ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగం 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత తగ్గిందన్నది నిస్సందేహం. అమెరికాలోని కొందరు మితవాద ఆర్థికవేత్తలు సైతం ‘ఇది దీర్ఘకాలిక మాంద్యం’ అంటున్నారు (ఆ పదానికి వారిచ్చే నిర్వచనం వింతగా ఉంటుంది). ఈ అంశాన్ని కొన్ని గణాంకాల ద్వారా వివరించడం ఈ వ్యాసం ఉద్దేశం.
జీడీపీని (స్థూల జాతీయోత్పత్తి) లెక్కించే విధానాలు ఆయా దేశాల్లో చాలా వరకూ విశ్వసనీయత కలిగినవి కావు. ఇక మొత్తం ప్రపంచానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. భారత దేశంలో అధికారిక లెక్కలను అనేకమంది పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. అధికారులేమో ఏడు శాతం, ఆ పైబడి వృద్ధిరేటు ఉన్నట్టు చూపుతున్నారు. కాని ఈ పరిశోధకులు అది నాలుగుశాతం నుండి 4.5 శాతానికి మించదని, ఈ పరిస్థితి గత కొన్నేండ్లుగా ఇదే మాదిరిగా ఉంటోందని గట్టిగా చెప్తున్నారు. ప్రభుత్వ నియం త్రణలో ఆర్థిక వ్యవస్థ కొనసాగిన గత కాలంతో పోల్చి నయా ఉదారవాద విధానాల కాలంలో జీడీపీ వృద్ధిరేటు గురించి చంకలు గుద్దుకోవడం అర్ధం లేనిది. గతకాలంతో పోల్చితే వృద్ధిరేటు పెరిగింది పెద్దగా లేదు. పైగా అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. పోషకాహార లభ్యత గురించి లభిస్తున్న గణాంకాలను బట్టి శ్రామిక ప్రజానీకపు స్థితిగతులు బాగా క్షీణించాయని స్పష్టంగా చెప్పవచ్చు. అంత నిలకడ లేని ఈ జీడీపీ గణాంకాలను పక్కనపెట్టి ప్రపంచ జీడీపీ సంగతేమిటో చూద్దాం.
ఇందుకోసం నేను ప్రపంచబ్యాంక్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటున్నాను. 2015 నాటి ధరలు ఆ యా దేశాల్లో ఎలా ఉన్నాయో, పరిశీలించి, వాటిని 2015 నాటి డాలర్‌తో ఆయా దేశాల కరెన్సీ మారకపు రేటును లెక్కలోకి తీసుకుని ఆ ప్రాతి పదికన జీడీపీ లెక్కలను అంచనా కట్టారు. 1961 నుంచీ గడిచిన కాలాన్ని కొన్ని ఉప కాలాలుగా విభజించి ఆయా ఉప కాలాలలో వృద్ధి ఏ విధంగా ఉన్నదీ పరిశీలించడం కొంచెం చిక్కులతో కూడుకున్న విషయమే. ఒక దశాబ్ద కాలాన్ని ఒక ఉప కాలంగా విభజిస్తే గనుక దానిలో ఒక సమస్య వస్తుంది. ఆ దశాబ్దపు మొదటి ఏడాది గనుక వృద్ధి రేటు బాగా తక్కువగా ఉంటే, దాంతో పోల్చినప్పుడు తక్కిన దశాబ్దకాలం యావత్తూ వృద్ధిరేటు చాలా ఎక్కువగా జరిగినట్టు లెక్క వస్తుంది. అందుచేత సరైన అంచనాలకు రావడానికి వీలుగా నేను 1961 నుంచీ గడిచిన కాలంలో బాగా ఎక్కువ వృద్ధిరేటు సాధించిన సంవత్సరాలను ఎంచుకున్నాను. ఆ విధంగా చూసి నప్పుడు 1961, 1973, 1984, 1997, 2007, 2018 సంవత్సరాలలో అత్యధిక వృద్ధిరేటు జరిగినట్టు తేలింది. ఇప్పుడు వీటిలో ప్రతీ రెండింటి మధ్య కాలంలోని వృద్ధిరేటును పరిశీలించాను. ఆ రేట్లు ఈ విధంగా (పట్టిక) ఉన్నాయి.
ఉపకాలం సాలుకు జీడీపీ వృద్ధి రేటు
1961-73 5.4 శాతం
1973-84 2.9 శాతం
1984-97 3.1 శాతం
1997-2007 3.5 శాతం
2007-2018 2.7 శాతం
పైన ఇచ్చిన అంకెలను బట్టి మూడు నిర్ధారణలు చేయవచ్చు. మొదటిది: మొత్తంమీద చూసినప్పుడు ప్రభుత్వాల నియంత్రణలో దేశాల ఆర్థిక వ్యవస్థలు నడిచినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు నయా ఉదారవాద కాలంలోని వృద్ధిరేటు కన్నా చాలా ఎక్కువగా ఉంది. ”మార్కెట్టే సర్వ శక్తి సంపన్నం” అంటూ ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో నయా ఉదారవాద కాలంలోనే జీడీపీ వృద్ధిరేటు బాగా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కలుగు తుంది. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. వాస్తవానికి నయా ఉదారవాద కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు గణనీయంగా మందగించింది.
