మేడారం లో ఘనంగా పొట్ట పండుగ

నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క పూజారులు పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. మాఘ కార్తె సందర్భంగా పూజారులు పొట్ట పండుగ నిర్వహిస్తారు. మేడారం సమ్మక్క గుడి శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకరించారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను కూడా అలికి ముగ్గులు వేసి పూజలు చేశారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి లో పొట్ట పండుగ పూజలు నిర్వహించి రాత్రంతా వనదేవత గద్దెల వద్ద పూజారులు డోలు వాయిద్యాలతో సంబరాలతో, జాగారాలు నిర్వహించారు. అనంతరం పొట్టకు వచ్చిన కూరగాయలు, ఈ సీజన్లో కాసిన వివిధ రకాల కూరగాయలు,పండ్లు, మొక్కజొన్న కంకులు, ఆకుకూరలు నైవేద్యంగా సమర్పించారు.  పొట్ట పండగ నాడు వనదేవతలకు మొదటి పంట సమర్పించనిదే ఏ కాయగూర పండ్లను ముట్టబోమని పొట్ట దశలో ఉన్న పంటలను అమ్మవార్లకు సమర్పించడం సాంప్రదాయమని ఆదివాసి గిరిజనులు తెలిపారు. అన్ని సమర్పించి సుభిక్షంగా పంటలు పండాలని కోరుతూ పూజలు చేశారు. పొట్ట పండుగతో మేడారంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కొక్కెర కృష్ణయ్య, మునేందర్, మహేష్, అరుణ్, సిద్ధబోయిన స్వామి, బోజారావు, పాపారావు, మల్లెల ముత్తయ్య, దీప దూప నైవేద్య పూజారి దోబె నాగేశ్వరరావు, సందీప్ తదితర పూజారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.