పదిహేనేళ్ల ప్రయాణం

పదిహేనేళ్ల ప్రయాణంఒక సాహితీ సంస్థ భిన్న అస్తిత్వాలను కలుపుకుంటూ సమకాలీన సమాజ పరిస్థితులు, అనేకానేక సమస్యల్ని సాహిత్య సామాజిక కోణంలో స్పృశిస్తూ పదిహేనవ మైలురాయిని చేరింది. ఆ సంస్థ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఎవరికైనా రాయడం అనేది ఒక అద్భుతమైన భావోద్వేగ విడుదల. అనేక ఒత్తిళ్లు, సందిగ్దతలు ఎదుర్కొంటూనే మహిళలు తమ భావోద్వేగాలను అక్షరీకరించడం ఇరవయ్యవ శతాబ్దిలో మొదలైంది. తర్వాత సమాజం, కుటుంబం చేసే కండిషనింగ్‌ నుంచి బయటపడి సమాజాన్ని విప్పార్చి చూస్తూ, సామూహికంగా చర్చించుకుంటూ, సమస్యలకు స్పందిస్తూ తమ భావోద్వేగాలను సాహిత్యంలో పొందుపరచడం ఆరంభమైంది.
2009 జనవరిలో ‘మనలో మనం’గా అనకాపల్లిలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంస్థ పేరు, ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించి 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పరచారు. ప్రణాళిక ముసాయిదాను, ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ పేరును దాదాపు వందకు పైగా రచయిత్రులు హాజరైన విశాఖ సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. బహుశా ఇది భారతదేశంలోనే తొలి నిర్మాణాత్మక రచయిత్రుల సంస్థ అయి ఉండవచ్చు.
స్త్రీలందరూ పురుషాధిపత్య బాధితులే అయినప్పటికీ కుల,మత,జాతి,ప్రాంత అస్తిత్వాన్ని బట్టి అణచివేత అసమాన స్వభావ స్వరూపాల్లో తేడాలుంటాయి. ఈ బహుళ అస్తిత్వ కారణంగా ఉన్న తేడాలు గుర్తించి పరిష్కరించి సమానత్వం దిశగా ప్రయాణించే క్రమంలో అవసరమైన ప్రత్యేక గుర్తింపు కోసం ఈ వేదిక ప్రణాళికలో వివిధ అస్తిత్వాలకు దామాషా ప్రాతినిధ్యం కల్పించాలని నిబంధన పెట్టుకుంది. అదనపు అణచివేతకు గురయ్యే సామాజిక వర్గాలకు ప్రత్యేక గుర్తింపు, ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా వేదిక ప్రణాళికలో నిర్దేశించుకుంది. స్త్రీ పురుష సమానత్వాన్ని సమాజానికి అలవరిచే క్రమంలో రచయిత్రులలో పాటు రచయితల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తుంది. వేదిక ఏర్పడిన తర్వాత అనేక సదస్సులు నిర్వహించారు.
అప్పటివరకూ తెలియని రచయిత్రులను వెతికి గాలించి పట్టుకుని వారిని సాహిత్య చరిత్రలో చర్చలో పెట్టడానికి కృషితో పాటు స్త్రీల సాహిత్యాన్ని నమోదు చేయడం మొదలైంది. అజ్ఞాతంగా ఉన్న రచయిత్రులెందరో వేదికపైకి వచ్చారు. భిన్న అస్తిత్వాలను కాపాడుకుంటూనే సంఘటితం కావడంలోని బలాన్ని గుర్తించడం జరిగింది. పాల్గొన్న రచయిత్రులలో కొత్త చూపు, శక్తి వచ్చింది. రచయిత్రులంటే ఎవరికి వారు ఒంటరిగా మిగలకుండా రచన కేంద్రంగా తమలో తాము సామాజిక సంబంధాలను దృఢ పరచుకోవడం, తమను తాము తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని కలబోసుకోవడం, వ్యక్తిగత ప్రతిభలను సమిష్టి శక్తి మలచుకోవడం, స్త్రీ సామూహిక ప్రయోజనాల కోసం పనిచేయడం అని తెలుపుతూ జరిగిన ఈ సదస్సులు అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.
ప్రరవే, జిజ్ఞాస సంయుక్త ఆధ్వర్యంలో ‘స్త్రీవాదం – సాహిత్య విమర్శ’పై 35 వారాల అంతర్జాల సమావేశాల పరంపర జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో స్త్రీవాద సిద్ధాంతానికి, దేశీయ ఆచరణకు, సాహిత్య అన్వయానికి సంబంధించిన అనేక అంశాలతో కూడిన ఈ ప్రసంగాల పరంపర ఇది. ‘మన సాహిత్యం – మన ముచ్చట’ పేరుతో నెలనెలా సాహిత్య సంవాదంలో ప్రరవే రచయిత్రుల సాహిత్యాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషణ, చర్చ చేస్తున్నది. అలాగే అనేక క్షేత్ర పర్యటనలు కూడా ఈ వేదిక ఆధ్వర్యంలో జరిగాయి. బాధితుల దగ్గరకు వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాల్లో స్వయంగా తెలుసుకున్న ప్రజా సమస్యలు వివిధ సాహిత్య రూపాల్లోకి అనువదించడానికి వీలయింది. కవిత్వం, కథలు, సాహిత్య విమర్శ, సిద్ధాంత గ్రంథాలు, క్షేత్ర అధ్యయనాలు వంటి 21 పుస్తకాలు వెలువరించింది. నిన్నటి నుండి నేర్చుకుంటూ నేటిపై దృష్టి పెట్టడం మాత్రమే కాదు, రేపటిని నిర్మించడం వైపు కూడా ప్రరవే అడుగులు వేస్తున్నది. నవతరం-యువతరం ఆలోచనలు, ఊహలు తెలుసుకుంటూ వాటిని అక్షర రూపంలోకి మార్చడానికి, పాఠకులుగా వారికి ఏం కావాలో తెలుసుకుంటూ వారి అడుగులు సమాజం సాహిత్యం దిశగా మళ్లించడానికి కృషి ప్రారంభించింది. పదిహేనేళ్ల తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేదిక ఈ నెల 10, 11 తేదీల్లో ఖమ్మంలో సభలు నిర్వహించుకోబోతోంది.
– వి.శాంతిప్రబోధ, 9866703223