కబ్జాకు గురవుతున్న కుమ్మరికుంట్ల పెద్ద చెరువు..

– దర్జాగా చెరువును ఆక్రమిస్తున్న వైనం
– మట్టి పోసి చెరువును ఆక్రమిస్తున్న రైతులు
– అధికారులు స్పందించకుంటే చెరువు కనుమరుగు అయ్యే ప్రమాదం
నవతెలంగాణ- దంతాలపల్లి
వేసవి కావడంతో భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువులు ఎండిపోతున్నాయి. ఇదే క్రమంలో కుమ్మరికుంట్ల పెద్ద చెరువు పూర్తిగా ఎండిపోతుండడంతో అక్రమార్కులకు వరంల మారింది. దీంతో పెద్ద చెరువుకు సంబంధించిన మత్స్యశాఖ సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అక్రమంగా చెరువు మట్టిని తవ్వి నడిచెరువులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో నడిచెరువులో మట్టి కుప్పలు పోయిస్తు అక్రమార్కులకు గజలకు కొద్ది భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో అక్రమార్కులు చెరువులను అక్రమిస్తున్నారు. ఇప్పటికే వందల ఎకరాల భూమిని కబ్జా అయినదని గ్రామంలోని పలువురు ఆరోపిస్తున్నారు. చెరువు శిఖంలోని వివిధ ప్రాంతంలో అక్రమార్కులు చెరువులు కబ్జా చేసేందుకు మట్టిపోసి చదును చేశారు. దీంతో సుమారు వందల గజాల మేర చెరువును ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు స్పందించి పెద్ద చెరువు అక్రమనకు గురికాకుండా చూడాలని గ్రామ ప్రజలు, ముదిరాజులు కోరుతున్నారు.
భూములు డిమాండ్ పెరగడంతో….
మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి దీంతో చెరువులు, కుంటల శిఖం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. మండలంలోని కుమ్మరికుంట్ల నిదానపురం గ్రామాల్లో శిఖాలు కాలక్రమేన కబ్జాకు గురవుతున్నాయి. దీనివల్ల చెరువుల విస్తీర్ణం తగ్గిపోతుంది. ఈ భూముల్లో చేపట్టిన నిర్మాణాలు, నడిచెరువులు అడ్డుగా పోస్తున్న మట్టి కుప్పలు, వరదలకు అడ్డుగా ఉండడంతో నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గుతుంది.
సమన్యాయ లోపం…
మండలంలో సాగు విస్తీర్ణం సుమారు 8 299 ఎకరాలకు పైగా ఉంది. అందులో సుమారు 1450 ఎకరాలకు చెరువుల నీరే ఆధారం. ఆయా చెరువు కుంటలను నమ్ముకొని సాగు చేస్తున్న రైతులు కబ్జాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పూర్తిస్థాయిలో పరిష్కారం లభించడం లేదు. చెరువుల రక్షణ బాధ్యత రెవిన్యూ, నీటిపారుదల శాఖలదే. ఈ రెండు శాఖల అధికారుల మధ్య సమన్యాయ లోపం… అక్రమార్కులకు వరంగా మారుతుంది. ఫలితంగా వారు కబ్జాలు చేస్తూ సాగు చేసుకుంటున్నారు. ఇరు శాఖల అధికారులు వెంటనే స్పందించి సర్వేలు చేపట్టి కబ్జాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.
కుమ్మరికుంట్ల మత్స్యశాఖ సహకార సంఘం కార్యదర్శి
చిల్ల రామనారాయణ
ఒకప్పుడు గొలుసు కట్టు చెరువులతో పంట పొలాలు పచ్చగా కనిపించేవి. నేడు రియల్ వ్యాపారులు, కబ్జారాయుళ్లతో చెరువులు కనుమరుగై నీరు నిలిచే పరిస్థితి లేకుండా చేశారంటూ స్థానికులు ముదిరాజ్ సంఘం మత్స్యశాఖ ఉపాధ్యక్షులు బత్తిని మల్లయ్య, చిల్ల రామనారాయణ చిల్ల మధు, మండిపడుతున్నారు. కబ్జాలకు పాల్పడ్డ వారిపై ఇరిగేషన్ అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకోవాలి. అలాంటి పనులపై దృష్టి పెట్టకుండా, వ్యక్తిగత స్వార్థం కోసం అలవాటు పడి ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మండల పరిధిలో చిన్న పెద్ద కలిసి మొత్తం 357 చెరువులు ఉన్నాయి. వీటిలో చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. ఎగువ వరద నీటి కాలువలు, సీకం భూములు చాలా వరకు కబ్జాకు గురికావడంతో నీరు వెళ్లే మార్గం లేక దిగువనున్న పంట పొలాలు, మునిగిపోతున్నాయి. తాజాగా మండలంలోని నిదానపురం యానకుంట చెరువు మత్తడికి గండిపడింది. లక్షల విలువ చేసే చేపలను మత్స్యకారులు నష్టపోవాల్సి వచ్చింది.
అక్రమణదారులపై చర్యలు తప్పవు…
ఎవరైనా చెరువులు, కుంటలను కబ్జా చేసి ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఫిర్యాదులు చేస్తే విచారణ చేపడతాం. సర్వేలు చేయించి హద్దులు నాటిస్తాం. చెరువులు కుంటలను పరిశీలించాలని తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు పంపుతాం.
– ఇరిగేషన్ డి ఈ బి.వినయ్