ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావాలి..

– ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ ని తెరవాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావాలి, ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను,హాస్టళ్లను తెరిచి మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్ఎఫ్ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విద్యా సంస్థలు ప్రారంభమైన కూడా ప్రభుత్వం ఇంకా కమిటీలు, పరిశీలన  అంటూ ప్రకటనలతో సరిపెట్టడమేంటని ప్రశ్నించారు. విద్యారంగానికి సరిపడ నిధులు లేక  అనేకమైన సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసివేసిన పాఠశాలలు, హాస్టళ్లను మేము ప్రారంభిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ప్రారంభించలేదు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను తెరిపించి, ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని, అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ విద్యను వ్యాపారికరించి లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. అధికారులు చూస్తూ పట్టించుకోక పోవడం వలన అదనంగా పాఠ్యపుస్తకాలు, నోట్,స్టేషనరీ,యూనిఫామ్, షూ, బెల్టు,బ్యాగుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఇప్పటికైనా  మేల్కొని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని, ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొచ్చి పటిష్టంగా అమలు చేసి అన్ని రకాల దోపిడిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు జే.సాయికుమార్, ఎస్ నవీన్, ఉదయ్,విష్ణు, సిహెచ్ వేణు ప్రశాంత్,శివ, తదితరులు పాల్గొన్నారు.