
నవతెలంగాణ – చండూరు
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 27 న పోలింగ్ జరగనుంది. చండూరు డివిజన్ పరిధిలోని, అన్ని గ్రామాల్లో పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు.
5 మండలాలలో పట్టభద్రులు వివరాలు..
చండూరు మండలంలో 2,472, మునుగోడు మండలంలో 2,432, మరి గూడెం మండలం లో 1,384, నాంపల్లి మండలం లో 1,287, గట్టుప్పల్ మండలం లో 722 మంది పట్టబద్రులు ఉన్నారు. ఇందులో మహిళలు 2,900, పురుషులు 5,397 ఓటర్లు ఉన్నారు. ఆయా మండలాలలో లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్, ఉన్నత పాఠశాలలో వినియోగించుకునేందుకు అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. గతంలో ఎమ్మెల్సీ గా పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక ఏర్పడింది. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఆ స్థానం కాళీ కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 2 న నోటిఫికేషన్ విడుదలైంది. మే 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5 న ఫలితం తేలనుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండగా కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. చండూరు డివిజన్ 5 మండలాల పరిధిలో 8,297 మంది ఓటర్లు ఉండగా, ఆయా గ్రామాల్లోని పార్టీ ఎన్నికల ఇన్చార్జి లు ఓటర్లకు ఫోన్లు చేస్తూ, తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు.