నిరంకుశత్వాన్ని రికార్డ్‌ చేసిన చారిత్రక చిత్రం

A historical film that records totalitarianismఏ దేశ చరిత చూసినా ఏమున్నది గర్వ కారణం,
నరజాతి చరిత సమస్తం పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం:
రణరక్త పవ్రాహసిక్తం బీభత్సరస పధ్రానం పిశాచగణ సమవాకారం:
నరజాతి చరిత సమస్తం దరిదుల్రను కాల్చుకుతినడం
రాచరికపు వ్యవ్యస్థలో నలిగిన మానవ సమాజం, తరతరాల మానవ చరిత్ర గురించి శ్రీశ్రీ కన్నా గొప్పగా మరెవరూ చెప్పలేరేమో. బ్రిటీష్‌ రాచరికపు చరిత్రను చదువుతుంటే మానవ సమాజం పట్ల ఏహ్యత కలుగుతుంది. ఆ విశాల రాజప్రసాదాలు, ఆ వైభోగాల నడుమ మనుషులు ఎంత నికష్ట జీవితాలను గడిపారో తలచుకుంటే రాచరికపు జీవితాలపై జాలితో కూడిన అసహ్యం కలగక మానదు. హెన్రీ VIII పాలనా సమయం, మొదటి ఎలిజిబెత్‌ రాణి కుటుంబ చరిత్ర తెలుసుకుంటే.. రాచరికం పట్ల ఏమాత్రం ఆకర్షణ ఉన్నా.. హరించుకుపోతుంది.
1491 నుంచి 1547 వరకు ఇంగ్లండును పాలించిన హెన్రీ VIII అన్న ఆర్థర్‌. ఇతని వివాహం పదిహేనేండ్ల వయసులోనే కేథరిన్‌ అనే రాజవంశీకురాలితో జరుగుతుంది. కాని పెండ్లి అయిన ఇరవై వారాలకే ఆర్థర్‌ చనిపోతాడు. కేథరీన్‌ వితంతువు అవుతుంది. అప్పుడు హెన్రీ వయసు పదేండ్లు. తరువాత కొన్నాళ్లకి రాజకీయ లాభాల కోసం తన కన్నా ఆరేండ్లు పెద్దదయిన కేథరీన్‌ని హెన్రీ కోరి వివాహం చేసుకుంటాడు. పైగా అది తన తండ్రి ఆఖరి కోరిక అని ఈ వివాహం తగదన్న వారి నోర్లు మూయిస్తాడు. కేథరిన్‌ అందమయిన తెలివైన యువతిగా అప్పటికే రాజకుటుంబంలో పేరు సంపాదించు కుంది. ఆమెకు రాజ్యాధికారుల మధ్య ఎంతో గౌరవం ఉండేది. ఆర్థర్‌తో తనకు వివాహం జరిగినా అతనితో తాను సంసారం చేయలేదని, తాను కన్యగానే వితంతువునయ్యానని పెద్దలతో చెప్పడంతో, అప్పటి మతాచారాల ప్రకారం మరో వివాహానికి చట్టబద్దంగా అర్హురాలని నిర్ణయిస్తారు మత పెద్దలు.
