ఆశలు నెరవేర్చని ప్రభుత్వం-ఉద్యమబాటలో కార్మికవర్గం

Unfulfilled Government-Working Class in Movementరాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేం డ్లుగా ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న కార్మికవర్గం ఆశలు అడియాశలు కావడంతో ఉద్యమబాట పట్టారు. ఏ రంగంలో చూసినా వేలాది మంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ సమ్మె పోరాటాలు చేస్తున్నారు. పాలకపార్టీ సంఘాల వెనకాల ఉన్న కార్మికులు, ఉద్యోగులు సైతం పోరాటాలకు వస్తుండటం నూ తన పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల పూర్తిగా భ్రమలు తొల గిపోతున్నాయి. రానున్న కాలంలో ఇది రాజకీయంగా బీఆర్‌ ఎస్‌కు తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటికైనా కండ్లు తెరచి సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తు న్నారు. కానీ ప్రభుత్వ చర్యలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
రాష్ట్రంలో 28 వేల మంది ఆశా వర్కర్లు సమ్మె చేశారు. సెప్టెంబర్‌ 28న ప్రారంభమైన వారి సమ్మె పట్ల ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ఆశాల సమస్యలపై ఆధ్యయనానికి కమిటీ వేయడంతో అక్టోబర్‌ 9న సమ్మె విరమించారు. ఇంకా వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నారు. 52 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు, వేలాది మంది మున్సిపల్‌ వర్కర్లు, 104, ఆరోగ్యమిత్రలు, ఏఎన్‌ఎం తదిత రులు నేటికీ పోరాట పథంలో ఉన్నారు. 70వేలమంది అంగ న్‌వాడీ ఉద్యోగులు సమ్మెను విరమించారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా, ఎంత నిర్భంధం ప్రయోగించినా ధిక్కరించి పోరా టానికి సిద్ధపడుతుండటం గమనించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మిక, ఉద్యోగుల సమ స్యలు పరిష్కరించకుండా మరింత అసంతృప్తికి గురి చేస్తు న్నది. రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పిఆర్‌సిపై ఎట్టకేలకు కమిటీ వేసింది. కానీ ఐదు శాతం ఐఆర్‌ ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో జీర్ణించుకో లేకపోతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువ ఐఆర్‌ లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 1.30 లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, జీతభత్యాల పెంపు దల కోసం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శాఖల వారీగా ఉద్య మబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో సుమారు ఐదు వేల మందిని మాత్రమే పర్మినెంట్‌ చేసి చేతులు దులుపుకున్నది. ఇందులో విద్య, ఆరోగ్య రంగాలవారే ఎక్కువగా ఉన్నారు. యూనివర్సిటీల టైమ్‌ స్కేల్‌ ఉద్యోగు లను పర్మినెంట్‌ చేయలేదు. వేలాది మంది సర్వశిక్షా అభి యాన్‌ ఉద్యోగులు పోరాటాలు చేశారు. స్కూల్‌ స్వీపర్స్‌, అన్ని రకాల ఆశ్రమ హాస్టల్‌ వర్కర్స్‌ వేతనాలు పెంచలేదు. డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌ వర్కర్స్‌కు కనీసం నెలనెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. తాత్కాలిక ఉద్యోగులకు పిఆర్‌సి, ఐఆర్‌ ప్రకటనలో ప్రస్తావన చేయలేదు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసు కున్నది. కానీ ఈ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలైన పిఆర్‌సి లు, డిఏలు, ప్రభుత్వం వాడుకున్న సిసిఎస్‌ నిధులు, పిఎఫ్‌ నిధులు, బకాయి చెల్లింపుల గురించి మాట్లాడడం లేదు. సింగరేణిలో గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. 40వేలమంది పర్మినెంట్‌ కార్మికులకు సొంతఇంటి కల నెరవేరలేదు. డిపెండెట్ల సమస్య పరిష్కారం కాలేదు. 