ఆదిత్య ఎల్‌ 1 కోసం కీలక ఆపరేషన్‌ : ఇస్రో

బెంగళూరు : ఆదిత్య ఎల్‌1ను సరైన మార్గంలో ఉంచేందుకు కీలక ఆపరేషన్‌ నిర్వహించినట్టు ఇస్రో ఆదివారం ప్రకటించింది. స్పేస్‌ క్రాప్ట్‌ లోని ఇంజన్లను 16 సెకన్ల పాటు మండించి ట్రాజెక్టరీ కరెక్షన్‌ మ్యాన్‌యూవర్‌ (టిసిఎం) ని నిర్వహించినటు తెలిపింది. సెప్టెంబర్‌ 19న ప్రదర్శించిన ట్రాన్‌-లాగ్రాంజియన్‌ పాయింట్‌ 1 ఇన్సర్షన్‌ (టిఎల్‌ 1 ) ట్రాక్‌ చేసిన తర్వాత దాని మార్గాన్ని సరిచేసేందుకు మాన్యువర్‌ అవసరమని భావించినట్టు ఇస్రో ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొంది.
ఎల్‌ 1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో నౌకను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన మార్గంలో నౌకను ఉంచేందుకు టిసిఎం చేపట్టినట్లు తెలిపింది. ఆదిత్య ఎల్‌ 1 ముందుకు సాగుతోందని, మరికొన్ని రోజుల్లో మాగెటో మీటర్‌ మళ్లీ అన్‌ చేయబడుతుందని ఇస్రో పోస్ట్‌ చేసింది. అంతరిక్ష నౌక ఆరోగ్యంగా ఉందని.. కీలక గమ్యస్థానానికి చేరుకుంటోందని పేర్కొంది.
సెప్టెంబర్‌ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడికి, భూమికి మధ్య 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్‌ 1 పాయింట్‌ వద్దకు వెళ్తోంది. ఇప్పటికే 9 లక్షల కిలోమీటర్ల వరకు ఉండే భూమి గురుత్వాకర్షణ శక్తిని నౌక తప్పించుకుని ముందుకెళ్లింది.
ఆదిత్య ఎల్‌ 1 సైంటిఫిక్‌ డేటాను సేకరించడం కూడా ప్రారంభించింది. ఎస్‌టిఇపిఎస్‌ (సుప్రా థర్మల్‌ , ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌) పరికరం యొక్క సెన్సార్‌లు భూమి నుంచి 50,000 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా-థర్మల్‌ మరియు ఎనర్జిటిక్‌ అయా న్‌లు మరియు ఎలక్ట్రాన్‌లను కొలవడం ప్రారంభించాయి. ఈ డేటా భూమిచుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో సహాయ పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.