34 ఏండ్ల ప్రపంచ చరిత్రను రికార్డు చేసిన గొప్ప చిత్రం

కాలం ఎవరి కోసమూ ఆగదు. కాలంతో పాటు మనిషి జీవితం ప్రయాణిస్తుంది. నిరంతరంగా మానవ జీవితం సాగిపోతూనే ఉంటుంది. తన చుట్టూ స్వార్ధంతో మనిషి సష్టించుకున్న పరిస్థితులు సమస్త మానవాళిని ప్రభావితం చేస్తూ పోతాయి. ఎంత గొప్ప వారయినా, ఎంత విద్వత్తు, సామర్థ్యం ఉన్న వ్యక్తులయినా ఈ పరిస్థితుల ప్రభావానికి బలి కావలసిందే. ఆ విషాదాన్ని అనుభవించవలసిందే. మనిషి సష్టించే విధ్వంసం ప్రతి ఒక్కరిని తాకుతూనే పోతుంది. వీటన్నిటిని దాటుకునే మానవ జీవితం ముందుకెళుతుంది. కోల్పోయిన ఆశలు, ఆశయాలు, ఆదర్శాల మాటునే తమకు మంచి జరుగుతుందని, తమ జీవితాలకు ఓ సార్ధకత లభిస్తుందని మనుషులు ఆశపడతారు. దేశాలుగా విభజింపబడి తమను తాము ఓ ప్రాంతానికి పరిమితం చేసుకుంటూ మనుషులు తమ దేశం, తమదైన ప్రపంచం అత్యంత వేదనాభరితమైన వైపరిత్యాలను, విపత్తులను దాటుకుని ఓ శాంతియుతమైన దారిలోకి నడుస్తాయని భవిష్యత్తుపై కోరికతో సాగుతూనే ఉంటారు. అందుకే సమస్త మానవ ప్రపంచం అశ్వికదళంలా, సమూహంగా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అలా నిరంతరం ప్రయాణించే దళాన్ని ‘కవాల్కేడ్‌’ అంటారు.

నోయల్‌ కోవార్డ్‌ అనే రచయిత ఈ పేరుతో 1931లో ఇంగ్లీషులో ఓ నాటకం రాశారు. 1900 మొదలుకొని అంటే ఓ కొత్త శతాబ్దం ప్రారంభం నుండి అప్పటి సంవత్సరం (1932) దాకా, ఇంగ్లండ్‌ నేపథ్యంలో మానవాళి ఎదుర్కొన్న విపత్తుల నడుమ జీవించిన వ్యక్తుల జీవితాలను, ఆ పరిస్థితుల ప్రభావం ఉన్నత, మధ్యతరగతి జీవితాలపై ఎలా ఉండిందో రెండు కుటుంబాల నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేశారు నోయల్‌. కుటుంబ జీవితంలో అతి ముఖ్య పాత్ర పోషించేది స్త్రీ. మౌనంగా తన చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతూ ఎంతో శక్తితో ముందుకు సాగిపోయే ప్రయత్నం చేసే భార్య, తల్లి పాత్రలలో స్త్రీని చూపిస్తూ కథ నడిపించారు రచయిత. అందుకే కథకు ఓ గాఢత వచ్చి చేరింది. అన్ని రకాల వైపరీత్యాలను భరిస్తూ సహనంగా జీవించడం ఒక్కటే మనిషి ఈ ప్రపంచంలో చేయవలసింది. కుటుంబం దగ్గరకు వచ్చే సరికి ఈ సహనం స్త్రీ ప్రదర్శించే బలం. అదే బలాన్ని ఆలంబనగా తీసుకుని మానవ సమాజం భవిష్యత్తు వైపుకి ప్రయాణిస్తుంది. ఆ బలాన్నే ఈ నేపథ్యంలో చాలా గొప్పగా చర్చించారు రచయిత. ఇదే కథను 1933లో ప్రాంక్‌ లాయిడ్‌ సినిమాగా తీశారు. ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ పొందిన ఈ సినిమా మానవ సమాజ పరిణామాన్ని, జీవన విధానాన్ని గొప్పగా చర్చిస్తుంది.