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు జెబిసిసిఐ నిర్ణయించిన వేత నాలు చెల్లించడం లేదు. వారిని పర్మినెంట్‌ చేయడం లేదు. కనీసం ఆర్‌ఎల్‌సి వద్ద చేసుకున్న 12/3 ఒప్పందాన్ని కూడా అమలు చేయడం లేదు. విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న అన్‌మెన్‌ కార్మికులకు కనీస వేతనాలు లేవు. 23 వేల మంది ఆర్టిజన్‌లను పర్మినెంట్‌ చేయడం లేదు. విద్యుత్‌ ఉద్యోగులకు పిఆర్‌సిలో అన్యాయం జరిగింది. వైద్య రంగంలో 142 జీఓ తెచ్చి రేషనలైజేషన్‌ చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు స్ట్రగుల్‌ కమిటీ ఏర్పాటు చేసుకొని పోరాడుతున్నారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు సుమారు 20 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రభుత్వం కమిటీ వేసి చేతులు దులుపుకున్నది. దీంతో వారు మళ్ళీ ఉద్యమబాట పట్టారు. 104ఉద్యోగుల పర్మినెంట్‌ కోసం సమ్మె నోటీస్‌ ఇచ్చి పోరాడుతున్నారు. 108 ఉద్యోగుల సర్వీ సుల నిర్వహణను మళ్ళీ జివికె సంస్థకు కట్టబెట్టడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు వారం రోజుల పాటు సమ్మె చేశారు. ఆయుష్‌, హాస్పిటల్‌ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరించలేదు. ఆరోగ్యశ్రీలో పని చేస్తున్న 900మంది ఉద్యోగులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీసును ముట్టడిస్తున్నారు. స్థానిక సంస్థల కార్మి కులైన మున్సిపల్‌ వర్కర్స్‌, గ్రామ పంచాయతీ కార్మికుల పర్మినెంట్‌ వేతనాల పెంపుదల చేయ లేదు. మున్సిపల్‌ కార్మికులకు ఎపిలో రూ. 21,వేలు ఇస్తునట్లు మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు చేయాలి. కనీస వేతనాలివ్వాలి. వీటికోసం మళ్ళీ ఉద్యమ బాట పట్టబోతున్నారు.
రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో స్కీమ్‌ వర్కర్స్‌ ఉన్నారు. పర్మినెంట్‌, వేతనాల పెంపుదల కోసం అంగన్‌ వాడీలు 70 వేల మంది సమ్మె చేశారు. ఈ సమ్మె పట్ల ప్రభు త్వం నిరంకుశంగా వ్యవహరించింది. నిర్భంధాన్ని ప్రయోగిం చింది. సెంటర్‌ తాళాలు పగలగొట్టి కేసులు పెట్టింది. అయినా వెరవకుండా పోరాటం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. వారి ప్రధాన డిమాండ్లు నెరవేర్చుతామని ఇద్దరు మంత్రులు స్వయంగా హామీనివ్వాల్సి పరిస్థితి ఏర్ప డింది. ఇది అంగన్‌వాడీల విజయమే కాకుండా ఈ కాలంలో మొత్తం కార్మికవర్గ విజయంగా చూడాలి. 28 వేల మంది ఆశాలు సమ్మెలో ఉన్నారు. ఫిక్స్‌డ్‌ వేతనం కోసం పోరాడు తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ప్రకటన చేసినా నేటికీ చెల్లించలేదు. వారు సమ్మెలో ఉన్నారు. పశుమిత్రలకు జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరి చేయిస్తు న్నారు. 17 వేల మంది ఐకెపి విఓఏలు పోరాడి వేతనాలు పెంచుకున్నా ఇంకా అతి తక్కువ వేతనాలే పొందుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీతాలు పెంచలేదు. విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్ల పే-స్కేల్‌, ప్రమోషన్‌ ఇస్తూ డిపార్ట్‌మెంట్‌లో సర్దుబాటు చేశారు. కోర్టులో కేసులు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ కార్యదర్శులు సమ్మె చేశారు. ప్రొబేషన్‌ పిరియడ్‌ను రద్దు చేసి క్రమబద్ధీకరించాల్సి ఉంది. మిషన్‌ భగీరథ కార్మికులు కనీస వేతనాలు, కార్మిక చట్టాల కోసం సమ్మెలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ ఉన్నాయి. వీటి పరిధిలోనే కోటి మంది కార్మికులు న్నారు. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు. ప్రయివేట్‌ యాజమాన్యాల ప్రయోజనాల కోసం ఈ కార్మికులను అన్యాయం చేస్తున్నది. 