హెన్రీతో వివాహం తరువాత కేథరిన్‌కు పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోతారు. నలుగురు బిడ్డల తర్వాత పుట్టిన మేరి ఒక్కతే బతుకుతుంది. ఆ తరువాత కూడా కేథరిన్‌కి ఓ బిడ్డ పుట్టి చనిపోతాడు. దీనితో తమ వివాహం దేవతలు అంగీకరించలేదని, అన్న భార్యను పెండ్లి చేసుకుని తాను తప్పు చేసానని బాధపడడం మొదలెడతాడు హెన్రీ. అప్పటికే అతనికి ఎందరో ప్రియురాళ్లు. కేథరిన్‌ చెలికత్తె మేరీ బోలిన్‌ తోనూ హెన్రీకి సంబంధం ఉంటుంది. ఆమెతో మోజు తీరాక, ఆమె చెల్లెలు ఆనీ బోలేన్‌ను ప్రేమిస్తాడు. ఆనీ మేరీ కన్నా తెలివైనది. హెన్రీని కట్టిపడేస్తుంది తప్ప అతనికి చిక్కదు. ఆమెను అందుకోవాలంటే వివాహం తప్పదని హెన్రీకి అర్ధమవుతుంది. కేథరిన్‌ ఉండగా రెండో వివాహం చెల్లదు. అందుకని కేథరీన్‌తో వివాహం రద్దు చేయమని చర్చ్‌ను కోరతాడు. కాని అప్పటి నియమాల పరంగా చర్చ్‌ దీనికి ఒప్పుకోదు. హెన్రీ చర్యను కొందరు పెద్దవారు ఖండిస్తారు. కాని హెన్రీ మతాన్ని, రాజ్య నియమాలను తన ఇష్టానుసారంగా తిప్పుకుని బతికిన స్వార్ధపరుడు. అతనికి భయపడి ముందు తప్పన్నవారే, తర్వాత అతని అధికారానికి లొంగి మౌనం వహించారు. కాని హెన్రీ అహంకారాన్ని తప్పని ఖండించి, చివరిదాకా అతనికి తలవంచని వారిలో సర్‌ థామస్‌ మోర్‌ ఒకరు. ”ఎ మాన్‌ ఆఫ్‌ ఆల్‌ సీసన్స్‌” ఈ ధామస్‌ మోర్‌ చివరి రోజులను, అప్పటి బ్రిటీష్‌ రాచరికపు రాజకీయాలను రికార్డు చేసిన సినిమా.
థామస్‌ మోర్‌ పదహారవ శతాబ్దిలో జీవించిన ఆంగ్ల న్యాయవాది, న్యాయమూర్తి, సామాజిక తత్వవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఔత్సాహిక వేదాంతవేత్త, ప్రసిద్ధ పునరుజ్జీవనోద్యమ మానవతావాది. ఈయన హెన్రీ VIII దగ్గర లార్డ్‌ ఛాన్సెలర్‌ అంటే హెన్రీ మంత్రుల్లో ఒకరుగా పనిచేసాడు. 1516లో ‘యుటోపియా’ అనే రాజకీయ గ్రంధాన్ని రాసిన మేధావి. ఈ సినిమా అతని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది.
హెన్రీ తన భార్య కేథరీన్‌తో వివాహాన్ని రద్దు చేయమని అప్పటి పోప్‌ క్లెమెంట్‌ VII కి థామస్‌ వోల్సే అనే మతాధికారి ద్వారా వినతి పత్రం పంపిస్తాడు. థామస్‌ వోల్సే హెన్రీ VIII సమయంలో కాథలిక్‌ కార్డినల్‌గా పని చేసేవారు. 1509లో హెన్రీ ఇంగ్లండ్‌కు రాజు అయినప్పుడు, వోల్సే రాజుకి మత గురువయ్యాడు. హెన్రీ తన వివాహాన్ని రద్దు చేయమని, ఆనీని వివాహం చేసుకుంటానని వోల్సేపై ఒత్తిడి తీసుకొచ్చేవాడు. ఇది తట్టుకోలేక వోల్సే దీన్ని ఇంగ్లండులో నిర్ణయించలేమని రోమ్‌లోనే పరిష్కారం దొరుకుతుందని పోప్‌ క్లెమెంట్‌కి ఓ వినతిపత్రం రాయిస్తాడు. అయితే ఆ లేఖలో అందరు మంత్రుల సంతకాలు కావాలి. కాని థామస్‌ మోర్‌ దానిపై సంతకం చేయడు. వోల్సే అతన్ని స్వయంగా అడిగినా అది తన మనస్సాక్షికి విరుద్ధం అని బదులిస్తాడు థామస్‌. ఆనీతో తనకు మగసంతానం కలుగుతుందని అది రాజ్య భవిష్యత్తుకు అవసరమన్నది హెన్రీ అభిప్రాయం. రాజ్యంలో శాంతిభద్రతల కోసం చర్చ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి హెన్రీ కోరిన విధంగా అతని మరో వివాహానికి సహాయం చేద్దాం అంటాడు వోల్సే. కాని థామన్‌ అది చర్చిని తాము నమ్మిన దైవాన్ని అవమానించడమని ఈ ప్రతిపాదనకు ఒప్పుకోనని అంటాడు. వోల్సే నౌఖరు థామస్‌ క్రాంవెల్‌ ఈ సంభాషణను వింటాడు.