1899, డిసెంబర్‌ 31 రాత్రి రాబోయే కొత్త శతాబ్దానికి స్వాగతం పలకడానికి లండన్‌లో ధనిక ఉన్నత కుటుంబానికి చెందిన రాబర్ట్‌, జేన్‌ మారియట్‌ అనే జంట తమ టౌన్‌హౌస్‌కి చేరతారు. ఎడ్వర్డ్‌, జో వీరి కుమారులు. ఎనిమిది, ఆరు సంవత్సరాల ఈ ఇద్దరు పిల్లలు కూడా తల్లిదండ్రులతో కొత్త సంవత్సరం, కొత్త శతాబ్దిపై ఆశతో ఆ రాత్రి ఆనందంగా గడుపుతారు. బ్రిటీష్‌ సామ్రాజ్యం ఆ సమయంలో ఆఫ్రికా యుద్ధ వాతావరణం ఎదుర్కొంటుంది. దీన్ని బోయిర్‌ యుద్ధంగా చరిత్రకారులు చర్చిస్తారు. ఆ యుద్ధంలో పాల్గొనడానికి రాబర్ట్‌ తన పేరు నమోదు చేసుకుంటాడు. ఇది జేన్‌ని బాధిస్తూ ఉంటుంది.
వారి ఇంట్లో పని చేయడానికి మరో కుటుంబం ఉంది. ఆల్ఫ్రెడ్‌ ఆ ఇంటి బట్లరు. అతని భార్య ఎలెన్‌ ఫానీ అనే ఓ చంటి పాపకు తల్లి. ఆల్ఫ్రెడ్‌ కూడా యుద్ధంలోకి వెళ్ళడానికి పేరు ఇచ్చి ఉంటాడు. అతనికేమయినా జరిగితే తన పరిస్థితి ఏంటని ఎలెన్‌ కన్నీళ్ల పర్యంతమవుతూ ఉంటుంది. అక్కడ్‌ జేన్‌ పరిస్థితి కూడా అంతే. అయితే భిన్న వర్గాలకు చెందిన ఈ ఇద్దరు స్త్రీలు విషాదాన్ని భరించే స్థితి కూడా భిన్నంగానే ఉంటుంది. ఎలెన్‌ కన్నీరు కార్చినట్లు ఉన్నత వర్గానికి చెందిన జేన్‌ చేయలేకపోతుంది. యుద్ధంలో చేరడం తమ పౌరుషానికి చిహ్నం, బాధ్యత అనే వుద్దేశంతో ఆ ఇద్దరు పురుషులూ స్త్రీలను ఒంటరివాళ్లను చేసి యుద్ధంలోకి వెళ్లిపోతారు. జేన్‌ స్నేహితురాలు మార్గరెట్‌ హారిస్‌ ఆ సమయంలో జేన్‌కి ఎంతో అండగా నిలుస్తుంది. ఆమె కూతురు ఎడిత్‌ జేన్‌ చిన్న కుమారుడు జో తోటిది. ముగ్గురు పిల్లలు కలిసి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కొన్ని రోజుల వేదన తరువాత యుద్ధం ముగిసి మగవారు ఇంటికి చేరతారు. రాబర్ట్‌ సేవలను ప్రభుత్వం గుర్తించి అతనికి నైట్‌ హుడ్‌ ఇస్తుంది. పెరిగిన సామాజిక స్థాయి ఆ కుటుంబానికి ఓ హోదా తీసుకొస్తుంది.
ఆల్ఫ్రెడ్‌కి రాబర్ట్‌ కొంత ధన సహాయం చేసి అతనో పబ్‌ పెట్టుకోవడానికి పెట్టుబడి పెట్టిస్తాడు. దీనితో ఆ కుటుంబం తమదైన ఓ ప్లాట్‌లోకి మారి మధ్యతరగతిలోకి చేరతారు. ఆ సమయంలోనే విక్టోరియా రాణి మరణించిందని కబురు వస్తుంది. దేశం మొత్తం రాణికి కన్నిటి వీడ్కోలు ఇస్తుంది. ఈ సామూహిక దు:ఖంలో ఆ రెండు కుటుంబాలు కూడా పాలు పంచుకుంటాయి. దేశంలో మారబోయే పరిస్థితులకు మౌన సాక్షులుగా మిగులుతారు వాళ్లు.
ఆల్ఫ్రెడ్‌ పబ్‌ నిర్వహించే క్రమంలో మందుకు బానిసవుతాడు. పని మానేసి ఇరవై నాలుగు గంటలు మత్తులో గడుపుతూ ఉంటాడు. ఎలెన్‌ భర్త వ్యసనంతో ఇంటి పరువు పోతుందని బాధపడుతూ ఉంటుంది. ఒకసారి వీరిని కలవాలని వచ్చిన జేన్‌, పెద్ద కొడుకు ఎడ్వర్డ్‌లకు భర్త సంగతి చెప్పకుండా దాచాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆల్ఫ్రెడ్‌ వారి కంట పడడంతో జేన్‌కు ఎలెన్‌ బాధ అర్ధమవుతుంది. తన కుటుంబ పరువు పాత యజమానురాలి ముందు పోయిందని అభిమానవతి అయిన ఎలెన్‌ బాధపడుతుంది. భర్తతో గొడవ పడుతుంది. కోపంతో బైటికి వెళ్లిన ఆల్ఫ్రెడ్‌ ఆ మత్తులో గుర్రపుబండి కింద పడి చనిపోతాడు. తండ్రి ప్రవర్తనతో విసిగి ఉన్న చిన్న కూతురు ఫాని నాట్యంలో తనను తాను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆమె నాట్యంలో ప్రతిభ చూపడం మొదలెడుతుంది. ఎలెన్‌ పబ్‌ నిర్వహణ తన చేతుల్లోకి తీసుకుంటుంది. కుటుంబ ఆర్ధిక స్థాయి మెరుగవుతుంది.
