విద్యార్థులకు ఎండాకాలం సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులకు ఊర్లకు, టూర్లకు, విహారయాత్రలకు బయలుదేరుతారు. సమయాన్ని మొత్తం వాటికి వెచ్చించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఖాళీ సమయాలలో తల్లిదండ్రులతో కలిసి సినిమాలకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. అదే అభివృద్ధి చెందిన దేశాలైన యూరప్, అమెరికా తదితర దేశాలలో అయితే గ్రంథాలయాలకు వెళ్తారు. అవకాశం ఉంటే తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా వెళ్లి పుస్తకాలు చదువుతారు. చదవడం ఒక అలవాటు. గ్రంథాలయాలను సందర్శించడం ఒక పరిపాటి. మన దగ్గర విద్యార్థులేమో ఖాళీ సమయాలలో, సెలవు దినాలలో ఎన్ని సినిమాలు చూశాం, ఎన్ని వీడియో గేములాడాం, ఎన్ని రీల్స్ చేశాం.. ఇలా అనేక సామాజిక మాధ్యమాలతో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో సమయాన్ని వృధా చేస్తున్నారు.
అమెరికా, న్యూజిలాండ్, ఫీన్లాండ్, ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ దేశాలలో ఎన్ని పుస్తకాలు చదివామో చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తారు. ఆంగ్ల బోధనలో భాగంగా అక్కడ పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలలో పుస్తకాలు చదవడం, వాటిని విశ్లేషించడం, రివ్యూలు రాయడం వంటివి నిత్యకృత్యాలు. ముఖ్యంగా నవలలు, కథలు, కవితలు ఇతర పుస్తకాలు విద్యార్థులతో చదివిస్తారు.
వారికి ఏ పుస్తకం ఇష్టమో అదే ఎంచుకొని దానినే చదవమంటారు. రచనలలో, కథలలో, నవలల్లో పాత్రల తీరుతెన్నుల మీద పరీక్షలు పెడతారు. పుస్తక రచయితలను, కవులను ముఖ్యంగా యువ కవులను, యువ రచయితలను విద్యాలయాలకు పిలిపించి విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. దీనివల్ల ఏ విధంగా పుస్తకాలను రాయాలి, కవిత్వం ఏ విధంగా రాయాలి అనేటువంటి సజనాత్మకత, బహుముఖ ప్రజ్ఞ ఏర్పడేందుకు అవకాశం ఉన్నది. భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. మంచి ఆలోచనలు సద్గుణాలకు దారితీస్తాయి. మనదేశంలో విద్యార్థులు ఖాళీ సమయం దొరికితే సామాజిక మాధ్యమాలలో, టీవీలలో, ఓటీపీలలో సమయాన్ని కేటాయిస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలలో 4, 5వ తరగతి చదివే పిల్లలు పుస్తకాలు చదవడం వల్ల రచయితగా ఎదుగుతున్నారు. మన దగ్గర ఎంతమంది ఆ వయసు పిల్లలు రచయితలుగా మారుతున్నారు? అసలు పుస్తకాలు చదవడం హాబీగా మార్చుకుంటున్నవారు ఎందరో ఆలోచించాలి.
ఇతర దేశాల్లో విద్యార్థులు రాసిన రచనలు, కథలు, నవలలను ఆ పాఠశాలలు ముద్రించి అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే మన దేశంలో అసలు జరగట్లేదని కాదు.. మనదేశంలో కూడా అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు యువ రచయితలను, యువ కవులను ప్రోత్సహిస్తూ వారి రచనలు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు (బాలచేలిమి) ముద్రిస్తున్నాయి. ఇది మంచి తరుణం. కానీ ఈ శాతాన్ని విస్తరించవలసిన అవసరం ఉంది. ఇలా ఎక్కడో ఒక చోట కాకుండా పిల్లలను పుస్తక పఠనానికి పాఠశాలలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో పుస్తక పఠనాభిలాష విద్యార్థులకే కాకుండా పెద్దలు, ఉపాధ్యాయులకు కూడా ఎక్కువగా వుంది. రైలు, బస్సు ప్రయాణలో, మెట్రో రైల్వే స్టేషన్లలో వీడియో గేమ్స్, సెల్ ఫోన్లు చూసే వారి సంఖ్య విదేశాల్లో చాలా తక్కువ.
ప్రపంచంలోనే వీటికోసం అధిక సమయం కేటాయించేది భారతదేశం. సుమారు 10 గంటలకు పైగా మనం చదవడానికి కేటాయిస్తాం. కానీ ఈ సమయం ఎక్కువగా పాఠ్యపుస్తకాలకు సంబంధించిన పుస్తకాలే కావడం ఇబ్బందికరం. ఇంకా రెండు గంటలు చదివితే కాసిన్ని మార్కులు ఎక్కువ వస్తాయి కదా అనే ఆలోచన మన విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రులలో ఉంటుంది. ఇక్కడ నవలలు, కథలు, జనరల్ పుస్తకాలు చదివే వారి సంఖ్య తక్కువ.
