– రైతు వెతలు ఇంతింత కాదయా…
నవతెలంగాణ – అశ్వారావుపేట చేతికందిన పంట నోటి కందని దీనస్థితి రైతుది. ఆరుగాలం కష్టం చేసినా, ఆర్ధికంగా నష్టపోయినా రైతు పై అటు ప్రకృతి ప్రకోపం చూపిస్తే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కానరావడం లేదని సన్న చిన్న కారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మీచౌంగ్ తుపానుకు ఉద్యాన పంటలు తో పాటు ఆహారం ధాన్యం పంటలు వరద తాకిడికి గురయ్యాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో సామాన్య రైతు ఆందోళనకు గురి అవుతున్నాడు. కోతకు వచ్చిన వరి ధాన్యం కోసి నూర్పిడి చేసి రాసులుగా సిద్దంగా ఉంచి నప్పటికీ కొనుగోలు చేసేవారు లేక రోడ్లుపైనా, గృహ పరిసరాల్లో కొందరు ఆర పెడుతుండగా స్థలంలో లేని రైతులు స్మశానంలో ఆర బెట్టడం విచారకరం. అశ్వారావుపేట వ్యవసాయ పరపతి సంఘం ఆద్వర్యంలో అశ్వారావుపేట, ఊట్లపల్లి, జమ్మి గూడెం, మద్ది కొండ, అచ్యుతాపురంలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్తున్నప్పటికీ నేటి వరకు ఒక్క గింజ అయినా కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఐదు పంచాయితీల పరిధిలో ఇప్పటికే సుమారు 90 ఎకరాల్లో పంటను కోసి ధాన్యం రాసులుగా ఉంచారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రం ప్రాంగణంలోనే ఈ ధాన్యం ఆర పెట్టడానికి, తాలు తొలగించడానికి, అకాల వర్షం సంభవిస్తే రక్షణగా కప్పడానికి ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి సౌకర్యాలు, వసతులు లేకపోవడంతో రైతులే వారి గృహ పరిసరాల్లో, రహదారులపై, ఎక్కడ వెసులు బాటు ఉంటే అక్కడ ధాన్యం వొన్ను చేసుకుంటున్నారు. మంగళవారం నవతెలంగాణ పలు పంచాయితీల్లో ధాన్యం రాశులను పరిశీలించి, రైతులు ఈతిబాధలు అడిగి తెలుసుకుంది. జమ్మిగూడెంలోని పలువురు గిరిజన రైతులు వారికి సరైన స్థలం లేక పొలం సమీపంలోని స్మశానంలోనే ఆర పెట్టుకుంటున్నట్లు దానపు వెంకన్న అనే రైతు తెలిపారు. మరికొందరు రైతులు రోడ్డు పై ఆరబోతకు ఉంచారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై ఎ.ఒ నవీన్ వివరణ కోరగా ధాన్యం సేకరణ,కొనుగోళ్ళు వ్యవసాయ పరపతి సంఘాలు చూస్తున్నాయని తెలిపారు. అశ్వారావుపేట పి.ఎ.సి.ఎస్ సి.ఇ.ఒ విజయ బాబును వాకబు చేయగా వ్యవసాయ శాఖ సిబ్బంది తేమ శాతం నిర్ధారించి, మాకు సిఫార్స్ చేస్తే మేము కొనుగోలు చేస్తామని అన్నారు. అటు ప్రకృతి అనుకూలించక, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోతే మా గతి ఏమిటని రైతులు మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు.