నార్కొటిక్‌ బ్యూరోకు చిక్కిన కీలక నిందితుడు

A key suspect caught by the Narcotics Bureau–  సుక్కా నర్సింహ గౌడ్‌ అరెస్టు
– 25 ఏండ్లుగా మత్తు పదార్థాల అక్రమ వ్యాపారం
– కోట్లాది రూపాయల ఆస్థుల సీజ్‌కు అధికారుల యత్నాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
కోట్లాది రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాల క్రయవిక్రయాలను సాగిస్తూ రాష్ట్రంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు మూల కారకుడిగా మారిన సుక్కా నర్సింహ గౌడ్‌తో పాటు ఆయన అనుచరులను రాష్ట్ర నార్కొటిక్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల విలువైన అల్‌ప్రాజోలమ్‌ మత్తుపదార్థాన్ని స్వాధీనపర్చుకున్న అధికారులు ప్రధాన నిందితుడి ఆస్థులను సీజ్‌ చేయటానికి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర నార్కొటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపిన వివరాల ప్రకారం.. సుక్కా నర్సింహ గౌడ్‌ 25 ఏండ్ల నుంచి మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న అల్‌ప్రాజోలమ్‌(ఇది ఒక రకమైన మత్తు మందు) సప్లయర్‌లతో ఈయనకు సంబంధాలున్నాయి. 1995లో తొలుత ఈయన ఢిల్లీలోని భాటియా నుంచి, ఆయన మరణానంతరం ప్రమోద్‌ సింగ్‌ నుంచి మెట్రో కొరియర్‌ సర్వీసుల ద్వారా పొందేవాడు. హవాలా ద్వారా చెల్లింపులు చేసేవాడు. కేజీ అల్‌ప్రాజోలమ్‌ను రూ. 2.4 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు దానిని రూ.3.5 లక్షలకు అమ్మేవాడు. ఆయన ఇలా నెలకు 30-40 కేజీల డ్రగ్‌ను విక్రయించేవాడు. విట్టల్‌గౌడ్‌, నరేందర్‌ గౌడ్‌ అనే వ్యక్తుల ద్వారా కూడా నర్సింహ గౌడ్‌ అల్‌ప్రాజోలమ్‌ను అందుకునేవాడు. కాగా, నిందితులు నర్సింహ గౌడ్‌, ఆయన కొడుకు రాజశేఖర్‌లను పట్టుకున్న తరుణంలో గుండుమల్ల వెంకటయ్య 17 కేజీలు, గొల్ల రమేశ్‌ 10 కేజీల మత్తుమందుతో పరారయ్యారు. కాగా, అరెస్టయిన ఇద్దరు నిందితులు తమ వద్ద ఉన్న మత్తుమందును నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ టౌన్‌, సింగోటమ్‌ గ్రామాల్లో కల్లు దుకాణాలకు సప్లరు చేయాలనుకున్నారు.
ఈ అక్రమ వ్యాపారం ద్వారా సుక్కా నర్సింహగౌడ్‌, ఆయన కుటుంబం పెద్ద ఎత్తున ఆస్థులను సంపాదించుకున్నారు. ఇందులో గచ్చిబౌలిలో రూ.3.5 కోట్ల విలువ చేసే మూడంతస్థుల భవనాన్ని 2015లో కొనుగోలు చేశాడు. అలాగే, 2017 నుంచి 2022 మధ్యలో శ్రీరామ్‌నగర్‌ కాలనీ, కొండాపూర్‌, గచ్చిబౌలిలలో రూ.1.8 కోట్ల చొప్పున మొత్తం రూ.5.4 కోట్లతో మూడు ఓపెన్‌ ప్లాట్లను, కొల్లాపూర్‌ గ్రామంలో 2019లో రూ.90 లక్షలు విలువ చేసే 9 ఎకరాల వ్యవసాయ భూమిని, అంకిరావ్‌పల్లిలో 2010లో రూ.14 లక్షలతో ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఏడాది నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని రూ.1.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు. అలాగే, గతేడాది కొల్లాపూర్‌ టౌన్‌ శివారు ప్రాంతంలో రూ. 2 కోట్లు విలువ చేసే రెండెకరాల భూమిని సంపాదించాడు. అలాగే, షేర్లు, ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టి లాభాలు గడించాడు. వీటితో పాటు సుక్కా నర్సింహ గౌడ్‌ పేరు మీద ఇతర స్థిర, చర ఆస్థులున్నాయి.