
మండల పరిధిలో గుడితండ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు గోసుల వెంకన్నను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశ కార్యక్రమానికి ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ నాయక్ పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని మారుమూల గిరిజన తండ,ఎలాంటి బస్సు సౌకర్యాలు లేనప్పటికీ గుడితండ లోని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రతిరోజు సూర్యాపేట నుండి సమయానికి వచ్చేవారని అన్నారు. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు విద్య బోధన చేస్తూ విద్యార్థులకు క్రీడలు,ఆట పాటలు తదితర కార్యక్రమాలు నేర్పించడమే కాకుండా విద్య పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభ్యున్నతికి కృషి చేస్తుండడంతో విద్యార్థులకు ఉపాధ్యాయుని మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. బదిలీపై వెళ్తుండడంతో జీర్ణించుకోలేని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు,తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి గురయ్యారన్నారు. గోసుల వెంకన్న సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించేవాడని, పాఠశాల బలోపేతానికి కృషి చేశారని అన్నారు. ఉద్యోగి జీవితంలో బదిలీలు తప్పనిసరి అని,ఎక్కడ పని చేసిన వారి సేవలు,జ్ఞాపకాలు మాత్రమే మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఉత్తమ విద్యా బోధనతోనే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజిత,వీర నాయక్,లాలు నాయక్,రవి, పార్వతి,బిచ్చ గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.