సూర్యుడిపై అధ్యయనంలో కీలక ఘట్టం

సూర్యుడిపై అధ్యయనంలో కీలక ఘట్టం– ఆదిత్య-ఎల్‌ 1లో రికార్డయిన సౌరగాలులు..
–  ఫొటో షేర్‌ చేసిన ఇస్రో
బెంగళూరు: సూర్యుడిపై అధ్యయ నంలో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్‌ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఈ ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌లో రెండు పరికరాలున్నాయి. ఇందులోని సూపర్‌థర్మల్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌ను సెప్టెంబరు 10న, సోలార్‌ విండ్‌ అయాన్‌ స్పెక్ట్రోమీటర్‌ను నవంబరు 2న యాక్టివేట్‌ చేశారు. ఈ రెండు తమ కార్యకలాపాలను సజావుగా సాగిస్తున్నాయని ఇస్రో తెలిపింది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదీల్లో సోలార్‌ విండ్‌ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్‌, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో తెలిపింది. ఈ సెన్సర్‌ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించామని ఇస్రో పేర్కొంది.