30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగసభ

– మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించనున్న ప్రియాంకగాంధీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్‌ ప్రకటిస్తారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగసభకు సంబంధించిన సన్నాహక సమావేశం మంగళవారం మహబూబ్‌ నగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బహిరంగ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్‌ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్యా, ఆ జిల్లా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు వెళ్లే ఆలోచనలో ఎవరూ లేరని స్పష్టం చేశారు.
బీసీల సీట్లను వెంటనే గుర్తించాలి
ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలని ఉదరుపూర్‌ డిక్లరేషన్‌లో నిర్ణయం తీసుకోవడాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌ స్వాగతించారు. రాష్ట్రంలో 40 స్థానాలను వెంటనే గుర్తించి ప్రకటిస్తే సర్దుకుని ఐక్యంగా ముందుకెళ్తామని తెలిపారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.
మణిపూర్‌ వెనుక కుట్ర కోణంపై29న సమావేశం…
మణిపూర్‌ ఘటనల వెనుక కుట్ర కోణంపై సమావేశం నిర్వహించనున్నట్టు ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్‌ తెలిపారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్‌ ప్రకాశం హాలులో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరవుతారని వెల్లడించారు.
మైనార్టీ బంధు కాంగ్రెస్‌ ప్రభుత్వమే….
మైనార్టీలకు నిజమైన బంధువు కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన మైనార్టీల బంధు అబద్దమని విమర్శించారు. 2015-16లో 1.53 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే వాటిని మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బుట్టదాఖలు చేసిందనీ, ఏడేండ్ల తర్వాత 2.20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే మళ్లీ అదే పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు కేవలం రూ.50 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్‌ నిరసన తెలిపిందనీ, దీంతో మరో రూ.70 కోట్లు అదనంగా చేర్చారనీ, అందులోనూ ఒక్క రూపాయి లబ్ది చేయలేదని తెలిపారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మైనార్టీ బంధు వంద శాతం సబ్సిడీ పథకాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. ఈ పథకం కేవలం బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మైనార్టీల ఓట్లు దండుకునేందుకేనని విమర్శించారు.