కొంత కాలం గడిచాక మళ్ళీ జేన్‌ ఎలెన్‌లు సముద్రపు ఒడ్డున ఎదురుపడతారు. ఫాని నాట్యంలో ప్రతిభావంతురాలవుతుంది. ఎడ్వర్డ్‌, తల్లి స్నేహితురాలు మార్గరెట్‌ కూతురు తమ చిన్ననాటి స్నేహితురాలు ఏడిత్‌తో ప్రేమలో పడతాడు. వీరి బంధాన్ని ఆ రెండు కుటుంబాలూ ఆమోదిస్తాయి. ఆ సముద్రపు ఒడ్డునే లూయిస్‌ బ్లేరియాత్‌ ఇంగ్లీషు చానల్‌ని తన మోనోప్లేన్‌లో ఆకాశమార్గాన దాటడం వీరంతా చూస్తారు. ఆకాశమార్గాన మానవ ప్రయాణానికి నాంది పలికిన ఆ గొప్ప క్షణాలకు సాక్షులుగా ఆ కుటుంబం చరిత్రలో మిగిలిపోతారు.
వివాహం తరువాత హనీమూన్‌ కోసం కొత్త దంపతులు సముద్ర మార్గాన బయలుదేరతారు. 14 ఏప్రిల్‌ 1912 అర్ధరాత్రి అట్లాంటిక్‌ సముద్రాన్ని చూస్తూ తమ భవిష్యత్తు గురించి కలలు కంటున్న ఆ జంటకు తాము ఎక్కిన టైటానిక్‌ ఇంకొన్ని క్షణాలలో మునిగిపోబోతుందని తెలియదు. ఈ జంట మరణం రెండు కుటుంబాలను తీరని దు:ఖంలోకి తోసేస్తుంది. మిగిలి ఉన్న ఒకే ఒక్క కొడుకు జో పైనే జేన్‌ ప్రాణాలు పెట్టుకుని పెద్దబిడ్డ ఎడ్వర్డ్‌ మరణం కలిగించిన దు:ఖాన్ని దిగమింగుకుంటుంది. ఈలోగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఈసారి కూడా రాబర్డ్‌ యుద్ధంలో తన దేశం తరుపున సేవ అందించడానికి వెళతాడు. జో తండ్రి బాటలో సైన్యంలో చేరతాడు. అచ్చం రాబర్ట్‌లా మారిన కొడుకుతో జేన్‌ ఏమీ వాదించలేకపోతుంది. మౌనంగా ఆ యుద్ధపు రోజులను భరిస్తూ పోతుంది. ఆమె గుండెలో నాటుకున్న ఆ భయం అర్ధం చేసుకున్నా, దాన్ని తల్లి బలహీనతగా కొట్టిపడేస్తాడు జో. వయసుతో పెరిగిన అనుభవంతో రాబర్ట్‌ జేన్‌ని అర్ధం చేసుకున్నా జోని నిర్దేశించే స్థితిలో తాము లేమని తెలుసుకుని మౌనంగా కొడుకు నిర్ణయాన్ని ఆమోదిస్తాడు.
సైన్యంలో చేరిన తరువాత ఓ క్లబ్‌లో నాట్యం చేస్తున్న ఫానీని జో చూస్తాడు. ఆమె గానం, అందం అతన్ని ఆకట్టుకుంటాయి. తనను తాను పరిచయం చేసుకుని ఆమెతో స్నేహం చేస్తాడు. తన సెలవు సమయం అంతా ఆమెతోనే గడుపుతాడు. వివాహ ప్రస్తావన ఆమె వద్దకు తీసుకువస్తాడు జో. తమ ఇద్దరి నేపథ్యాలు వేరని అతనికి గుర్తు చేసి, అయినా యుద్ధం తరువాత తాము ఈ విషయం గురించి మాట్లాడుకోవచ్చని అప్పటి దాకా ఆ బంధాన్ని ఇలాగే ఉంచమని చెబుతుంది ఫాని.
