నవతెలంగాణ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం పంభాపూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై ఇదే మండలానికి చెందిన కాలుపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన చింత సతీష్ ఉపాధ్యాయునికి, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటాపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజేష్, యుటిఎఫ్ మండలాధ్యక్షుడు సుతారి పాపారావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పంబాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన చింత సతీష్ సేవలను కొనియాడారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల నమోదు విషయంలో సందీప్ బాధ్యతగా విధులు నిర్వహించారని కొనియాడారు. తోటి ఉపాధ్యాయులతో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు, మాజీ సర్పంచ్ ఎల్లబోయిన జానకి రాంబాబు, మాజీ సర్పంచ్ అర్రెం కృష్ణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రాజేష్, ఉపాధ్యాయులు హనుమంత్, సుతారి పాపారావు, గ్రామస్తులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు మంకిడి మంజుల, ఉపాధ్యాయులు నాలి సమ్మయ్య, తోలెం రవికుమార్, అంగన్వాడి టీచర్ చంద్రకళ, గ్రామస్తులు ఎల్లబోయిన నాగేష్, అనసూర్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.