ముఖ్యంగా తల్లిదండ్రులు… కనీసం రోజులో ఒక గంట సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే పిల్లలు కూడా వారిని అనుసరించి పుస్తకాలు చదువుతారు. ఖాళీ సమయాలలో విద్యార్థులను పుస్తకాల షాపులకు, పుస్తక ప్రదర్శనలకు, పౌర గ్రంథాలయాలకు, నూతన పుస్తక ఆవిష్కరణలకు, పుస్తక విశ్లేషణలకు తీసుకెళ్లి పుస్తకాలపై మక్కువ పెంచి పుస్తక పఠనం వైపు వారి దృష్టిని మరల్చే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు నచ్చిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా బొమ్మల పుస్తకాలు, స్టోరీ టెల్లింగ్ వీడియోలు గ్రంథాలయాల్లో ఉంచి విద్యార్థులకు చూపించాలి.
”ప్రతిరోజూ చదవండి” అని బెర్క్‌షైర్ హాత్వే సిఈవో 2000లో కొలంబియా బిజినెస్ స్కూల్లోని ఎం.బి.ఎ విద్యార్థులకు చెప్పారు.
చదివే అలవాటు విజ్ఞానాన్నిస్తుంది. ఆ విజ్ఞానం చక్రవడ్డీ లాగా పెరుగుతుంది. మీరందరూ దీన్ని చేయగలరు, కానీ మీలో చాలా మంది దీన్ని చేయరని నేను హామీ ఇస్తున్నాను. అలా చేయగలిగితే కొత్త పుస్తకం వస్తుందంటే బారులు తీసి మరీ పుస్తకాలు కొనుక్కుంటారు.. ఆన్లైన్లో మరీ ఆర్డర్ ఇచ్చి పుస్తకాలు కొంటారు.. ఒక్క ఆంగ్ల భాషనే కాకుండా మిగతా భాషల పుస్తకాలు కూడా చదివే ప్రయత్నం చేస్తారు. డిజిటల్ పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పుస్తకాలు ఎలా కొని చదువుతారో, అలానే ప్రింట్ పుస్తకాలు కూడా కొని చదువుతారు. పుస్తక పఠనం కేవలం విజ్ఞానం కోసం మాత్రమే కాదు, మానసిక ఉల్లాసానికి, సమాజం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడడానికి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. డిజిటల్ యుగంలో కూడా పుస్తకాలకు ప్రత్యామ్నాయం లేదు. అవి జ్ఞానానికి మూలం.
కొన్ని పాఠశాలలోని పాఠ్యాంశాలు ఎక్కువగా లైబ్రరీ నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. చక్కటి సౌకర్యాలతో కూడిన లైబ్రరీ లేకుండా బోధన, అభ్యాస ప్రక్రియ అధ్వాన్నంగా ఉంటాయి. చదవడం మనసుకు వ్యాయామం. ఇది పిల్లల మనసులను ప్రకాశవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. చదివిన పిల్లలు మెరుగైన అభిజ్ఞా నైపుణ్యాలను కలిగి ఉంటారు.
There is more treasure in books than in the entire pirate’s loot on Treasure Island? చెప్పినట్టు చదవడం వల్ల పదజాలం మెరుగుపడుతుంది. మెరుగైన గ్రహణశక్తి, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. జ్ఞాపకశక్తిని, పాఠశాల ఫలితాలను, రాత, విశ్లేషణ నైపుణ్యాలను, ఏకాగ్రతను మెరుగు పరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఉత్తమ పాఠకులు నాయకులుగా ఎదుగుతారు.
మద్రాస్ హైకోర్టు ఇటీవలే పుస్తక పఠనం పాఠ్యాంశంలో ఒక భాగంగా ఉండాలని తీర్పు చెబుతూ విద్యార్థులకు పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఒక గంట పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించింది. అదేవిధంగా గ్రంథాలయాలలో పుస్తకాలు లేకపోతే పౌర గ్రంథాలయాల్లో విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. మద్రాస్ రాష్ట్రంలోని పుస్తక ప్రచురణ సంస్థలు నాణ్యమైన పుస్తకాలను పౌర గ్రంథాలయాలకు, పాఠశాల గ్రంథాలయాలకు సరఫరా చేయాలని, సెలెక్ట్ చేసిన పుస్తకాలను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
నూతన విద్యా విధానం 2020 ప్రకారం ప్రతి విద్యార్థి పాఠశాలలో గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయాలను ఉపయోగించుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని, అందుకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పుస్తకాలతో పాటు విద్యార్థులకు పుస్తక పఠనం అంశాన్ని పాఠ్యాంశాలలో చేర్చవలసిన అవసరం ఉన్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నూతన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రాథమిక విద్యపై నిధుల కేటాయింపులో కానీ, మౌలిక వనరుల కేటాయింపుల్లో , మౌలిక వనరుల కల్పన లోకాని, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో భాగంగా పాఠ్యాంశాలలో పుస్తక పఠనం ఒక అంశంగా చేర్చాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్యా స్థాయిలోనే ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేలా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు తల్లిదండ్రులు కృషి చేయాలి. అవసరమైతే జాతీయస్థాయిలో అన్ని ప్రాథమిక పాఠశాలలో మాతృభాషలో గాని, జాతీయ భాషలో గాని, ఆంగ్ల భాషలో గాని పుస్తక పఠనం ప్రాధాన్యత, దాని ఉపయోగాలు, ఎలాంటి పుస్తకాలు చదవాలి? వంటివి పాఠ్యాంశాలను పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది.
డా|| రవికుమార్ చేగొని, 9866928327