ఫాని జోని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఎలెన్‌, జేన్‌ని కలిసి వారిద్దరి వివాహం జరిపించవలసిందే అని పట్టుబడుతుంది. జేన్‌ పనివారి కుటుంబంలోని అమ్మాయిని కొడుకు ప్రేమించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. ఎలెన్‌ ద్వారా ఈ సంగతి వినడం ఆమెను ఇంకా బాధపెడుతుంది. ఆ బాధలో ఉండగానే జో యుద్ధంలో మరణించాడన్న వార్త ఆమెకు చేరుతుంది మరోసారి కుప్పకూలిపోతుంది జెన్‌.
ఇక ఆ తరువాత ఆ దేశంలో మారిన పరిస్థితులు, పాప్‌, జాజ్‌ ప్రభావం, ఆధునికత పేరుతో వడివడిగా వచ్చిన మార్పులు, రాజకీయంగా దేశం అనుభవిస్తున్న సంక్షోభం, మతంలోని రాజకీయాలు వీటన్నిటిని చిత్రంలో వడివడిగా చూపిస్తారు దర్శకులు. మానవ జీవితం, మనుషుల ఆలోచనలు, ఆదర్శాలలో విపరీతమైన మార్పు వచ్చి చేరుతుంది. దీన్ని మౌనంగా గమనిస్తూ ఉంటారు రాబర్ట్‌, జేన్‌లు. క్లబ్‌లో గాయనిగా బతుకుతున్న ఫాని, తన పాటల ద్వారా తమ జీవితాలలోని అయోమయాన్ని నిరంతరం ప్రస్తావిసూ, యువత అనుభవిస్తున్న గందరగోళ స్థితికి ప్రతీకగా ఒంటరిగా మిగిలిపోతుంది.
జీవితంలో అన్ని రకాల విషాదాలను దాటుకుని వైరాగ్య స్థితికి చేరుకున్న రాబర్ట్‌, జేన్‌లకు జీవితంలో మిగిలి ఉన్న ఒకే ఒక కోరిక, ఏదో ఓ రోజు తమ దేశం కోల్పోయిన గౌరవం, గొప్పతనం, శాంతి తిరిగి చేరాలి అని. 1932 డిసెంబర్‌ 31 అర్ధరాత్రి రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి మళ్ళీ తమ టౌన్‌హౌస్‌కు చేరతారు ఆ దంపతులు. విషాదాన్ని దాటుకుని వైరాగ్యానికి సమీపంగా, జీవితాన్ని అన్ని దు:ఖాలతో సమానంగా స్వీకరించిన ఈ జంట తమ జీవితాన్ని ఒక మారు తిరిగి చూసుకుంటారు. తాము పొందిన దు:ఖాలు, అనుభవించిన శోకం మాటున అప్పుడప్పుడు తొంగి చూసిన ఆనందాలను కూడా ఆ క్షణంలో గుర్తు చేసుకుంటూ డిగ్నిటీ, గ్రేట్‌సెస్‌, పీస్‌ అంటూ ఈ దంపతులు ఆకాశంవైపుకు ఆశగా చూస్తుండగా చిత్రం ముగుస్తుంది. గౌరవం, గొప్పతనం, శాంతి… మానవ ప్రపంచ ప్రయాణం ఈ మజిలీ వైపుగా సాగాలి అన్న కోరికతో, అలాగే సాగుతుందన్న నమ్మకంతో ఈ వద్ధులు భవిష్యత్తు కోసం టోస్ట్‌ చేస్తుండగా చిత్రం ముగుస్తుంది.
ఈ సినిమాకు ఆర్ట్‌ డైరక్షన్‌, దర్శకత్వం, ఉత్తమ చిత్రం కేటగిరిలలో మూడు ఆస్కార్‌లు లభించాయి. జేన్‌ పాత్ర చేసిన డయానా విన్‌యార్డ్‌ నటన ఆకట్టుకుంటుంది. ఉత్తమ నటి కేటగిరిలో ఆమెకు నామినేషన్‌ లభించినా మార్నింగ్‌ గ్లోరి సినిమాకు కేథరీన్‌ హెప్బర్న్‌ అవార్డు గెలుచుకున్నారు. కాని ఆమె చాలా గొప్పగా గంభీరంగా సినిమాను నడిపించిన విధానం నేటికీ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. సమాజాన్ని, దేశ పరిస్థితులని కుటుంబ నేపథ్యంలో చర్చిస్తూ స్త్రీ కోణంలో మానవ విధ్వంసాన్ని చూపించిన ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన ఓ గొప్ప క్లాసిక్‌ అన్నది నిజం. 34 ఏండ్ల బ్రిటన్‌ దేశ పరిస్థితులను చూపుతూనే అంతర్జాతీయంగా మానవ ప్రపంచం ఆ సమయంలో అనుభవించిన సంక్షోభాన్ని రికార్డు చేసిన చారిత్రక చిత్రంగానూ దీనిని అభివర్ణించవచ్చు.

– పి.జ్యోతి, 98853 84740