జానీ మాస్టర్‌కు ఘన సన్మానం

To Johnny Master A great honorఇటీవల ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘తిరుచిత్రాంబలం’ సినిమాలోని ‘మేఘం కరుగత. ‘ పాటకు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కి అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ వల్లభనేని, ఫిలింఛాంబర్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ భూషణ్‌, నిర్మాతలు ప్రసన్నకుమార్‌, దామోదర ప్రసాద్‌, శేఖర్‌ మాస్టర్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో జానీ మాస్టర్‌ మాట్లాడుతూ – ‘ప్రభుదేవా చేసిన ‘వెన్నెలవే వెన్నెలవే’ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటకు నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. ఇలాంటి పాట ఒకటి నేనూ చేయాలనే కలగనేవాడిని. ఆ అవకాశం ధనుష్‌ ‘తిరుచిత్రాంబలం’తో నాకు దక్కింది. అక్కడ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్‌ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రాఫ్‌ చేసేందుకు నన్నే పిలిపించారు ధనుష్‌. ఆయనకు, ‘తిరుచిత్రాంబలం’ మేకర్స్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా. మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నాం అంటే అందుకు ముక్కురాజు మాస్టర్‌, డ్యానర్స్‌ అసోసియేషన్‌ నాయకులు చేసిన కృషే కారణం. ఈ పెద్దలు వేసిన బాటలో మేమంతా నడుస్తూ ముందుకెళ్తున్నాం. మన మాస్టర్స్‌ ఎన్నో ట్రెండీ స్టెప్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తెలుగు డ్యాన్స్‌ మాస్టర్స్‌కు బాగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది పవన్‌ కల్యాణ్‌. నాకు నేషనల్‌ అవార్డ్‌ రాగానే ఆయన అభినందిస్తూ, మెసేజ్‌ పంపారు. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ఏది సాధించినా ఆ క్రెడిట్‌ నన్ను ప్రోత్సహించిన మా అమ్మా నాన్నలకే చెందుతుంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’ అని అన్నారు.