మోర్‌ దగ్గర రిచర్డ్‌ రిచ్‌ అనే ఓ ఉద్యోగి ఉంటాడు. ఇతను రాజు దగ్గర ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ మోర్‌ సిఫార్సు కోసం వస్తాడు. కాని అతని స్వభావానికి రాజదర్బారులో ఉద్యోగం తగదని, అతన్ని అధ్యాపక వత్తిలోకి వెళ్ళమని చెప్తాడు మోర్‌. కాని రిచర్డ్‌ తక్కువ కాలంలో రాజ్యంలో ఉన్నత పదవికి ఎగబాకాలని చూస్తున్న వ్యక్తి. ఎలాగైనా రాజసభలోకి చేరాలన్నది అతని కోరిక. మోర్‌ కూతురు మెగ్‌ని విలియం రోపర్‌ అనే ఓ మేధావి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మోర్‌ ఆ రోజుల్లోనే స్త్రీల విద్యను ప్రోత్సహించిన వ్యక్తి. అందుకే తన కూతురిని బాగా చదివిస్తాడు. ఆమె జీవితాన్ని ఆమె నిర్ణయాలకు వదిలేస్తాడు. ఆమెకు తనతో సమానంగా ఆ ఇంట గౌరవం ఉండేలా ఇంటి వాతావరణాన్ని తీర్చిదిద్దుతాడు. కాని మోర్‌ కాథలిక్‌. రిచర్డ్‌ లూథేరియన్‌. అంటే ప్రొటెస్టెంట్లలో మార్టిన్‌ లూథర్‌ మార్గాన్ని అనుసరించేవాడు. అందుకని తాను ఈ వివాహానికి తన సమ్మతి ఇవ్వలేనని చెబుతాడు మోర్‌. ఇది అప్పటి ఇంగ్లండ్‌లో కేథలిక్‌లకు ప్రొటెస్టేంట్లకు నడుమ ఉన్న వైరాన్ని సూచిస్తుంది. ఇంగ్లండ్‌ చరిత్ర అంతా కూడా ఈ రెండు వర్గాల ఘర్షణతో ప్రభావితమయింది. తనకు ఆ వివాహం ఆమోదం కాదంటాడు. కాని మెగ్‌ దే తుది నిర్ణయమనీ ఆమెకు భర్తను ఎంచుకునే స్వేచ్ఛనూ ఇస్తాడు మోర్‌.
వోల్సే తన పని చేయట్లేదని హెన్రీ కోపంతో అతన్ని దూరం పెడతాడు. అతని పదవి పోతుంది. ఓ మారుమూల గుడిలో అతను హీనాతిహీనంగా చనిపోతాడు. వోల్సే తర్వాత హెన్రీ థామస్‌ మోర్‌ ను తన లార్డ్‌ ఛాన్సెలర్‌గా నియమిస్తాడు. హెన్రీ స్వయంగా మోరే ఇంటికి వచ్చి అతన్ని కలిసి తన వివాహాన్ని రద్దు చేయించే పని చూడమని కోరతాడు. కాని మోరే తన మనసు అంగీకరించని పని తాను చేయలేనని చెబుతాడు. హెన్రీ అతన్ని ఎన్నో రకాలుగా ప్రలోభపెడతాడు కాని మోరె దేనికీ లొంగడు. వోల్సే నౌఖరు క్రామ్వెల్‌ రాజుకి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అవుతాడు. రిచర్డ్‌ను ప్రలోభపెట్టి మోరే పై నిఘా పెట్టమని చెబుతాడు.
రోపర్‌ రాజుతో విభేదించిన మోరేను గౌరవంతో మరోసారి కలుస్తాడు. చర్చిపై వైరం సాగించే రాజు చర్యలను అతను విమర్శిస్తాడు. ఈలోగా రిచర్డ్‌ రిచ్‌ మళ్ళీ మోరేను తనకు రాజ దర్బారులో పదవి ఇప్పించమని బతిమాలుతాడు. మోరే దాన్ని కాదన్నందుకు అతనిపై పగ పెంచుకుంటాడు. క్రాంవెల్‌తో కలుస్తాడు. హెన్రీ పార్లమెంట్‌లో తన మంత్రులను మతపెద్దలను ఇంగ్లండ్‌ చర్చి పై తనకే సర్వాధికారాలను ఇస్తున్నట్టు అంగీకరించమని, పోప్‌ ఆధిపత్యాన్ని తిప్పికొట్టమని ఆజ్ఞాపిస్తాడు. హెన్రీపై భయంతో ఇంగ్లండ్‌లో అందరూ చర్చ్‌ కన్నా అతన్ని ఉన్నతుడిగా అంగీకరిస్తారు. అతని అధికారాన్ని ఆమోదిస్తారు. దీన్ని అంగీకరించలేని మోరే తన పదవికి రాజీనామా చేస్తాడు. మౌనంతో తన అసమ్మతి ప్రకటిస్తాడు. ఎవరితోనూ రాజుకు విరుద్ధ్దంగా మాట్లాడడు, తన అభిప్రాయం చెప్పడు కాని రాజుని చర్చ్‌ కన్నా ఉన్నతుడిగా అంగీకరించలేని నిబద్దతను తన చర్యలతో ప్రకటిస్తాడు మోర్‌.
హెన్రీ కేధరిన్‌తో పెళ్లి చెల్లదనిపించుకుని, ఆనీ బోలీన్‌ని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహానికి కూడా మోరే హాజరు కాడు. దానితో అతను రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాడని క్రాంవెల్‌ అతన్ని పిలిపించి మాట్లాడతాడు. మోర్‌ ఏ ప్రశ్నకూ జవాబివ్వడు. మౌనంగా అక్కడి నుంచి నడుచుకుంటూ ఇల్లు చేరతాడు. అప్పటిదాకా అతన్ని నావలో నది దాటించడానికి పోటీపడే నావికులు అతను రాజుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని పట్టించుకోరు.
రాజ్యంలో అందరూ ఓ కొత్త ప్రతిజ్ఞ బూనాలని లేదంటే వారిని రాజద్రోహులుగా ఎంచుతారని ఓ చాటింపు వేయిస్తారు. మోర్‌ ఆ ప్రతిజ్ఞను విని, అది తనకు సమ్మతమయితేనే దాన్ని అంగీకరిస్తానని అంటాడు. ఆ ప్రతిజ్ఞలో హెన్రీని చర్చి అధికారిగా అంగీకరిస్తున్నట్టు చర్చి కన్నా అతన్ని ఉన్నతుడిగా ఆమోదిస్తున్నట్టు ఉండడంతో మోర్‌ ఆ పతిజ్ఞ చేయడు. దానితో అతన్ని రాజద్రోహం నేరం కింద బంధిస్తారు.
మోర్‌పై విచారణ జరుతుంది. తాను ఆ ప్రతిజ్ఞ చేయనని అంటాడు మోర్‌. కారణం వివరించి చెప్పనంటాడు. రాజు అధికారాన్ని అంగీకరించనని తాను అననంతవరకు తనను రాజద్రోహిగా ఎంచలేరన్నది న్యాయశాస్తాన్ని అభ్యసించిన మోర్‌కు తెలుసు. తనపై దుర్బుద్దిలో క్రామ్వెల్‌ నేరం మోపకుండా ఉండడానికి హెన్రీ విధానాలను బాహాటంగా ఖండించడు. కాని చర్చి కన్నా హెన్రీ ఉన్నతుడన్న విషయాన్ని తాను ఆమోదిస్తున్నాననే ప్రతిజ్ఞను చేయడానికి అంగీకరించడు. దానితో మోర్‌ సేకరించిన విలువైన గ్రంధాలన్నిటికి బలవంతంగా లాక్కుంటాడూ క్రాంవెల్‌. మోర్‌ తనను కలవడానికి వచ్చిన భార్యా, కూతురు, కాబోయే అల్లుడిని తన కోసం వాదించవద్దని వెంటనే దేశం విడిచి వెళ్లిపొమ్మని పంపించేస్తాడు.
బహిరంగ విచారణలో కూడా మోర్‌ తానెందుకు ప్రతిజ్ఞ చేయడో వివరించడు. రాజు రెండవ వివాహంపై ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చడు. మౌనమే ఆయుధంగా నిలబడిన మోర్‌కు శిక్ష పడాలంటె ఎవరో అతనిపై తప్పుడు సాక్షం ఇవ్వాలి. అప్పుడు రిచర్డ్‌ రిచ్‌ని పిలిపిస్తాడు క్రాంవెల్‌. రిచ్‌ అందరి ముందు మోర్‌ని రాజద్రోహిగా అంగీకరిస్తూ, అతను తనతో రాజు అధికారాన్ని తాను ఒప్పుకోనని చెప్పాడని అబద్దపు సాక్ష్యం ఇస్తాడు. దీని కోసం అతన్ని ఓ ఉన్నతాధికారిగా నియమిస్తాడు క్రాంవెల్‌. మోర్‌ తాను రిచ్‌ లాంటి వ్యక్తి వద్ద రాజుకి విరుద్దంగా మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకునే మూర్ఖుడిని కానని వాదిస్తాడు. కాని అతని మాటలు ఇక ఎవరూ వినే స్థితిలో ఉండరు. క్రామ్వెల్‌ అందరినీ తన ఎత్తుగడలతో నోరు మూయిస్తాడు. మోర్‌ను రాజద్రోహిగా నిరూపిస్తాడు.
తనకు మరణ శిక్ష తప్పదని తెలుసుకుని మోర్‌ చివరిసారిగా సభలోని వారి మధ్య చర్చిపై జాతీయ ప్రభుత్వాల అధికారం అనైతికమని ప్రకటిస్తాడు. రాజు ప్రమాణ స్వీకారంలోనే చర్చికు కట్టుబడి ఉండాలని ఉంటుందని దాన్ని అతిక్రమించడం అహంకారమని అంటాడు. దీనితో అందరిలోనూ కోపం పెరుగుతుంది. అతని శిరచ్ఛేదన విధిస్తారు.
టవర్‌ హిల్‌లో శిక్ష అమలు చేయడానికి మోర్‌ ను తీసుకు వస్తారు. చనిపోబోయే ముందు తలారిని తాను క్షమిస్తున్నానని ఊరడిస్తాడు మోర్‌. అతనికి తనను విముక్తిడిని చేస్తున్నందుకు కొంత పైకం ముట్టజెబుతాడు. చనిపోబోయే ముందు మోర్‌ పలికే చివరిమాట ఎవరూ మర్చిపోలేని నిజం. ”నేను రాజు సేవకుడిగా మరణిస్తున్నాను, కానీ దేవునికి నేను మొదటి సేవకుడినని నమ్ముతాను.” అని తల వంచుతాడు థామస్‌ మోర్‌. తలారి మోర్‌ తల నరికివేస్తాడు.
మోర్‌ మరణం తర్వాత వ్యాఖ్యాత ప్రేక్షకులకు చరిత్రలో తర్వాత జరిగిన విషయాలను వివరిస్తాడు. థామస్‌ మోర్‌ తలను ఓ నెల పాటు అక్కడే రాజద్రోహుల ద్వారం దగ్గర ప్రదర్శనకు పెట్టారు. తరువాత అతని కూతురు మార్గరెట్‌ దాన్ని అక్కడి నుండి తీసుకొచ్చి తాను మరణించేదాక తన దగ్గరే ఉంచుకుంది. ఐదేండ్ల తర్వాత క్రామ్‌ వెల్‌ కూడా రాజద్రోహం నేరం కింద శిరచ్ఛేదనకు గురయ్యాడు. ఆర్చ్‌ బిషప్‌ సజీవ దహనం చేయబడ్డాడు. రాజు సుఖవ్యాధులతో మరణించాడు. రిచర్డ్‌ రిచ్‌ నిద్రలో చనిపోయాడు. అలా ఆ శకం ముగిసింది.
ధామస్‌ మోర్‌ని తర్వాత కేథలిక్‌ చర్చి సెయింట్‌గా గుర్తించింది. ఈయన జీవిత కథను ముందుగా రాబర్ట్‌బోల్ట్‌ నాటకంగా రాసుకున్నారు. వీరితోనే స్క్రీన్‌ ప్లే రాయించి దీన్ని 1966లో దర్శకుడు ఫ్రెడ్‌ జిన్నెమన్‌ తెరకెక్కించారు. నాటకంలో థామస్‌ మోర్‌ పాత్రలో నటించి ప్రజల హదయాలలో స్థానం సంపాదించుకున్న పాల్‌ స్కాఫీల్డ్‌ ఈ సినిమాలో అదే పాత్రను అత్యద్భుతంగా పోషించారు. ముఖ్యంగా ఆ పాత్రలో ఆయన నటించిన విధానం, పలికే సంభాషణలు, కోర్టు సీన్‌ లోనూ, మరణ శిక్ష సమయంలోనూ ఆయన పలికించే హావభావాలు థామస్‌ మోర్‌ పాత్రను అజరామరం చేసాయి. హెన్రీ పాత్రలో రాబర్ట్‌ షా, వాల్సే పాత్రలో ఆర్సన్‌ వెల్ల్స్‌ నటన బావుంటుంది.
ఈ చిత్ర శీర్షిక మోర్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ మానవత్వమే ఊపిరిగా బతికిన మోర్‌ వ్యక్తిత్వానికి ప్రతిబింబం ఇది. మోర్‌ సమకాలీనుడైన రాబర్ట్‌ విట్టింగ్టన్‌ ప్రసంగం నుంచి ఈ శిర్షికను బోల్ట్‌ తీసుకున్నాడు. 1520లో థామస్‌ మోర్‌ గురించి రాబర్ట్‌ విట్టింగ్టన్‌ రాస్తూ అతన్ని ”ఏ మాన్‌ ఆఫ్‌ ఆల్‌ సీసన్స్‌” అని ప్రస్తావించాడు. థామస్‌ మోర్‌పై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న బోల్ట్‌ ఈ వ్యాసం చదివి తన నాటకానికి అదే పేరును ఖరారు చేసారు. తర్వాత సినిమా కూడా అదే పేరుతో రిలీజ్‌ అయింది. గొప్ప బ్రిటీష్‌ సినిమాల్లో 43వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు ఆరు ఆస్కార్లను గెలుచుకుంది. జిన్నెమాన్‌ ఉత్తమ దర్శకుడిగానూ, స్కాఫీల్డ్‌ ఉత్తమ నటుడిగానూ అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. స్క్రీన్‌ప్ల్లే, సినిమాటోగ్రఫీ, కాస్టూమ్‌ల విభాగంలోనూ దీనికి అవార్డులు లభించాయి.
ఇంత గొడవ చేసి హత్యలు చేసి ఆన్నీని వివాహం చేసుకున్న హెన్రీ ఆనీకి మగ సంతానం లేదని ఆమెను దూరం పెట్టాడు. ఆమె కూతురే మొదటి ఎలిజబెత్‌. హెన్రీకి కొడుకును కని ఇవ్వాలని ఆనే నరకం అనుభవించింది. చివరకు ఆనీ తన సోదరుడితోనూ మరో ముగ్గురు మగవారితోనూ అక్రమ సంబంధం కలిగి ఉందని తేల్చి ఆమె తల నరికేయించాడు ఆమె కోసం చర్చి పైనే యుద్ద్ధం చేసిన ప్రియుడు హెన్రీ. తర్వాత అతని అక్రమ సంబంధాలు మరి కొన్ని అయితే, వివాహాలు మరో రెండు. ప్రతి వివాహమూ చర్చిపై యుద్ధం చేసి చేసుకున్నదే. ఇన్ని చేసినా అతనికి మగ సంతానం లేదు. అందుకనే అతని మరణానంతరం అతని మొదటి సంతానం, అంటే కేథరిన్‌ కూతురు మేరి రాజ్యం పాలించింది. ఈమె కేథలిక్కు. అప్పటికే రాజ్యంలో ప్రొటెస్టన్ల హవా నడుస్తుంది. ఈమెకు సంతానం లేదు. కేథలిక్కులకు మద్దతుగా ఈమె ఎందరో ప్రోటెస్టన్లను హత్య చేయించింది. ఆమె మరణించిన తర్వాత ఇక ఆ వంశానికి చెందిన ఎలిజెబెత్‌ రాణి అయింది. ఈమె కేథలిక్కులను పక్కనపెట్టి ప్రొటెస్టన్లను పోషించింది. ఇది చరిత్ర.. ఎందరి రక్తంతోనో తడిచి మతం, అధికారం అహంకారంగా మారి పాలించిన రాచరికపు నైజాలను ఇప్పుడు రాయల్స్‌ అని మనం అబ్బురంగా చూస్తున్నాం. ఇది ఘనమైన బ్రిటీష్‌ రాజరికపు చరిత్ర. ”ఏ మాన్‌ ఆఫ్‌ ఆల్‌ సీసన్స్‌” ఈ చరిత్రను చర్చించే చారిత్రాత్మక చిత్రం.
పి.జ్యోతి
98853 84740