2021 జూన్‌లో ఐదు రంగాలకు ఫైనల్‌ జీఓలు రూ.18వేల కనీస వేతనంతో ఇచ్చారు. ప్రయివేటు యాజమాన్యాల ఒత్తిడికి లొంగి గెజిట్‌ చేయకుండా కార్మికులకు అన్యాయం చేశారు. వేల కోట్ల రూపాయలు కనీస వేతనాల రూపంలో పారి శ్రామిక వేత్తలకు ప్రయోజనం కల్గింది. ప్రయివేట్‌ సెక్యూరిటీ గార్డులు జీతాల పెంపుదల కోసం పోరాడుతున్నారు. లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్స్‌ ఇస్తామని ఇవ్వలేదు. చివరకు కార్మిక శాఖామంత్రి ఇంటిని ముట్టడిం చినా స్పందన లేదు. ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌కు, హమాలీలకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయడం లేదు. అసం ఘటితరంగ కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికుల కనీస వేతనాల జీఓ సవరించలేదు. బీడీ ప్యాకర్లకు గంపాచాటన్‌ బట్టి అందరికీ ఆంక్షలు లేని జీవనభృతిని ఇవ్వాలి. సిరిసిల్ల పవర్‌ లూమ్‌ వర్కర్స్‌కు వర్క్‌ టు ఓనర్‌ పథకం అమలు చేయడం లేదు. దీన్ని రాష్ట్రంలో ఉన్న అందరికీ అమలు చేయాలి. వరం గల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, గుండ్ల పోచంపల్లి టెక్స్‌టైల్‌ పార్కు, సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులు పూర్తి చేయలేదు. చేనేత కార్మికులకు పని, కనీస వేతనాలు, కార్మిక చట్టాల అమలు చేయడం లేదు.
ఆ అసంతృప్తులతో వస్తున్న సమ్మె పోరాటాల వల్ల ప్రభు త్వ వైఖరి అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా ఉంది. సమ్మె లో ఉంటే కార్మికులతో చర్చలు జరపం, సమస్యలు పరిష్క రించం అనే వైఖరి అవలంబిస్తున్నది. అయినా కార్మికవర్గం ప్రతిఘటిస్తున్నది. కొన్ని సందర్భాల్లో దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. మారిన రాజకీయ పరిస్థితులు కావచ్చు, పోరా టాలు ఉధృతి కావచ్చు, కొన్ని పోరాటాలు ప్రభుత్వ వైఖరిని మార్చగలిగాయి. అంగన్‌వాడీ, 2వ ఏఎన్‌ఎం, గ్రామ పంచా యతీ, ఐకెపి విఓఏ ఉద్యోగ, కార్మికులు సమ్మెల్లో ఉండగానే ఆ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సిన స్థితి వచ్చింది. అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా రాజకీయంగా నష్టం జరు గుతుందని ప్రభుత్వమే దిగివచ్చి చర్చించడం చూస్తే తన వైఖరిని తనే మార్చుకునే పరిస్థితి కనబడుతుంది. సమ్మెలు చేస్తే చర్చించం – పరిష్కరించమనే అప్రజాస్వామిక వైఖరిని అంగన్‌వాడీల సమ్మె మార్చగలిగింది. ఈ పరిణామాన్ని కార్మిక వర్గం పైచేయి సాధించడంగానే పరిగణించాలి. అంతిమంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమౌతాయనే విశ్వాసం కార్మిక వర్గంలో పెరిగింది. ఆర్‌టిసి, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఐకెపి విఓఏ, గ్రామ పంచాయతీ సమ్మెలను ఎంతగా అణచివేసే ప్రయత్నం చేసినా మరింత పట్టుదలతో సాగాయి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలను ముందకు వస్తున్న సందర్భంలో ఎదురుదాడి చేస్తున్నది. ఉద్యోగుల, పెన్ష నర్ల జీతభత్యానికే ప్రతినెలా రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామంటూ, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయలేక పోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలకు, ప్రజల సంక్షేమ పథకాలకు ముడిపెడుతున్నది. మరోపక్క ప్రభుత్వమే దేశంలోనే ధనిక రాష్ట్రమంటూ ఊదరగొడు తున్నది. కావున ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి, కార్మికుల సమ స్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురై పతనం కాక తప్పని స్థితి ఏర్పడుతుంది.
భూపాల్‌
990099034