హ్యాట్రిక్‌ ఖాయం

A hat trick is guaranteed– ఈ నెల 15న హస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు
– బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్‌
– కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు
– కాంగ్రెస్‌ అంటే మాటలు, మూటలు, ముఠాల పార్టీ
– గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్‌కు గొప్ప వరం
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చే నియోజకవర్గమని, ఎవరు అవునన్నా.. కాదన్నా.. రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లను, సభాస్థలిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌తో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం పట్టణంలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారని తెలిపారు. అక్టోబర్‌ 15న లక్ష మందితో హుస్నాబాద్‌ గడ్డమీద ప్రజా ఆశీర్వాద సభ చేపట్టామన్నారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో సిద్ధమైందని, అన్ని వర్గాల అభ్యున్నతికి, జనరంజకమైన పాలనకు సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం ప్రతి కార్యకర్తా సైనికుడివలె పనిచేయాలని పిలుపునిచ్చారు. నేడు దేశానికే రోల్‌ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామని, ఈరోజు దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలది కల్లబొల్లి కబుర్లు తప్ప వారు ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అంటే మాటలు, మూటలు, ముఠాల పార్టీ అని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.
హుస్నాబాద్‌ నియోజకవర్గం ఒకప్పుడు కరువు పీడిత, కల్లోలిత ప్రాంతమని.. నేడు అభివృద్ధికి చిరునామాగా మారిందని తెలిపారు. ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ప్రజల చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెసోళ్లు గ్లోబల్స్‌ ప్రచారం చేస్తున్నారని, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు. తప్పిపోయి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తెలంగాణ అభివృద్ధి కింద పడుతుందని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. అక్టోబర్‌ 15న సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందించి, బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసి మొట్టమొదటి ఎన్నికల సభ హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు తీపి కబురు చెబుతారన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ గడ్డ సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి మరొకసారి వేదిక కాబోతుందని, 2018లోనూ ఇక్కడ నుంచే ఎన్నికల సన్నాహక సభ నిర్వహించి ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ సారి అక్టోబర్‌ 15న ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు హుస్నాబాద్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పక్కన లక్ష మందితో ప్రజా ఆశీర్వాద సభ ఉంటుందన్నారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి మరొకసారి సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు అన్వర్‌, మండల అధ్యక్షులు వంగ వెంకట్రామిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.