్థాయి 12.5, పురుషుల్లో 13.5 వుండటం మంచిది.
ఒకసారి రక్తం ఇచ్చాక ఆరు నెలల కాలం పూర్తి కాకుండా మళ్ళీ రక్తాన్ని దానం చేయకూడదు.
బి.పి, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వాళ్ళు వాడే మందులు, వాటినీ యే మోతాదులో వాడుతున్నారో ముందుగా వైద్యులకు తెలియచేయాలి. అవి పూర్తిగా కంట్రోల్లో వున్నాయని నిర్ధారణ అయాకే రక్తదానం చేయాలి.
టాటూ వేయించుకున్న వాళ్ళు ఆరు నెలల తర్వాతే రక్తదానం చేయటానికి అర్హులు అవుతారు.
మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి వ్యాధులకు మందులు వాడినట్టయిటే రక్తదానానికి ముందే వైద్యులకి తెలియచేయటం తప్పనిసరి.
దాత నుంచి సేకరించిన రక్తాన్ని ‘హోల్‌ బ్లడ్‌’ అంటారు. దాని నుంచి ఎర్రకణాలు, ప్లేట్‌ లెట్స్‌, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్‌ అనేవి విడకొట్టి అవసరమైన వ్యక్తులకి వాటిని అందిస్తారు. అంటే – ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తం నలుగురు వ్యక్తుల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగ పడుతుంది.
రక్తదానం గురించి చాలా మందిలో ఇంకా ఎన్నో అపోహలు వుంటున్నాయి. అవి పోవాలంటే ఈ క్రింది విషయాల్ని తెలుసుకోవాలి.
వైద్యులు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు జరిపిన తర్వాతే సురక్షితమైన పద్ధతుల్లో రక్తాన్ని సేకరిస్తారు.
రక్తదానానికి పట్టే సమయం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే.
రక్తం ఇచ్చాక పోషకాలతో కూడిన ద్రవపదార్థాలు తీసుకోవటం మంచిది.
రక్తం ఇచ్చాక ఒక అరగంట విశ్రాంతి తీసుకున్నాక ఎటువంటి శారీరక శ్రమ అయినా చేసుకోవచ్చు.
దానం చేసిన రక్తం తిరిగి శరీరంలో భర్తీ అవటానికి నాలుగు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది. అయినా దానివల్ల ఎటువంటి బలహీనత కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు గానీ ఏర్పడవు.
ఆరు నెలలకి ఒకసారి రక్తదానం చేయటం వల్ల మనసు, శరీరం కూడా యెంతో ఉత్సాహంగా వుంటాయి.
రక్తదానం వల్ల దాతలకి కూడా అనేక ప్రయోజనాలు వుంటాయని వైద్య నిపుణులు చెపుతున్నారు.
రక్తం సేకరించే ముందు జరిపే ఆరోగ్య పరీక్షల వల్ల మన ఆరోగ్యంగా ఎలా వుందో తెలుసుకునే అవకాశం వుంది. ఒకవేళ అప్పటిదాకా బయట పడని అనారోగ్య సమస్యలేమైనా వుంటే అవి లాబ్‌లో గుర్తించబడి, ఆ వివరాలు దాతలకు అందించ బడతాయి. దానివల్ల వాళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకోగలుగుతారు.
రక్తదానం వల్ల శరీరంలో రక్త పరిమాణం సతుల్యం చెందటం వలన గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు వంటివి కొంత నియంత్రణలో వుండే అవకాశం ఉంది. అలాగే, శరీరంలో ఐరన్‌ నిల్వల స్థాయి తగ్గి కొన్ని రకాల కాన్సర్స్‌ లక్షణాలు కూడ తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు.
కాబట్టి యెటువంటి అపోహలకి తావివ్వకుండా ప్రతిఒక్కరూ రక్తదానం చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
ముగింపు: ప్రతిఒక్కరూ రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలి. అలాగే ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలి. అప్పుడే మనం నలుగురికి ప్రాణదానం చేయగలుగుతాం.
ఆరోగ్యానికి హాని కలిగించే వ్యసనాలకి బానిసలు కాకుండా వుంటే రక్తదానం చేసే అర్హత కలిగివుంటారు. రక్త నిల్వలు పెంచటంలో భాగస్వామ్యులు అవచ్చు. వాహనాలు నడిపేప్పుడు వేగాన్ని అదుపులో ఉంచితే ప్రమాదాల్ని కొంతవరకు నివారించవచ్చు. రక్తం వినియోగం కూడ కొంత తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాల్ని దృష్టిలో వుంచుకోవాలి.