వేంపల్లె షరీఫ్ రాసిన ‘ఆకుపచ్చ ముగ్గు’ కథను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ పాఠ్యాంశంలో చేర్చడం
అభినందించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో
మతాంశాలు పెరుగుతున్నాయని చర్చ జరుగుతున్న
నేపథ్యంలో ఇది కొంత ఊరటనిచ్చే అంశం. షరీఫ్ కథతో
పాటు ఇందులో రావిశాస్త్రి వంటి ఉద్ధండుడి కథ ‘పిపీలికం’
కూడా ఉంది. అలాగే రత్నాకర్ పెనుమాక (ఈ పొలం
అమ్మబడును), పోలాప్రగడ రాజ్యలక్ష్మి (నల్లపూసలు) కథలు
డిగ్రీలోని మూడవ సెమిస్టర్ కోసం ఎంపికయ్యాయి.
బిఎస్సీ, బిఏ, బీకాం, బిబిఏ చదువుతున్న విద్యార్థులు ఈ
యేడాది నుంచి ఈ పాఠాలను నేర్చుకోవాలి.
అయితే మిగతా మూడింటితో పోలిస్తే షరీఫ్ కథ కొంత భిన్నమైంది, పైగా ఇప్పటి పరిస్థితులకు తక్షణావసరం కలదిగా నాకు అనిపిస్తుంది. షరీఫ్ ఈ కథను 2011లో రాశారు. ఆ యేడాదే ఆయన ‘జుమ్మా’ పేరుతో కథల పుస్తకం తీసుకొచ్చారు. అందులో కూడా ఈ కథ ఉంది. మరుసటి యేడాది ఆ పుస్తకానికి ‘కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం’ దక్కింది. ఒకరిని పొగడ్డం కోసం ఇంకొక్కరిని తెగడ్డం వంటివి చేయకుండా ఇరువర్గాలను దృష్టిలో పెట్టుకుని మీ మధ్య రాజకీయం అనే పెద్ద భూతం ఒకటి నిలిచి ఉంది, అది అడ్డుగా ఉన్నంతవరకు మీరు ఒకర్నొకరు సరిగా చూసుకోలేరని సున్నితంగా కథల్లో చెప్పడం ఇతని ప్రత్యేకత. ఇప్పుడున్న వాతావరణానికి ఈ శైలి అవసరమని చాలామంది విమర్శలు చెప్పే మాట. షరీఫ్ రాసిన కథలన్నీ కాస్త సంయమనంతో ఇరువర్గాలను ఆలోచింపజేస్తూ రాసినవే.
‘జుమ్మా’ కథలో మనమెంత మూఢ భక్తిలో ఉన్నా కొన్ని సార్లు దేవుణ్ని పక్కన పెట్టి చూస్తే కానీ జీవితం అర్థం కాదని తల్లి పాత్రతో చెప్పిస్తాడు. చూడ్డానికి కథలో ఏమీలేదు అనిపిస్తుంది కానీ ఎక్కడో మన అంతరంతరాల్లో ఈ విషయం గట్టిగా తగులుతుంది. ‘పర్దా’, ‘తెలుగోళ్ల దేవుడు’, ‘ సైకిల్ చక్రాలు’ వంటి కథలన్నీ అలాంటివే. అయితే ప్రస్తుతం పాఠ్యాంశంగా ఉన్న ‘ఆకుపచ్చ ముగ్గు’ విషయానికొస్తే ఇది పూర్తిగా సమాజంలో సాంస్కృతిక సమతుల్యతను సూచించే కథ. ఈ విషయం చెప్పడానికి ఎంచుకున్న అక్క పాత్ర చాలా బలమైంది. ఒకసారి కథ చదివాక ఆమెను మర్చిపోవడం అంత సులువు కాదని రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం అంటారు. ప్రఖ్యాత కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి ఈ అక్క పాత్రను తెనాలి రామకృష్ణ రాసిన పాండు రంగ మహత్మ్యంలోని నిగమశర్మ అక్క పాత్రతో పోల్చారు. ఒక సమాజంలో అనేక సమూహాలు కలిసి బతుకుతున్నప్పుడు ఒక సమూహం యొక్క సంస్కృతి ప్రభావం మరో సమూహంపై తప్పక ఉంటుంది. అంత మాత్రం చేత ఏదో కొంపలంటుకున్నట్టు బాధపడాల్సిన పని లేదని అక్క పాత్ర చెబుతుంది.
