వేడెక్కిన ఎన్నికల ప్రచారం

వేడెక్కిన ఎన్నికల ప్రచారం– అధికారం కోసం హోరాహోరీ పోరు
– గులాబీ దళంలో ఆ నలుగురు
 కాంగ్రెస్‌లో ఒకే ఒక్కడు
– కమలంలో ఆ ముగ్గురు
– కారు,హస్తం ఢీ అంటే ఢీ
– పోరాటలే అస్త్రాలుగా కమ్యూనిస్టులు
– డీలా పడ్డ బీజేపీ
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికారం కోసం పార్టీలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో మాటల యుద్ధం మర్మోగుతున్నది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విమర్శల దాడి మరింత పెరింది. ‘ఒక్కొక్కరు కాదు షేర్‌ఖాన్‌…వంద మందిని ఒకేసారి రమ్మను’ అంటూ మగధీర సినిమాలో డైలాగ్‌ తరహాలో నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల అగ్రనేతలు తగ్గేదేలే…అన్నట్టు ఎన్నికల క్షేత్రంలో గర్జిస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌పై పదునైన అస్త్రాలు వదులుతున్నారు. ఆ నలుగుర్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ నుంచి ఒకే ఒక్కడు అధ్యక్షులు రేవంత్‌రెడ్డి శాయశక్తుల పోరాడుతున్నారు. బీఆర్‌ఎస్‌పై ఆరు గ్యారంటీలనే బ్రాహ్మస్త్రాలుగా సంధిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ విమర్శకు రేవంత్‌ ప్రతి విమర్శ చేస్తూ తమ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు. బీజేపీ నేతలు జి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, కె లక్ష్మణ్‌ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మ్యానిఫెస్టోపై ప్రచారం చేస్తున్నారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
టీఆర్‌ఎస్‌ నుంచి సీఎం కేసీఆర్‌తోసహా ఇతర నేతలందరూ రాష్ట్ర నలువైపులకు వెళ్లి కాంగ్రెస్‌పై మూకుమ్మడి ఎదురుదాడి చేస్తున్నారు. ఆపార్టీ వైఫల్యాలే కాకుండా అక్కడక్కడ వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. బహిరంగ సభలు, సోషల్‌ మీడియా ద్వారా హైటెక్‌ ప్రచారం చేస్తున్నారు. గతంలో బీజేపీయే తమకు ప్రత్యామ్నాయం అన్న గులాబీ నేతలు తమ రూటు మార్చుకున్నారు. కాంగ్రెస్సే లక్ష్యంగా ప్రచార సరళిని కొనసాగిస్తున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి కేటీఆర్‌ తన ప్రచార సరళిని కూడా మార్చుకున్నట్టు కనబడుతున్నది. య్యూటుబర్‌ గంగవ్వతో నాటు కోడి కూర వండి ప్రచారాన్ని కొత్త రూట్‌లోకి తీసుకెళ్లారు. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్‌నారాయణ, ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌, గోరటి వెంకన్న తదితరులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఎన్నికల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. నిరుద్యోగులకు దూరమవుతున్నట్టు గ్రహించిన బీఆర్‌ఎస్‌…కొంత మంది నిరుద్యోగులను పైన కూర్చొబెట్టి, మంత్రి కేటీఆర్‌ కింద కూర్చొని చేసింది ఎన్నికల స్టంట్‌ అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మరోవైపు మంత్రి హరీశ్‌రావు చాపకిందనీరులా పోల్‌మేనేజ్‌మెంట్‌ చేస్తూన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరించేందుకు ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలను ప్రలోభాలకు గురి చేసి కారెక్కించుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌ జిల్లాకే పరిమితమైనప్పటికీ క్రిష్టియన్‌, మైనార్టీ, మహిళలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి గట్టేక్కెందుకు వారు అనేక జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే టాక్‌ వినిపిస్తున్నది.కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు అధికార బీఆర్‌ఎస్‌ అనేక రకాల ప్రచారాన్ని మొదలు పెట్టింది. చివరకు 1957 నుంచి 2014 వరకు ఆ పార్టీ అవినీతిపై స్కాంగ్రెస్‌ పేరుతో ప్రకటనలు ఇచ్చింది. మరోవైపు ఆ నలుగురు చేస్తున్న విమర్శలకు రేవంత్‌రెడ్డి ఒక్కడే ధీటైన జవాబు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా తమ నియోజకవర్గాలకు పరిమితమైనప్పటికీ రేవంత్‌ మాత్రం మొత్తం ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.ఆయన సభలకు జనం కూడా తండోపతండాలుగా వస్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటరిస్తూ…రేవంత్‌ ముందుకు సాగుతున్నారు.పార్టీ సీనియర్‌లు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు వంటి నేతలు…తమ నియోజకవర్గంతోపాటు ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప ఎక్కడికి వెళ్లడం లేదు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి దాదాపు అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. వీటితోపాటు ఆయన పోటీ చేస్తున్న కొడంగల్‌, కామారెడ్డి నియో జకవర్గాలకు సైతం రెండుసార్లు వెళ్లారు. ఉచిత కరెంట్‌పై, కర్నాటక రైతులతో బీఆర్‌ఎస్‌ చేస్తున్న కుట్రలను ఆయన బయట పెట్టారు. ఫేక్‌ ధర్నాలు చేస్తున్నారనే విషయాన్ని బహిర్గతం చేశారు. రైతులకు మూడుగంటల కరెంట్‌ చాలన్నట్టు బీఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌పై చేసిన విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారు.వీరందరికి భిన్నంగా ప్రజా సమస్యలు, తమ పోరాటాలే ప్రచారాస్త్రాలుగా కమ్యూనిస్టుల ప్రచారం సాగుతోంది.రాష్ట్రంలో ఎంత వేగంగా బీజేపీ గ్రాఫ్‌ పెరిగినట్టు ప్రచారమైందో, అంతే వేగంగా పడిపోతున్నది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలు అక్కడ ఇముడలేక తిరిగి సొంత పార్టీల్లోకి వెళుతున్నారు. అనేక ప్రతిబంధాల మధ్య ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్ర నాయకులు జి కిషన్‌రెడ్డి, లక్ష్మన్‌, ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తున్నా…అది మూడు ముక్కలాటలా ఉన్నది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నది. జాతీయ నాయకులను రంగంలోకి దించినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీమ్‌ అన్న కాంగ్రెస్‌ విమర్శలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. కేంద్ర నిధులు, కొత్తగా ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఆ పార్టీ ప్రచారం చేస్తున్నది. బీజేపీ , బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇటీవల కమలం పార్టీ కారు పార్టీ నేతలపై మాటల దాడి మొదలు పెట్టినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం.