విద్వేష ‘మూర్తి’

Sampadakiyamమన రాజ్యాంగానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో చర్చ జరుగుతోంది. బయటనేమో రాజ్యాంగ ఉల్లంఘనలు, వ్యతిరేక ఆచరణలూ విరివిగా కొనసాగు తున్నాయి. ఈ ఉల్లంఘనలు వ్యక్తులో, కొందరు సంఘ వ్యతిరేకులో చేస్తున్నది కాదు. రాజ్యాంగాన్ని రక్షించాల్సినవారే. మొన్న మొన్నటి వరకూ రాజకీయ నాయకులూ, కొన్ని పార్టీలూ ఈ పనిచేస్తున్నా యనుకున్నాం. కానీ, ఇప్పుడు ఎవరైతే రాజ్యాంగం ప్రకారం ఈ దేశ ప్రజలందరికీ న్యాయం జరిగేట్లు చూడాల్సిన బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులే ఈ ఉల్లంఘనలకు పాల్పడటం విపరీత పరిణామం. అలహాబాదులో విశ్వహిందూ పరిషత్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా తీవ్రమైందిగా పరిగణించాల్సి ఉంది. అందుకనే ఆ న్యాయమూర్తిని తొలగించడానికి రాజ్యసభ సభ్యులు, సభ సెక్రటరీ జనరల్‌కు అభిశంసన నోటీసునూ అందించారు.
ప్రధానంగా జస్టీస్‌ యాదవ్‌ మాట్లాడిన మాటల్లో ముఖ్యమైనది. ”ఈ దేశం, ఇక్కడ నివసిస్తున్న ‘మెజారిటీ’ కోరికల ప్రకారం నడుస్తుంది. ఇది చట్టం” అన్నాడు. మెజారిటీ కోరికల ప్రకారం న్యాయమూర్తులు, చట్టాలు, న్యాయాలు పనిచేస్తే ఇక రాజ్యాంగం ఎందుకు? న్యాయానికీ మెజారిటీకి సంబంధం ఉందా! ఇది ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన ఆలోచనేనా! అప్పుడు బలహీనవర్గాలు, మైనారిటీ వర్గాల హక్కులు, న్యాయం కోల్పోవలసిందేనా! మతమార్పిడులు, యూనిఫారమ్‌ సివిల్‌ కోడ్‌, వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లులు మొదలైన అంశాలపై చర్చించే వీహెచ్‌పీ సమావేశంలో న్యాయమూర్తి ప్రసంగం చేయటమే, న్యాయ వ్యవస్థ విలువలను మంటగలపడమైతే, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మరీ దారుణం.
మెజారిటీ ప్రజల కోసమే పాలనా, న్యాయము కొనసాగాలని కోరుకునే వాళ్లు మతపరంగా ప్రజలలో విషబీజాలను నాటాలనీ, విద్వేషాలను రెచ్చగొట్టాలనీ, విభజించాలనీ ప్రయత్నిస్తున్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు.
మెజారిటీ ప్రకారమే ఏ న్యాయమైనా అన్నపుడు, మహాభారత యుద్ధమే గుర్తుకు వచ్చింది. అందులో కౌరవులు వందమంది. పాండవులు ఐదుగురే. వందమంది మెజారిటీ కదా! వారు చెప్పినట్లే పరిపాలన సాగాలంటే రాజ్యం వారికే చెందేది. కానీ కృష్ణుడు పాండవుల పక్షం చేరి న్యాయం కోసం పాటుపడ్డాడని భారత కథ చెప్పే నీతి. భారత రామాయణాలు, భగవద్గీత గురించి తరచూ మాట్లాడే సంఫ్‌ు పరివారం, వీటి నుండి ఏమీ నేర్చుకోరా? మత ఆవలంబకుల సంఖ్యను ఆధారం చేసుకుని న్యాయమూ, పరిపాలన చేయటం, మనం ఏర్పరచుకున్న రాజ్యాంగానికి వ్యతిరేకమయినవి. మెజారిటీ ప్రకారమే నడవాలని మనం ఇక్కడ కోరుకుంటున్నామంటే పక్కన బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న వివక్షతల్ని దాడుల్ని సమర్థిస్తామా? అది ఆటవిక న్యాయమే అవుతుంది. చట్టం బహుసంఖ్యాకులకు అనుకూలంగా పనిచేస్తే అల్ప సంఖ్యాకుల హక్కులకు, స్వేచ్ఛకు, న్యాయానికి అవకాశమే ఉండదని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం.
అంతేకాదు, దేశంలోని జస్టిస్‌ యాదవ్‌ మాట్లాడుతూ జంతువుల వధను చూస్తూ పెరిగే పిల్లలు సహనం, కరుణ కలిగి ఉండరని మాంసాహారులందరిపైన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పర్సనల్‌ లా పేరుతో పెళ్లిళ్లు, సంప్రదాయాలు అంటే కుదరదనీ మాట్లాడారు. ఈ దేశంలో జంతువులను వధించి విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేస్తున్న వారిలో ఎక్కువమంది మెజారిటీగా ఉన్న మతస్తులే ఉన్నారన్న విషయం జస్టీస్‌కు తెలియకపోవడం విచారకరం. మాంసాహారులు, మాంసం విక్రయించే వాళ్లు కరుణ, సహనం లేని వాళ్లవుతారనే పాఠం ఆ స్థాయి న్యాయమూర్తి నుండి రావడం మన దౌర్భాగ్యం. అసలు ఒక మతం కోసం, దాని రక్షణ, సేవ కోసం పనిచేస్తున్న సెక్టేరియన్‌ సంస్థ నిర్వహించే సమావేశానికి న్యాయమూర్తి హాజరుకావడమే సరికాదు. కోర్టుల్లో, చట్టసభల్లో చర్చించబడుతున్న అంశాలపై బహిరంగంగా న్యాయమూర్తులు మాట్లాడటం న్యాయ విలువలకు సంబంధించిన పెద్ద సమస్య. రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చినవారు, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రాజ్యాంగంపై దాడిగానే భావించాలని, ఇది ఆందోళనకర విషయమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యరాలు బృందాకరత్‌ చేసిన వ్యాఖ్య వాస్తవిక ప్రతిస్పందనే. న్యాయ వ్యవస్థను కూడా మతతత్వంతో నింపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విద్వేష విభజన ప్రచారానికి కారణం. తరతరాలుగా వస్తున్న మతసామరస్యత, సహనం, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ వారసత్వం. దీన్ని విచ్ఛిన్నం చేయటమేకాక, రాజ్యాంగాన్ని కూడా ధ్వంసం చేయాలని పూనుకోవడం దుర్మార్గమైనది. రాజ్యాంగం అమలులోకి వచ్చిననాడే సంఫ్‌ు పరివార్‌శక్తులు, అంబేద్కర్‌ రాజ్యాంగం మాకు సమ్మతం కాదని స్పష్టంగానే ప్రకటించారు. మనుధర్మ శాస్త్రమే మా రాజ్యాంగమనీ సెలవిచ్చారు. అట్లాంటి వారు 75 ఏండ్ల రాజ్యాంగాన్ని భక్షిస్తారు కాని రక్షించలేరు. అందులో భాగమే జస్టిస్‌ వ్యాఖ్యలు. ప్రజలే దీన్ని తిప్పికొట్టాలి.