రెండవది: ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థలు నడిచిన కాలానికి, నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలైన నాటికి మధ్య కొంత వ్యవధి ఉంది. ఈ కాలంలో వృద్ధిరేటు 5.4 శాతం నుండి 2.9 శాతానికి పడిపోయింది. 1967 నుండి ద్రవ్యోల్బణం వేగవంతం అయి 1973-74 వరకూ కొనసాగింది. దానిని అదుపు చేయడానికి పెట్టుబడిదారీ వర్గం ప్రభుత్వ వ్యయాన్ని కుదిస్తూ, భారీ స్థాయిలో నిరుద్యోగాన్ని పెంచే వ్యూహాన్ని అనుసరించింది. ఈ వ్యూహం ఫలితంగా 1973 నుంచీ వృద్ధిరేటు మందగించింది. అప్పటి నుంచీ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ప్రభుత్వాల నియంత్రణ ఉండే విధానం నిలిచిపోయింది. ఇలా వృద్ధిరేటు మందగించిపోవడం నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెట్టడానికి కావలసిన భూమికను కల్పించింది. అప్పటికే పెరుగుతూ అంతకంతకూ అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకుంటున్న ద్రవ్య పెట్టుబడి అంతకు ముందునుంచే నయా ఉదారవాద విధానాలకు మళ్ళాల్సిందేనంటూ ఒత్తిడి పెంచుతోంది. సరిగ్గా ఆ సమయానికే పాత విధానాల పర్యవసానంగా ముందు ద్రవ్యోల్బణం, తర్వాత వృద్ధిరేటు మందగించడం జరిగాయి.
మూడవది: పట్టికలో ఇచ్చిన అంకెలను చూస్తే అమెరికాలో హౌసింగ్ బుడగ పేలిపోయిన అనంతర కాలంలో వృద్ధిరేటు మందగమనం కొనసాగుతూనే వుంది. హౌసింగ్ బుడగ బద్దలైపోవడంతో పెట్టుబడిదారీ ప్రపంచం మొత్తంగా సంక్షోభంలో పడింది. అప్పుడు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వం పెద్దఎత్తున జోక్యం చేసుకుంది (ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల జోక్యం ఉండరాదనే నయా ఉదారవాదన బండారం దీనితో బయటపడింది). కాని వాస్తవ ఆర్థిక వ్యవస్థకు దాని నుంచి ఎటువంటి ప్రేరణా లభించలేదు. వృద్ధిరేటును పెంచడానికి ప్రభుత్వాల వ్యయం పెరగడంగాని, హౌసింగ్ బుడగ వంటి మరేవైనా బుడగలు ఏర్పడి తాత్కాలికంగా వృద్ధిరేటు వేగాన్ని పెంచడానికి దోహదం చేయడం వంటివి కాని జరగలేదు.
మనం 2018 సంవత్సరాన్ని ఆఖరి గరిష్టవృద్ధి సంవత్సరంగా తీసుకున్నాం. ఆ తర్వాత చూస్తే వృద్ధిరేటు మరీ అన్యా యంగా పడిపోయింది. 2018 నుంచి 2022 మధ్య వృద్ధిరేటు సాలుకు 2.1 శాతం మాత్రమే ఉంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు సుమారు 1 శాతంగా ఉంది (మన దేశ జనాభా లెక్కలు 2021లో సేకరించి వుండాల్సింది. కాని ఇంతవరకూ ఆ పని ప్రారంభం కానేలేదు.). దీనిని పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచ తలసరి ఆదాయం ఒక శాతం చొప్పున మాత్రమే పెరుగుతున్నట్టు భావించాలి. ఐతే, ప్రపంచంలో ఆదాయాల మధ్య అసమానతలు బాగా పెరుగుతున్నాయి. దానిని బట్టి ప్రపంచ జనాభాలో అత్యధిక మెజార్టీ ఆదాయాలలో పెరుగుదల లేకుండా స్తంభించిపోవడం కాని తరిగిపోవడం కాని జరుగుతోంది. దీన్ని వివరించడానికి దిగువ విషయాన్ని ఉదహరిస్తాను. ప్రపంచ ఆదాయం మొత్తంలో సగభాగం కన్నా ఎక్కువ జనాభాలోని అత్యంత సంపన్నులైన పది శాతం ప్రజలు పొందుతున్నారు. వీరి ఆదాయాలు ఏటా కనీసం రెండు శాతం చొప్పున పెరుగుతున్నాయనుకుంటే అప్పుడు తక్కిన 90 శాతం మంది ఆదాయాలూ ఏ పెరుగుదలా లేకుండా స్తంభించిపోయినట్టే కదా. అంటే నయా ఉదారవాదం చివరి దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ జనాభాలో అత్యధిక ప్రజానీకపు ఆదాయాలు పెరుగుదల లేకుండా స్తంభించిపోయేట్టు చేసిందని స్పష్టం అవుతోంది. ఇది పాత వలస పాలనా కాలాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పుడు కూడా ప్రపంచంలోని అత్యధిక శాతం ప్రజల నిజ ఆదాయాలు పెరగకపోగా తరిగిపోయాయి.
