పడగలెత్తుతున్న విద్వేషం

A growing hatredచిన్న విషయాలుగా వీటిని భావించి కొట్టిపారెయ్యడానికి వీలులేదు. పొరపాటని, సరికాదని బయటికి అధికారపార్టీ సభ్యులు ఎంత చెబుతున్నా, వారి నిజమైన ఆలోచనల సారం అదేననేది బహిరంగ రహస్యం. దేశంలోని లౌకిక ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తమై, ఐక్యంగా ప్రతిఘటించకపోతే, దేశం మొత్తంలో ఈ విద్వేష విషం పారకమానదు. ఎన్నోయేండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రజాస్వామిక, లౌకిక విలువలను కాలరాయటాన్ని సహించకూడదు.
నూటానలభై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ ప్రజలకు బదులుగా ప్రతినిధులు సంభాషించే వేదిక. అదీ కొంగొత్త చట్టసభా ప్రాంగణం. నూతన లోక్‌సభ ఆరంభం కాగానే ముడుచుకున్న పడగలను విప్పుతున్న వైనం చూస్తే, ఎంత విషం దాగుందోనని ఆందోళన వేస్తోంది. పాము తనపైకి ఎవరైనా వస్తేనే కోరలిప్పుతుంది. కానీ వీళ్లకు విద్వేషం చిమ్మటమే సహజమైన లక్షణంగా ఉంది. కొత్తపార్లమెంటు సాక్షిగా వీరి కల్మష భాషణం మానవ మాత్రులకు గగుర్పాటు కలిగిస్తోంది. సభ్యసమాజం నివ్వెరపోయే సంఘటన మొన్న కొత్త పార్లమెంటు భవనంలో చోటుచేసుకోవటం అత్యంత బాధాకరమే కాదు, నీచం కూడా. బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు డానిష్‌ అలీని బీజేపీ లోక్‌సభ సభ్యుడు రమేశ్‌ బిధూడీ దూషించిన తీరును చూస్తే ఎంతటి నీచమనస్తత్వాలు గౌరవసభలలోకి ప్రవేశిస్తున్నాయో! అని ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి శిక్షణా వారసులు, అనాగరిక ప్రవర్తకులు అధికారంలోకి వచ్చారేనని బాధకలుగుతుంది.
పార్లమెంటు చరిత్రలో ఇలాంటి భాషణం జరిగివుండదు. ఒక మహావిద్యావేత్త మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ లాంటివారు నడయాడిన సభ. ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌, ఏ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ లాంటివారు అధిపతులుగా పనిచేసిన ప్రదేశంలో… ”ఏరు ఉగ్రవాదీ… ముల్లా ఉగ్రవాదీ, భడ్వే, కట్వా, వీడిని బయటకు విసిరేయండి” అని సదరు బీజేపీ ఎంపీ డానిష్‌ అలీని దూషిస్తూ మాట్లాడటం ఎంత దారుణం! ఎంత విషమెక్కింది వీళ్ల ద్వేషానికి! రమేష్‌ బిదూడీ దూషిస్తూవుంటే, అధికార పక్ష సభ్యులు నవ్వులు పూయించటం చూస్తుంటే ఇది సామూహిక శిక్షణా నైపుణ్యమేనని తెలిసిపోతోంది. కొత్తపార్లమెంటు భవనంలో జరిగిన ఈ ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందని, ఆవేదనకు గురిచేసిందని డానిష్‌ అలీ బాధపడటం ఈ దేశ ప్రజలందరికీ బాధకలిగించే విషయం. ఇది ప్రతి భారతీయునికీ అవమానకరం. ఈ వ్యాఖ్యలను సభాహక్కుల కమిటీ పరిశీలనకు పంపాలని స్పీకర్‌కు లేఖరాసినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించి బిధూడీపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ, సదరు సభ్యున్ని కేవలం మందలించి చేతులు దులిపేసుకోవటం సరైనదికాదు. భిన్న మతాలు, భిన్న జాతులు, కులాలు గల భారత సమాజానికి ప్రాతినిధ్యం వహించే సభలో ఇలాంటి దూషణ ఎట్టి పరిస్థితులలోనూ క్షమించరానిదే అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు బయట ఎవరో చేశారంటే, ద్వేషం కక్కారని అనామకులని కొంత వొదిలేయొచ్చు. కానీ అధికార ప్రజాప్రతినిధి అలవోకగా నోరుపారసుకోవడం గమనిస్తే, ఆయనకంత ధైర్యాన్ని ఇస్తున్నది ఎవరు అనేది తేలికగానే అర్థమవుతుంది. ఇది సమస్త ప్రజానీకమూ గర్హించాల్సిన విషయం.
ఇదొక్కటే కాదు, ఏలినవారు నూతన పార్లమెంటు భవన ప్రవేశం సందర్భంగా తొలి చర్యగానే సభ్యులకు రాజ్యాంగ ప్రతులను అందజేశారు. ఆ రాజ్యాంగ ప్రతులలోని పీఠికలో ‘సోషలిస్టు’ ‘సెక్యులర్‌’ అనే పదాలనే ఎత్తేసారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడో చేర్చిన ఈ పదాలను తీసివేసిన ప్రతులను ఇవ్వటంలో వారి ఉద్దేశ్యాలు ఏమిటి? సోషలిస్టు తరహా విధానాలను మేము ఆచరించబోమని చెప్పటమే కదా! అంతేకాదు మన దేశ పరిపాలనకు పునాది విధానమైన భిన్నత్వంలో ఏకత్వం ప్రాతిపదికన నడుచుకోవాలనే ఆశయంతో చేర్చుకున్న సెక్యులర్‌ పదాన్ని కూడా తీసేయాలన్న వారి కోర్కెను ఇలా ప్రకటిస్తున్నారు. ఇదేమని నిలదీస్తే, సవరించకముందరి రాజ్యాంగ ప్రతిని అందించామని జవాబివ్వటం ఎంత బాధ్యతారాహిత్యం! భారతదేశాన్ని మతం ఆధారంగా మత రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న బీజేపీ ఈ కుటిల ప్రయత్నాలను సంకేతంగా తెలుపుతున్నదనే భావించవచ్చు. స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకున్న నేపథ్యంలో ఇలాంటి విచ్ఛిన్న వినాశక విన్యాసాలు దేశం ఇప్పటివరకు నిలుపుకున్న విలువలను ధ్వంసమొనర్చేవిగా ఉన్నాయి.
చిన్న విషయాలుగా వీటిని భావించి కొట్టిపారెయ్యడానికి వీలులేదు. పొరపాటని, సరికాదని బయటికి అధికారపార్టీ సభ్యులు ఎంత చెబుతున్నా, వారి నిజమైన ఆలోచనల సారం అదేననేది బహిరంగ రహస్యం. దేశంలోని లౌకిక ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తమై, ఐక్యంగా ప్రతిఘటించకపోతే, దేశం మొత్తంలో ఈ విద్వేష విషం పారకమానదు. ఎన్నోయేండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రజాస్వామిక, లౌకిక విలువలను కాలరాయటాన్ని సహించకూడదు.