సినీ పరిశ్రమకు తీరని లోటు

సినీ పరిశ్రమకు తీరని లోటువిలక్షణ నటుడు చంద్రమోహన్‌ మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం, రాధాకళ్యాణం,
నాకూ పెళ్ళాం కావాలి.. లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్‌ నటులు, కథనాయకులు చంద్రమోహన్‌ ఇక లేరని తెలియడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. – చిరంజీవి
తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, సంపూర్ణ నటుడు చంద్రమోహన్‌ పరమపదించడం ఎంతో విషాదకరం. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. సాంఘిక, పౌరాణిక పాత్రల పోషణలో ఆయన మేటి. నాన్న గారితో కలసి యుగపురుషుడు, నిండుదంపతులు, ధనమా? దైవమా? ఇలా ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు. ఆయనతో కలసి ఎన్నో చిత్రాలలో నేనూ పని చేయడం గొప్ప అనుభూతి. ఆదిత్య 369 చిత్రంలో చంద్రమోహన్‌ తెనాలి రామకష్ణ కవిగా పోషించిన పాత్ర మరపురానిది. తెలుగు చిత్ర సీమకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఎప్పటికీ ప్రేక్షకుల హదయాల్లో ఉంటారు. – బాలకృష్ణ

చంద్రమోహన్‌ మృతి చెందారని బాధపడ్డా. ఆయనతో పలు చిత్రాల్లో నటించా. – వెంకటేష్‌
చంద్రమోహన్‌ కన్నుమూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునే చూస్తున్నట్లు అనిపించేది. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన నటనను చూపించారు. ‘పదహారేళ్ళ వయస్సు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. శ్రీ షిర్డిసాయిబాబా మహత్యంలో నానావళిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయనతో మా కుటుంబానికి స్నేహసంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవితో కలిసి ‘చంటబ్బాయి, ఇంటిగుట్టు’ లాంటి చిత్రాల్లో నటించారు. నా తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలుంటాయి. 900కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాల వారికి చేరువయ్యారు. – పవన్‌కళ్యాణ్‌
ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ అకాల మరణం బాధాకరం. – ఎన్టీఆర్‌
విలక్షణ నటుడు చంద్రమోహన్‌ మృతి సినీ జగత్తుకు తీరని లోటు.
– కళ్యాణ్‌రామ్‌