నిత్యం హిందూ స్నేహితుల మధ్య తిరుగుతూ, హిందువుల ఇళ్ల మధ్య నివసించే ముస్లిం అక్కకి సంక్రాతి పండుగ అంటే ఇష్టం. ఎందుకిష్టమంటే ఆ పండక్కి ఇళ్లముందు ముగ్గులేస్తారు కదా.. అందుకు ఇష్టం. ఆ ముగ్గుల్ని ఆమె ఒక కళ కింద ప్రేమిస్తుంది. నోటు పుస్తకాలను ముగ్గులతో నింపేస్తుంది. ఇసుకలో ఆడుకుంటుంటే ఒకచోట నిలబడి రౌండుగా తిరిగి కాలితో నేలమీద ముగ్గు వేసి దోస ముగ్గు అంటుంది. నీళ్ల బిందెను ఇంటికి తెచ్చి అరుగు మీద పెట్టి ఆ బిందెలో వేలిని ముంచి తడితో బండలమీద ముగ్గు వేస్తుంది. ఆమెకు ముగ్గులంటే అంత పిచ్చి.
తమది ముస్లిం కుటుంబమని, ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటే అందరూ తలా ఒక మాట అంటున్నారని తల్లి బలవంతంగా కూతురితో ముగ్గులు వేయడాన్ని ఆపిస్తుంది. తర్వాత ఆమె మెల్లగా ఆ పిచ్చిని అరచేతుల్లో గోరింటాకుతో ముగ్గులు వేయడం వైపుకు మరల్చుకుంటుంది. ‘ఇంటి ముందు వేస్తే ముగ్గు తప్పవుతుంది కానీ అరచేతుల్లో వేస్తే కాదు కదా. ఒక మతానికి మరో మతానికి తేడా ఇంతేనా? ఇందుకోసమేనా ఇన్ని గొడవలు జరుగుతాయి’ అని అక్క పాత్ర మదన పడుతుంది. ఈ చిన్న స్పృహ కూడా లేకుండా మనం నిత్యం రకరకాల ఆచారాలు, వ్యవహారాల పేరుతో పిల్లల మధ్య చిన్నప్పటి నుంచే అనేక గీతలు గీయడానికి ప్రయత్నిస్తుంటాం. దాని వల్ల పసిహృదయాలు ఎంత ఇబ్బంది పడతాయో హృద్యంగా రచయిత ఈ కథలో వివరిస్తాడు.
ఇటు సంక్రాంతి వచ్చినా అటు రంజాన్ వచ్చినా ఈ కథ సహృదయులకు తప్పక గుర్తుకొస్తుంది. దీన్ని చదివిన వారు ఏ మతం వారైనా ఇతర మతాలను, వారి సంస్కృతులను గౌరవించకుండా ఉండలేరు. పైగా ఈ కథలో సమాజంలో ఆడపిల్లకు ఒక నీతి, మగపిల్లాడికి ఒక నీతి ఎందుకుందో కూడా చర్చకు వస్తుంది. లైంగిక సమానత్వం గురించిన ఆలోచన కలిగిస్తుంది.
ఇన్నాళ్లూ సాహిత్య పాఠకులకు మాత్రమే ప్రేరణ కలిగించిన ఈ కథలోని అక్క, ఇప్పుడు కాలేజి పిల్లల మెదళ్లకు పట్టిన దుమ్మును సైతం దులిపేందుకు సిద్ధమై వెళ్తుండటం ఆనందం కలిగించే విషయం. రచయితకు, పాఠ్యాంశ రూపకర్తలకు అలాగే విద్యార్థులకు శుభాభినందనలు.
– మొగుతాల రాజు, 73869 86182