ప్రయోగాలకు ఆఖరు అవకాశం

For experiments
Last chance– శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌పై ఆందోళన
– భారత్‌, ఆసీస్‌ రెండో వన్డే నేడు
– మధ్యాహ్నాం 1.30 నుంచి స్పోర్ట్స్‌18లో..
ఆఖరు అవకాశం. ఇటు భారత్‌, అటు ఆస్ట్రేలియా ఇంకేమైనా ప్రయోగాలు చేయాలని భావిస్తే అందుకు ఇండోర్‌ ఆఖరు వేదిక కానుంది. సిరీస్‌లో చివరి వన్డేకు ఇరు జట్లు వరల్డ్‌కప్‌ లైనప్‌ను బరిలో నిలుపుతుండగా.. నేటి మ్యాచ్‌లోనే ప్రయోగాలకు అవకాశం ఉండనుంది. శ్రేయస్‌ అయ్యర్‌ పరుగుల వేటలో నిరూపించుకోవాలని ఆతిథ్య జట్టు ఆశిస్తుండగా.. ట్రావిశ్‌ హెడ్‌ స్థానం భర్తీ చేసే ఆల్‌రౌండర్‌ వేటలో కంగారూలు నిమగమయ్యారు. భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-ఇండోర్‌
సిరీస్‌ చివరి సమరానికి కీలక ఆటగాళ్లు రానుండగా.. ప్రయోగాలకు ఇండోర్‌లోనే చివరి అవకాశం. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని టీమ్‌ ఇండియా ఆశిస్తుండగా, గాయపడిన ఆటగాళ్ల స్థానం భర్తీ చేయగల ప్లేయర్ల కోసం ఆసీస్‌ అన్వేషిస్తోంది. సిరీస్‌ ఫలితంపై ఇరు జట్లకు పెద్దగా ఆసక్తి లేకపోయినా.. మైదానంలో కనబరిచే ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ప్రపంచకప్‌ జట్టులో చోటు ఆశిస్తున్న ఇరు జట్ల బెంచ్‌ ఆటగాళ్లకు సత్తా చాటేందుకు ఇదే చివరి అవకాశం. మొహాలి వన్డేలో అలవోక విజయం సాధించిన టీమ్‌ ఇండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు ఇండోర్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలనే ఆలోచనతో కనిపిస్తుంది. వన్డేల్లో చివరి నాలుగు మ్యాచుల్లోనూ పరాజయం పాలైన ఆస్ట్రేలియా నేడు ఒత్తిడి నడుమ బరిలోకి దిగుతోంది.
శ్రేయస్‌పైనే ఫోకస్‌
గాయం, శస్త్రచికిత్స, రిహాబిలిటేషన్‌ అనంతరం జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ సైతం నిరూపించుకోవాల్సి ఉంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో గ్రూప్‌ దశ మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన శ్రేయర్‌.. గాయంతో మళ్లీ తుది జట్టులో నిలువలేదు. తాజాగా ఆసీస్‌తో తొలి వన్డేలో 3 పరుగులకే రనౌట్‌గా నిష్క్రమించాడు. మిడిల్‌ ఆర్డర్‌లో కీలక నం.4 బ్యాటర్‌గా ప్రపంచకప్‌లో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ అంతకుముందే జట్టు మేనేజ్‌మెంట్‌కు ఫామ్‌పై భరోసా ఇవ్వాల్సి ఉంది. బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ ఏదో ఒక మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడిన ఉత్సాహంలో ఉన్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే బ్యాట్‌తో కదం తొక్కాల్సి ఉంది. ఇక తెలుగు తేజం తిలక్‌ వర్మకు నేటి మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి. టాప్‌ ఆర్డర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది వన్డేల్లో నాలుగు శతకాలు బాది సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ సహా కెఎల్‌ రాహుల్‌ సైతం నిలకడగా రాణిస్తున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం రాణించటం భారత్‌కు గొప్ప ఊరట. నేడు మిడిల్‌ ఆర్డర్‌ నుంచి మరింత మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్న భారత్‌.. అయ్యర్‌, రాహుల్‌, సూర్యలపై ఫోకస్‌ పెట్టింది. వాషింగ్టన్‌ సుందర్‌ అవకాశం కోసం ఎదురు చూస్తుండగా.. జడేజా బ్యాట్‌తో మెరిసేందుకు చూస్తున్నాడు. బుమ్రా, సిరాజ్‌లలో ఒకరు తుది జట్టులో నిలువనుండగా.. షమి, శార్దుల్‌ ఠాకూర్‌లు తుది జట్టులో కొనసాగనున్నారు.
హెడ్‌ ‘తలనొప్పి’
ప్రపంచకప్‌ ముంగిట ట్రావిశ్‌ హెడ్‌ గాయం బారిన పడటం ఆస్ట్రేలియాకు తలనొప్పిగా మారింది. మిడిల్‌ ఆర్డర్‌లో ట్రావిశ్‌ హెడ్‌ను భర్తీ చేయగల సమర్థుడు కంగారూలకు చిక్కటం లేదు. ఇటీవల ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కంగారూ ఇన్నింగ్స్‌ను దూకుడు పట్టాలెక్కించిన ఆటగాడు ట్రావిశ్‌ హెడ్‌. మార్కస్‌ స్టోయినిస్‌, కామెరూన్‌ గ్రీన్‌లు ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. దీంతో నేటి మ్యాచ్‌లో అరోన్‌ హార్డీని సైతం ప్రయోగించే అవకాశం లేకపోలేదు. ఇక మిడిల్‌ ఆర్డర్‌లో మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లకు అవకాశాలు ఇవ్వటం సైతం సవాల్‌గా మారింది. నాణ్యమైన టెస్టు బ్యాటర్లను వన్డే లైనప్‌లో ఉంచటం ఆసీస్‌కు కత్తి మీద సాముగా మారింది. మార్నన్‌ లబుషేన్‌ అంచనాలను అందుకోవటం లేదు. స్టీవ్‌ స్మిత్‌ స్ట్రయిక్‌ రేట్‌ అంశంలో నిరాశపరుస్తున్నాడు. డెవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ కేరీలు ఆసీస్‌కు కీలకం కానున్నారు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌తో కలిసి సీన్‌ అబాట్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌లు పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆడం జంపా స్పిన్‌ మ్యాజిక్‌ భారత బ్యాటర్లకు పరీక్ష పెట్టనుంది.
పిచ్‌, వాతావరణం
ఇండోర్‌లో నేడు పరుగుల వరద పారనుంది!. హోల్కర్‌ స్టేడియం చిన్న బౌండరీలతో కూడుకున్నది. చివరగా ఇక్కడ కివీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ 385 పరుగులు చేసింది. అప్పుడు గిల్‌, రోహిత్‌ శతకాలు బాదారు. నేడు ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. విధ్వంసక బ్యాటింగ్‌ విన్యాసాలు చేసిన జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌కు వర్షం సూచనలు సైతం లేవని వాతావరణ శాఖ నివేదిక.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రుతురాజ్‌ గైక్వాడ్‌/ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌/జశ్‌ప్రీత్‌ బుమ్రా.
ఆస్ట్రేలియా : డెవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), జోశ్‌ ఇంగ్లిశ్‌/అరోన్‌ హార్డీ, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, ఆడం జంపా, జోశ్‌ హాజిల్‌వుడ్‌.