వేడెక్కిన ఎన్నికలు

A heated election– రాహుల్‌ రాకతో పెరిగిన కాక
– విమర్శలు, ప్రతివిమర్శలతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల ప్రచారహోరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గత వారం, పది రోజుల నుంచి మారిపోతున్నాయనీ, కాంగ్రెస్‌ పుంజుకుంటున్నదనే సర్కారీ వేగుల సమాచారంతో బీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. గతంలో తమకు బీజేపీనే ప్రత్యర్థి అన్న బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుండటం పట్ల రాజకీయ విశ్లేషకులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇందుకు ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ నుంచి వస్తున్న హెచ్చరికలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ప్రస్తుతం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తన సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి సంధిస్తున్న విమర్శలు గులాబీ కోటకు గట్టిగానే తగులుతున్నాయి. అందుకే సీఎం కేసీఆర్‌సహా అన్నాచెల్లెళ్లు కేటీఆర్‌,కవితలు సైతం రాహులపై విరుచుకుపడుతున్నారు. దీంతో రాజకీయా ఒక్కసారిగా వెడేక్కాయి.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. మాటల తూటాలు పేలుతున్నాయి. శూలాల్లాంటి విమర్శలు సంధిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చేసుకుంటున్న పరస్ఫర విమర్శలు అప్పుడే జనంలో చర్చకు దారితీస్తున్నాయి. ఇరుపార్టీలు నేతలు వ్యక్తులుగా, మ్యానిఫెస్టోలపైనా విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. బస్సుయాత్ర పేర తెలంగాణలో అడుగుపెట్టిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆలస్యం, గులాబీ సర్కారుపై పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ సైతం ఎడాపెడా సభలతో రాష్ట్రాన్ని చుట్టేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటికే పలు బహిరంగసభల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ ప్రచారం సాగుతుండగా, వాటికి ధీటుగా సీఎం కసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత స్పందిస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్‌ వినూత్న పంథాను ఎంచుకుంది. తొలుత ప్రధాన నాయకుల నియోజకవర్గాల్లో ప్రచారం మొదలెడితే, ఆ ఊపు మిగతా స్థానాల్లో కొనసాగుతుందనే వ్యూహంతో సాగుతున్నది. గతంలో వైఎస్సార్‌ ప్రజాప్రస్థానం తరహాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చేవెళ్ల నుంచి ప్రారంభమైన ప్రజాప్రస్థానం చివరిదాకా ఒకేఊపులో నడవడమే అప్పట్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణమైందంటూ ఆ పార్టీ సమీక్షల్లో వచ్చింది. ఆ తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్‌ అడుగులేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటు ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గం, అటు సీఎల్పీ ఉప నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథనీ నుంచి కాంగ్రెస్‌ ప్రచారం ఆశించినరీతిలోనే మొదలైంది. సాగింది. బహిరంగసభలకు ప్రజలు సైతం భారీగా రావడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహాం వెల్లివిరుస్తున్నది. ఇదిలావుంటే రాహూల్‌, ప్రియాంక ఒకేసారి ప్రచారానికి రావడం ఇప్పుడు కచ్చితంగా కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందనే సమాలోచనలు రాజకీయ విశ్లేషకుల్లో నడుస్తున్నాయి. ఈ యువనాయకత్వం తెలంగాణపై పట్టుసాధించి ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవాలనే భావనతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే, డిసెంబరులో ప్రమాణం చేసేది కాంగ్రెస్సేననే ధీమాతో ఎన్నికల గోదాలోకి దిగారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత విమర్శలకు ఘాటుగానే స్పందిస్తున్నారు. దేనీకైనా రె’ఢ’ అనే పద్ధతిలో పార్టీని నడిపిస్తున్నారు. తెలంగాణను ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లోనూ ప్రచారంలో కాంగ్రెస్‌ పెడుతున్నది. దొరల తెలంగాణ మనకొద్దు, ప్రజల తెలంగాణే కావాలంటూ రాహుల్‌ చేసిన విమర్శ, కేసీఆర్‌ కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకేనని స్సష్టమవుతున్నది. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్న వైనాన్ని సర్వత్రా చర్చ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రగతిభవన్‌ను గడీలా మార్చేశారనీ, జనానికి అందుబాటులో ఉండరనీ, తమకు అవసరం ఉన్నప్పుడే పిలుస్తారనీ, ప్రజల అవసరాలను పట్టించుకోరనే పద్ధతిలో కాంగ్రెస్‌ ప్రచారం సాగిస్తున్నది. ఆ పార్టీ సీనియర్లకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో అందరూ కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కునే వాతావరణం వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై రాహుల్‌గాంధీ చేసిన విమర్శ ప్రభుత్వాన్ని గట్టిగానే తాకింది. దీనికి కేటీఆర్‌ సాకులు వెతికే పనిలో పడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్సే నెంబర్‌ వన్‌ విలన్‌ అంటూ సీఎం కేసీఆర్‌ సైతం వ్యాఖ్యానించారు.