మార్చి 14న ఢిల్లీలో భారీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌

March 14 in Delhi A large Kisan Mazdoor Maha Panchayat– ఫిబ్రవరి 23న బ్లాక్‌ డే/ఆక్రోష్‌ డే, దిష్టిబొమ్మల దహనం, టార్చ్‌ లైట్‌ ప్రదర్శన
– 26న ట్రాక్టర్‌ కవాతు, క్విట్‌ డబ్ల్యూటీవో డే
– అమరవీరుడు యువ రైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌కు నివాళి
– మృతుల కుటుంబాలకి రూ.1 కోటి పరిహారం
– దెబ్బతిన్న 100 ట్రాక్టర్లకు మరమ్మతు ఖర్చులివ్వాలి
– సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరిపించాలి
– కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా, హర్యానా సీఎం ఎంఎల్‌ ఖట్టర్‌, హర్యానా హౌం మంత్రి అనిల్‌ విజ్‌ రాజీనామా చేయాలి: ఎస్కేఎం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతులపై కేంద్ర ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా, రైతుల డిమాండ్లపై భారీ జాతీయ సమీకరణకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. మార్చి 14న ఢిల్లీలో భారీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌ నిర్వహించనున్నట్లు ఎస్కేఎం తెలిపింది.గురువారం చండీగఢ్‌లోని కిసాన్‌ భవన్‌లో ఎస్కేఎం జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, హర్యానా, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, పంజాబ్‌ నుండి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఎస్పీ, రుణమాఫీ తదితర డిమాండ్లకు మద్దతుగా, రైతుల పోరాట అణచివేతకు వ్యతిరేకంగా దేశమంతటా పాటించాల్సిన అనేక కార్యక్రమాలతో రైతులను భారీ చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. హర్యానా పోలీసులు అక్రమంగా సరిహద్దులు దాటి నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన అమరవీరుడు శుభ్‌ కరణ్‌ సింగ్‌కు సమావేశం నివాళ్లర్పించింది. నిరసనా స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేయడాన్ని విమర్శించింది.
కిసాన్‌ ఉద్యమాన్ని విడదీయడానికి, విభజించడానికి, పంజాబ్‌ ప్రజలలో పరాయీకరణను పెంచడానికి, ఈ విభజనతో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించడానికి నిరసనకారులపై తీవ్రమైన అణచివేతకు కుట్ర పన్నారని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాను ఎస్కేఎం నిందించింది. అమిత్‌ షా, హర్యానా సీఎం, హర్యానా హౌం మంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌, అనిల్‌ విజ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. రైతులను హత్య చేసి గాయపరిచినందుకు, పలువురికి నష్టం కలిగించినందుకు వారిపై, పోలీసులపై సెక్షన్‌ 302 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రైతులపై కాల్పులు, ట్రాక్టర్లకు జరిగిన నష్టంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరిపించాలని కోరింది. అలాగే హర్యానా అధికారులపై పంజాబ్‌ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.
మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న 100 ట్రాక్టర్లకు మరమ్మతు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. రైతుల డిమాండ్ల సాధనకు, సమస్యల ఆధారిత ఐక్యతను బలోపేతం చేయ డానికి, ఎస్కేఎంలో భాగమైన అన్ని కిసాన్‌ సంఘాలను ఏకం చేయడానికి ఐక్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి మాజీ ఎస్కేఎం సభ్యు లందరితో సంప్రదింపులు జరపడానికి ఎస్కేఎం జనరల్‌ బాడీ ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎస్కేఎం సభ్యులు హన్నన్‌ మొల్లా, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, యుధ వీర్‌ సింగ్‌, దర్శన్‌ పాల్‌, రమీందర్‌ పాటియాలా కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ఫిబ్రవరి 23న బ్లాక్‌ డే/ ఆక్రోష్‌ దివస్‌
ఫిబ్రవరి 23న బ్లాక్‌ డే/ ఆక్రోష్‌ దివస్‌గా పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. దిష్టి బొమ్మలు, టార్చ్‌లైట్‌, నిరసన ప్రదర్శనలు దహనం చేయడంతో అణచివేతకు వ్యతిరేకంగా నేడు (శుక్రవారం) నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర/ సెక్టోరల్‌ ఫెడరేషన్ల సంయుక్త వేదిక ఇప్పటికే బ్లాక్‌ డేకి పిలుపునిచ్చిందని, జిల్లా, స్థానిక, గ్రామ స్థాయిలో నిరసనను విజయవంతం చేసేందుకు రైతులు, కార్మికులను సమన్వయం చేసుకుంటామని తెలిపింది. అదే రోజున అబుదాబీలో డబ్ల్యూటీవో కాన్ఫరెన్స్‌ ప్రారంభం కానుందని, ఫిబ్రవరి 26న క్విట్‌ డబ్య్లూటీవో డేగా పాటించాలని తెలిపింది. రైతులకు ఎంఎస్పీ మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని డబ్ల్యూటీవో బలవంతం చేస్తుందని, అలాగే ప్రయోజనాన్ని నేరుగా డబ్బుగా బదిలీ చేయాలని వాదించడంతో ప్రజా పంపిణీ వ్యవస్థని ఉపసంహరించుకుంటుందని విమర్శించింది. ఈ రెండు ప్రతిపాదనలు రైతులకు, పేద ప్రజలకు, ఆహార భద్రతకు, భారతదేశ సార్వభౌమత్వానికి హానికరమని పేర్కొంది. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ జాతీయ, రాష్ట్ర రహదారులపై తమ ట్రాక్టర్లతో కవాతు చేసి క్విట్‌ డబ్ల్యూటీవో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది.
ఎస్కేఎం పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా మార్చి 14న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయతీని నిర్వహించనుంది. ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, ఇతర కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువత, మహిళలు, సాంస్కతిక కార్యకర్తలు, చిరు వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు సంఘీభావంగా, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. ఈ భారీ ర్యాలీకి ముందు రైతుల పోరాటంపై అణచివేతను ఆపాలని డిమాండ్‌ చేస్తూ, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదికలతో సమన్వయం చేస్తూ డిమాండ్‌లకు మద్దతుగా రాష్ట్ర రాజధానిలోని రాజ్‌భవన్‌ల ముందు పాదయాత్ర, ర్యాలీలు నిర్వహించాలని ఎస్కేఎం రాష్ట్ర యూనిట్‌లకు పిలుపునిచ్చింది.