ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. జయ శంకర్ సమర్పణలో సంజరు శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఈనెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాధించి కెరీర్‌లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్‌కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు మరింత సౌండ్ పార్టీగా మారాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘నేను, శివన్నారాయణ కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌గా అలరిస్తాం. దర్శకుడు సంజరు పేరు ఒక బ్రాండ్‌గా నిలుస్తుంది. నిర్మాతలు రవి, మహేంద్ర అందించిన సపోర్టు మర్చిపోలేనిది’ అని సన్నీ చెప్పారు.
శివన్నారాయణ మాట్లాడుతూ,’సంజరు నన్ను పదేళ్ల క్రితమే దష్టిలో పెట్టుకొని ఈ పాత్ర రాశారు. ఇలాంటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చిన సంజరుకి, నిర్మాతలకి ధన్యవాదాలు’ అని అన్నారు. హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఈ ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్’ అని చెప్పారు.
‘ఈ సినిమాకు రియల్ సౌండ్ పార్టీలు నిర్మాతలే. రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా’ అని దర్శకుడు సంజరు శేరి అన్నారు. నిర్మాత రవి పొలిశెట్టి మాట్లాడుతూ,’సినిమాలో ఐదు, పది నిమిషాలు కామెడీ సీన్ ఉంటేనే ఆ సినిమాను చాలా సూపర్ హిట్ చేస్తున్నారు. అలాంటిది ఇందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. సంజరు రైటింగ్ స్టైల్ చూస్తే త్రివిక్రమ్‌లా కనిపించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’ అని తెలిపారు. ‘సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి. ఇంత మంచి ప్రాజెక్టులో నాకు పార్ట్‌నర్ షిప్ ఇచ్చిన రవికు థ్యాంక్స్’ అని మరో నిర్మాత మహేంద్ర అన్నారు.