పంభాపూర్ లో ఘనంగా నాగులమ్మ జాతర

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని పంభాపూర్ గ్రామంలో బుధవారం, గురువారం నాగులమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు, అభిషేకాలు చేశారు. ప్రధాన పూజారి ఆగబోయిన సమ్మయ్య, సమ్మక్క ల ఆధ్వర్యంలో పూజారులు ఆగబోయిన బాబు, సారయ్య, రామ్మూర్తి, సాంబయ్య లు, గ్రామ పెద్దల సహకారంతో సూరగుండయ్య గుట్ట నుండి నాగులమ్మను తీసుకొచ్చారు. ఆదివాసి సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో, ఆదివాసి నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. వడ్డెలుగా ఎల్లబోయిన వంశస్థులు నిర్వహించారు. తమ కుటుంబాలను సల్లగా చూడాలని ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. సంతానం లేని వారు అడ్డంగా పండుకొని వేడుకున్నారు. వారి పైనుండి అమ్మవార్లు నడుచుకుంటూ వెళ్లారు. గ్రామంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు మహిళలు యూత్ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.