బీఆర్‌ఎస్‌లో ఉంటే ఒక న్యాయం

– వేరే పార్టీలోకి వెళితే మరో న్యాయమా?
– భూ కబ్జా ఆరోపణలపై పొంగులేటి క్లారిటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌లో ఉంటే ఒక న్యాయం…వేరే పార్టీలోకి వెళ్తే మరోక న్యాయమా? అని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కండువాలు మార్చుకున్నాక ఎవరికి ఎంత భూమి వచ్చిందో బయట పడుతుందని తెలిపారు. తనలాంటి వ్యక్తి 21 గుంటల భూమి కబ్జా చేశానంటూ తనపై నింద మోపడం దారుణ మన్నారు. తమ కుటుంబ సభ్యులకు అక్కడ 130 ఎకరాల భూమి ఉందనీ, ఉద్దేశపూర్వకంగా కోర్టుకు సెలవులు చూసి తనను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. 14 ఏండ్ల నుంచి లేని సమస్యను ఇప్పుడేలా వచ్చిందని ప్రశ్నించారు. న్యాయస్థానం ద్వారా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఆయన మంగళ వారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మార్యద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పొంగులేటి విలేకర్లతో మాట్లాడారు. తన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌పై ఎన్నెస్పీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి 21 గుంటలు ఎన్నెస్పీది అంటూ నిర్ధారించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే సిగల్స్‌ వస్తు న్నాయనీ, అందుకే పార్టీపై బీఆర్‌ఎస్‌ నేతలు భయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే తనపై నమ్మకంతో పదవి ఇచ్చి నందుకు ఆనందంగా ఉందన్నారు. పార్టీ సీనియ ర్లందరితో కలిసి పార్టీని అధికారంలోకి తేవడానికి కష్టపడ తానని తెలిపారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. స్కీములు ప్రకటించడం తప్పా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వచ్చి కల్వ కుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికి మంచి జరగలేదని విమర్శించారు. కరెంట్‌ కనుక్కున్నదే కేసీఆర్‌ అనేలాగా చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా కట్టిస్తామన్నారు. కాంగ్రెస్‌ అభిమానులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన చెప్పారు. ఈనెల 20న కొల్లాపూర్‌ జరగాల్సిన బహిరంగ సభ వర్షాల కారణంగా వాయిదా వేసినట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. ఆ సభకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.