నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లలో డాక్టర్స్, సిబ్బంది నియామకాలు చేపట్టాలని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్, డెంగీ జ్వరాల వల్ల ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి జిల్లా,మండల, గ్రామ పంచాయతీ పరిధిలలో హెల్త్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలతోపాటు ప్రైవేట్ డాక్టర్స్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృతమైన హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన చికిత్సలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత,నగర కార్యదర్శి రాజు లు పాల్గొన్నారు.