హాస్టల్ ఇల్లు లాంటిది.. విద్యార్థులను బిడ్డల్లా చూసుకోవాలి: కలెక్టర్

– విద్యతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలి
– వసతి గృహాల అధికారులకు ఓర్పు అవసరం 
– విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం  వహిస్తే సహించం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యనభసించే విద్యార్థులు అందరూ దారిద్ర్య  రేఖకు దిగువనున్న వారే ఉంటారని, హాస్టల్ వార్డెన్ గా పనిచేసే అధికారులకు తల్లికున్నంత ఓపిక ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయావరణలోని ఉదయాదిత్య భవన్లో అన్ని సంక్షేమ హాస్టళ్ల  వెల్ఫేర్ అధికారులు,కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్,  సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  హాస్టళ్లలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఎక్కడ తాగునీటి కలుషితం లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం  వంట సామాగ్రి సరఫరా చేస్తున్నది ? లేనిది చూడాలని, అన్ని హాస్టళ్లలో నిర్దేశించిన ప్రకారం సీట్లు భర్తీ చేయాలని, ఎక్కడైనా హాస్టల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హాస్టల్ ఇల్లు లాంటిది. హాస్టల్ నిర్వహణ చాలా కష్టతరమైనప్పటికీ ప్రభుత్వం పేద విద్యార్థులకు సేవ చేసే భాగ్యాన్ని మనందరికి కల్పించింది. ప్రభుత్వమిచ్చిన అన్ని సౌకర్యాలు కల్పించి వారిని బిడ్డల్లాగా చూసుకోవాలని సూచించారు.
  జిల్లాలో హాస్టళ్ళు, కేజీబీవీలు, మోడల్ స్కూల్ లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి రాకూడదని, ఎట్టి పరిస్థితులలో  హాస్టల్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, భోజనం విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని , హాస్టళ్లలో ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే తక్షణమే చేయించాలని,  సాధ్యం కానివి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అదే సమయంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన చదువును అందించాల్సిన బాధ్యత  హాస్టల్ అధికారులు, పాఠశాల అధికారుల పై ఉందని , పనిచేసే అధికారులు, సిబ్బంది వెనక తాము ఎప్పుడు అండగా ఉంటామని, ఎట్టి పరిస్థితులలో తప్పులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని, అందరూ కలిసి పనిచేద్దామని అని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, హాస్టళ్లలో సమస్యలను తొలగిస్తామని, అవసరమైన సౌకర్యాలని కల్పిస్తామని, తద్వారా వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని, తాగునీటిపైన ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, హాస్టళ్ళు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ స్కూల్ లకు నాణ్యమైన బియ్యం వచ్చేలా చూస్తామని, తాగునీరు, శానిటేషన్ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని,అలాగే తక్కిన విషయాలపై సైతం జిల్లా అధికారులు తనకు దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఇంచార్జ్ అధికారులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వర రావు, హోసింగ్ పిడి రాజ్ కుమార్,డిఈఓ భిక్షపతి, జిల్లా మైనారిటీ సంక్షేమ  శాఖ అధికారి విజయేందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్  చక్రవర్తి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు,కెజిబివి పాఠశాలలు,మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్,తదితరులు పాల్గొన్నారు.