ఇలా వృద్ధిరేటు మందగించడం అనేది కొద్దికాలంపాటు మాత్రమే ఉండే తాత్కాలిక సమస్య అని, త్వరలోనే దీనిని అధిగమిస్తామని అనుకోలేం. ఈ పరిస్థితి నయా ఉదారవాద విధానాల పర్యవసానమే. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు పెరగాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరగాలి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రభుత్వం అందుకు వీలుగా వ్యయాన్ని పెంచాలి. ఆ పెరిగే వ్యయాన్ని ద్రవ్యలోటును పెంచడం ద్వారానో, లేక సంపన్నుల మీద పన్ను లను అదనంగా విధించడం ద్వారానో భరించాలి. కాని ఈ రెండిట్లో దేనినీ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. ప్రభుత్వం ఆ యా దేశాలకు విడివిడిగా ఉంటుంది. కాని ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని కలిగివుంది. అందుచేత ఏ దేశంలోనైనా తన ఆదేశాలకు భిన్నంగా జరిగితే వెంటనే ద్రవ్య పెట్టుబడి క్షణాల్లో ఆ దేశాన్ని వదిలిపెట్టి పోతుంది. అలా వెళ్లిపోకుండా నిలుపు చేయా లంటే ఆయా దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అడుగులకు మడుగులొత్తక తప్పదు. అందుచేత ప్రభుత్వ జోక్యం ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ను, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అనేది ఈ నయా ఉదారవాద చట్రం లోపల జరగని పని.
ఇక ఆయా దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోగలిగేది ఒక్క ద్రవ్య విధానం ద్వారా మాత్రమే. ఇక్కడ కూడా ఒక దేశం తన వడ్డీ రేట్లను సంపన్న దేశాలలో అమలౌతున్న వడ్డీ రేట్లకన్నా మరీ తక్కువగా నిర్ణయించకూడదు. ముఖ్యంగా అమెరికా లోని వడ్డీ రేట్లతో పోల్చుకున్నప్పుడు తేడా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ వడ్డీ రేట్లను బాగా తగ్గించి ప్రజలకు ఎక్కువ ధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఏ ప్రభుత్వం అయినా అనుకుంటే అప్పుడు ఆ స్వల్ప వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేవంటూ ఇక్కడి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వేరేచోటికి తరలించుకుపోతుంది. ప్రస్తుతం తన ఇష్టం వచ్చినట్టు వడ్డీ రేట్లను పెంచడం గాని, తగ్గించడం గాని చేయగలిగే శక్తి అమెరికాకు మాత్రమే ఉంది. అక్కడ గనుక డిమాండ్‌ను పెంచడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తే అప్పుడు తక్కిన దేశాలలో కూడా వడ్డీరేట్లను తగ్గించడానికి వీలౌతుంది. ఐతే, ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు సున్నా శాతా నికి చేరుకున్నాయి. అయినా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం లేదు. దీర్ఘకాలంగా ఇలా వడ్డీరేట్లను అతి తక్కువగా కొనసాగించడంతో కార్పొ రేట్లు తమ లాభాల మార్జిన్‌ను పెంచుకోడానికి సరుకుల ధరలను పెంచడం మొదలెట్టాయి. దానితో ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంది.
పాపం! కీన్స్! సోషలిస్టు విప్లవం రాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థే దీర్ఘ కాలం కొనసాగాలని కలలుగన్నాడు. అందుకోసం ప్రభుత్వ జోక్యాన్ని ఒక పరిష్కారంగా సూచించాడు. కాని ఇప్పుడది సాధ్యమయ్యేది కాదని తేలిపోయింది. కీన్స్ కల పీడకలగా మిగిలిపోయింది. ప్రస్తుత నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ పరిస్థితి ఈ విషయాన్ని స్పష్టంగా చూపుతోంది.
(స్వేచ్ఛానుసరణ)
– ప్రభాత్ పట్నాయక్