విశ్వంభరలో కీలక పాత్ర

విశ్వంభరలో కీలక పాత్రచిరంజీవి మోస్ట్‌ ఎవైటెడ్‌ మాగమ్‌ ఓపస్‌ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మెగా అభిమానులకు, సినీ అభిమానులకు చిరస్మరణీయమైన చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని వశిష్ట అద్భుతంగా వినియోగించుకుంటుండగా, యూవీ క్రియేషన్స్‌ రాజీపడకుండా భారీ కాన్వాస్‌పై సినిమాను నిర్మిస్తోందని చిత్ర బృందం తెలిపింది. తాజాగా హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ను ‘విశ్వంభర’ ఎపిక్‌ సినిమాటిక్‌ జర్నీకి టీమ్‌ స్వాగతించింది. ‘నా సామి రంగా’లో తన అద్భుతమైన లుక్స్‌, నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆషికా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ”బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తానేమిటో నిరూపించుకున్న వశిష్ట ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాతలు తెలిపారు. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, చోటాకెనాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.