– నేడు సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి
నవతెలంగాణ – జన్నారం
(మొగల్ సామ్రాజ్యంలో ప్రభువుల అండదండలు చూసుకుని అరాచకాలకు పాల్పడుతున్న జమీందార్లు, జాగీర్దార్ల పెత్తనానికి ఫుల్‌స్టాప్ పెట్టి.. అట్టడుగువర్గాల మనుగడ కోసం తనకు తెలియకుండానే కత్తి పట్టిన సర్దార్ సర్వాయి పాపన్న ఆ తర్వాత చరిత్రనే తిరగరాశాడు. పాపన్న 1650 ఆగస్టు 18న రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే మృతిచెందగా తల్లి సర్వమ్మ అన్నీతానై పెంచింది. పాపన్న కల్లుగీత వృత్తిని కొనసాగిస్తూ యుక్త వయస్సులో భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల దాష్టీకాలను ఎదిరించి పోరుబాట పట్టాడు. కాకతీయుల పాలన ముగిసిన 300 ఏళ్ల తర్వాత 1650 నుంచి 1709 వరకు పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆంగ్లేయులు మనదేశంపై కన్నేయడం కన్నా ముందే..సామ్రాజ్య కాంక్షతో దేశాన్ని.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కొందరు పాలకుల అరాచకాన్ని ఎదిరించి తానే సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆగస్టు 18 ఆయన జయంతి) పై ప్రత్యేక కథనం
ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉన్న రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న సొంత గ్రామం. గౌడ కులంలో పుట్టిన పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి సర్వమ్మే అన్నీ తానై అతడిని పెంచి పెద్దచేసింది. చిన్నతనం నుంచే జమీందార్లు, దొరల అరాచకాలను చూస్తూ పెరిగిన సర్వాయి పాపన్నలో సహజంగానే రాచరికపు వ్యవస్థపై వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. తల్లి కోరిక మేరకు గౌడ కుల వృత్తిని చేపట్టిన సర్వాయి పాపన్నకు.. దొరల చేతుల్లో, మొగల్ సామ్రాజ్య సైనికుల చేతిలో ఎదుర్కొన్న అవమానాలు వారిపై ఉన్న వ్యతిరేకభావాన్ని మరింత పెరిగేలా చేశాయి. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహేబ్‌లతో కలిసి తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల గురించి వివరించి వారిలో చైతన్యం రగిల్చాడు.
దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి
17న శతాబ్ధంలో..అంటే..అప్పటికి ఆంగ్లేయులు ఇంకా భారతదేశంపై కన్నేయడం కన్నా ముందు.. సామ్రాజ్యవాద కాంక్షతో దేశాన్ని.. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ గడగడలాడించిన ఆయన బహుజనుల నుంచి భారీ మద్దతు కూడగట్టుకున్నాడు. సర్వాయి పాపన్నకు అనుకోకుండానే ఒకరోజు ఊహించని ఘటన ఎదురైంది. గ్రామాల్లో శిస్తులు వసూలు చేసుకుని గోల్కొండ కోటకు తిరిగి వెళ్తున్న సైనికులు.. సర్వాయి పాపన్న కల్లు గీసే తాటి చెట్ల వద్ద ఆగి ఎప్పటిలాగే ఎలాంటి రుసుము ఇవ్వకుండా కల్లు సేవించారు…అదే సమయంలో తన స్నేహితుడిపై దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకున్న పాపన్న అక్కడికక్కడే ఆ సైనికుడి మెడ నరికేశాడు..తనపై దాడికి దిగిన మిగిలిన సైనికుల పనిపట్టి… ఆ సైనికులు వసూలు చేసిన శిస్తును తిరిగి అక్కడి గ్రామాల్లో పేదలకు పంచిపెట్టడంతో సర్వాయి పాపన్న ఉద్యమం మొదలైంది.
జమిందార్లు, దొరలు దోచుకున్న సొమ్మును తిరిగి దోచుకుని ప్రజలకు పంచుతూ..
సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సామాన్యుడు
రాజ వంశానికి చెందినవాడు కాదు..రాజుల అండదండలు లేవు..కానీ అతి సామాన్యుడైన సర్వాయి పాపన్న తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాడు. అంతకన్నా ముందుగా ప్రజలను దోచుకుతింటున్న పెత్తందార్ల పనిపట్టాడు. జమిందార్లు, దొరలు దోచుకున్న సొమ్మును తిరిగి దోచుకుని ప్రజలకు పంచుతూ.. మరోవైపు ఆయుధాలు సమకూర్చుకున్నాడు. తాను పుట్టి పెరిగిన ఖిలాషాపురంలోనే ఒక పెద్ద శత్రుదుర్భేద్యమైన దుర్గాన్ని నిర్మించాడు. అక్కడి నుంచే తన రాజ్యపాలన ఆరంభించాడు. తన సైన్యాన్ని వెంటేసుకుని వెళ్లి చిన్న చిన్న సంస్థానాలు, దొరల గడీలపై దాడులు చేసి వాటిని ఆక్రమించుకున్నాడు. రాజ కుటుంబంలో పుట్టకపోయినా.. రాజనీతిజ్ఞిని ప్రదర్శిస్తూ పేదోళ్లకు రాజయ్యాడు, అరాచకుల సింహస్వప్నంగా మారాడు.
సర్వాయి పాపన్న చరిత్ర ప్రజలందరికీ తెలియాలి (గాజుల ముకేశ్ గౌడ్.తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ )
పాపన్న గౌడ్ తన పరిధిలో సామాజిక న్యాయాన్ని సమర్థిస్తూ అనేక ప్రశంసనీయమైన చర్యలను చేపట్టారు. ముఖ్యంగా, అతను ఎల్లమ్మపై ఉన్న ప్రగాఢ భక్తి కారణంగా తాటి కొండలో చెక్ డ్యామ్‌ను నిర్మించాడు . అదేవిధంగా హుజూరాబాద్‌లో శాశ్వతమైన ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాడు. ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవిత చరిత్రను విద్యార్థులు చదువుకునేలా పాఠ్యంశంలో చేర్చాలి, పాపన్నగౌడ్ విగ్రహన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడమే గాకుండా పార్లమెంట్ లో చిత్రపటాన్ని పెట్టాలి. ఈ దిశగా కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. సర్వాయి పాపన్న ఆనాడు పాలించిన కోటలను పర్యటక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలి. ఆయన వీరత్వాన్ని గుర్తించి లండన్ మ్యూజియంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మన దేశంలో ఆయన స్మారక చిహ్నం గా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం.