ఓ చారితక్ర జ్ఞాపకం

A historical memoryభూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తికోసం వీరతెలంగాణా విప్లవ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వీరులు ఎందరో. ఆ మహౌన్నత పోరాటంలో ప్రజా శత్రువులనెదిరించిన వీరవనితలూ ఎందరో… కండ్ల ముందే కన్న బిడ్డలను, అన్నదమ్ములను, ఆప్తులను పోగొట్టుకుని త్యాగాలు చేసి పోరాటమై నిలిచిన ఆ మహిళా మణిపూసల్లో కామ్రేడ్‌ పద్మ ఒకరు. 1932లో నాటి మెదక్‌జిల్లా, గజ్వేల్‌ తాలూకా, పాములపర్తిలో దొరల కుటుంబంలో జన్మించింది పద్మ. కిష్టారెడ్డి, రాధమ్మల చివరి సంతానం. ఆమె అసలు పేరు ప్రమీల. చాలా సుకుమారంగా పెరిగిందామె. 12వ ఏట కొమ్మిడి కోదండరాంరెడ్డితో వివాహం జరిగింది. ఆయన నాటి నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా, బ్రాహ్మణపల్లి. కమ్యూనిస్టు నాయకుడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న అన్ని రకాల ప్రజాఉద్యమాలకూ ఆ ప్రాంతంలో ఆయనే సారధి. ఆస్తిపరుడైనా పేదల తరపున నిలబడి పోరాడుతున్న భర్త ఆమెకు ఓ గొప్ప యోధుడిగా కనిపించాడు.
బయటి ప్రపంచమే తెలియని పద్మకు భర్త రాజకీయ జీవితం అనేకం నేర్పింది. తన భర్త కార్యాచరణకు తోడు నిలిచింది. కోదండరాంరెడ్డి చిన్నచిన్నగా పద్మకు రాజకీయ పాఠాలు నేర్పడం మొదలుపెట్టారు. పార్టీ సిద్ధాంతాలేమిటో పద్మ గ్రహించింది. తాను కూడా ప్రత్యక్ష పోరాటంలో భాగం కావాలనే ఆకాంక్ష బలపడుతుండగానే 1948 సెప్టెంబర్‌ 20న పద్మ, కోదండరాంరెడ్డిలకు కొడుకు పుట్టాడు. ఆ సమయంలోనే యూనియన్‌ సైన్యం ప్రవేశించి కమ్యూనిస్టులపై దాడులు ఉదతం చేయడంతో కోదండరాంరెడ్డి అజ్ఞాత జీవితంలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆమెకు పార్టీ చిల్కలగూడా ‘డెన్‌’ నిర్వహణా బాధ్యతలు అప్పగించింది. అలా పద్మ సాయుధ పోరాట జీవితం ప్రారంభమైంది. జీవితమే పోరాటమైన వారి ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం కదా! 1949 జూన్‌ 6వ తేదీన యూనియన్‌ సైనికుల తుపాకీ గుండ్లకు కోదండరాంరెడ్డి బలికావడంతో పద్మ జీవితం మరో మలుపు తిరిగింది. డెన్‌లో ఉన్న మిగిలిన మహిళా కామ్రేడ్స్‌ ఓదార్పులో.. భర్త జ్ఞాపకాలను పదేపదే గుర్తు చేసుకుంటూ క్రమంగా తన కర్తవ్యమేమిటో గ్రహించింది.
తానొక రాజకీయ విద్యార్థినని భావించింది. రాజకీయాలంటే ఏమిటో, పార్టీ అంటే ఏమిటో, గెరిల్లా పోరాటం అంటే ఏమిటో, ఆ దళాల పని ఏమిటో తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. రావి నారాయణరెడ్డి, ఎస్‌.వి.కె ప్రసాద్‌, మఖ్దూం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌, భీంరెడ్డి నర్సింహరెడ్డి వంటి పెద్దలు చేప్పిన రాజకీయ తరగతులు, ‘పద్మా నువ్వుగుండె గట్టిచేసుకోవాలి, పార్టీ ప్రతిష్టను నిలబెట్టాలి’ అన్న భర్త మాటలు, ఆమెను గెరిల్లా దళాలలోకి నడిపించాయి.
తుపాకులూ, రైఫిళ్లూ గురిపెట్టి కాల్చడం, తుపాకీలో మందు కూర్చటం, రైఫిళ్లు శుభ్రం చేయడం, తూటాలు సరిచేసి ఎక్కించడం, చేతి బాంబు (హేండ్‌ గ్రేనైడ్స్‌) విసరటం వంటి సాహసకత్యాలన్నీ అభ్యసించింది. ఓ సారి ఆ శిబిరానికి వచ్చిన కామ్రేడ్‌ సుందరయ్య.. పద్మ గురించి తెలుసుకుని అభినందించారు. పోరాటంలోకి వెళ్లవలసిన సమయం రానేవచ్చింది. కొడుకు తనతో వుంటే పోరాటానికి అడ్డమని కడుపు తీపి చంపుకుని బాబును వదిన దగ్గర వదిలి గెరిల్లా యుద్ధంలోకి తరలిపోయింది. ఆ యుద్ధంలో అనేక సాహసాలూ ఎదురు దెబ్బలు.. గాయాలు అన్ని తట్టుకుని నిలబడింది.
వారున్న డెన్‌పై దాడి జరగడంతో… కొత్త డెన్‌ నిర్వహణ బాధ్యతను పద్మ, గౌతమ్‌లకు అప్పగించింది పార్టీ. అప్పట్లో డెన్‌ నిర్వహణ కోసం కామ్రేడ్స్‌ భార్యాభర్తలుగా నటించినా%ౌౌ% తరువాత ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పార్టీ ప్రోత్సాహంతో 1950 ఏప్రిల్‌ 19న ఒకటయ్యారు.
ఓవైపు పోరాటం తీవ్ర నిర్బంధాల నెదుర్కొంటుంది. తానేమో బాలింతగా ఆస్పత్రిలో ఉంది. ఇప్పుడేం చేయాలి తను. కడుపు తీపా? కర్తవ్యమా? అన్న ఆ వీరమాత సంఘర్షణలో కర్తవ్యమే పైచేయి సాధించింది. పార్టీని ఒప్పించి కన్నబిడ్డను కడసారి గుండెలద్దుకొని పరాయి వారికప్పగించి పోరాటానికి తిరిగి సిద్ధమైంది. కానీ అప్పటికే పరిస్థితులు విషమించాయి. ఎటు చూసినా మిలటరీ సైన్యాల పహారాలో సాయుధ దళాలను కలుసుకోవడం కష్టమైంది. ఆ పరిస్థితుల్లో అతికష్టం మీద తప్పనిసరై ఓ కొరియర్‌ సహాయంతో తన అన్నల వద్దకు చేరుకున్నా, పోరాటంలో వున్న గౌతమ్‌ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని, దళాలను కలుసుకోవాలని చాలా ప్రయత్నించింది. కానీ గౌతమ్‌తో వివాహం ఇష్టంలేని అన్నలు ఆమెకు అస్సలు సహకరించలేదు. బస్తర్‌ వెళ్లిన దళంలో చనిపోయిన వారిలో గౌతమ్‌ కూడా ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తంచేశారు. అసలే పోరాటానికి దూరమైన బాధలో ఉన్న ఆమె ఒకవైపు కన్న కొడుకును, మరోవైపు కట్టుకున్న భర్తను కోల్పోయానన్న బాధతో గుండెలు పగిలిపోయేలా ఏడ్చింది. కానీ నిజానికి గౌతమ్‌ చనిపోలేదు. పోరాట విరమణ తరువాత బస్తర్‌ అడవుల నుండి గౌతమ్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. పద్మ ఎక్కడ ఉందో తెలియలేదు. ఆమెను కలవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పార్టీ వారు ఎవరూ పద్మను కలవకుండా అన్నలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నో కష్టాలు పడిన పద్మ చివరకు గౌతమ్‌ ఆచూకీ తెలుసుకొని కలుసుకున్నది. కొన్ని రోజులు పార్టీ సభ్యుల ఇండ్లల్లో తలదాచుకున్నారు. ఆ తరువాత పార్టీ సహాయంతో గోషామహల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అమరత్వానికి ప్రతీకగా తన జ్ఞాపకాలను మిగిల్చి నవంబర్‌ 7, 2014న కన్ను మూసింది. భూస్వాముల కుటుంబంలో పుట్టినా ప్రజా ఉద్యమంతో జీవితాన్ని మమేకం చేసిన విప్లవకారిణి పద్మ. అందుకే ప్రజా శత్రువుల అంతుచూడాలనే ఆమె దఢ నిశ్చయం ముందు కష్టాలు, కడగండ్లు ఓడిపోయాయి. ఆమే ఓ పోరాటమై గెలిచింది. చరిత్ర మిగిల్చిన జ్ఞాపకమై నిలిచింది.
– సలీమ, 9490099083