చొక్కాకు చిరుగులున్నవి. ప్యాంటుకు రంధ్రాలున్నయి. కాళ్లకు చెప్పుల్లేవు. తలమీద జుట్టు వుందికానీ నూనె లేక గిజిగాడి గూడులావుంది. ముఖంలో తెలుపు, దారీతెన్నూ లేక తిరగడంతో ఉంటానికి ఠికాణా, తింటానికి ఖానా లేకపోవడంతో నలుపులా కనిపిస్తున్నది. మనిషి డొక్కలు ఎగరేస్తూ సన్నగా గట్టిగా గాలివీస్తే ఎగిరే పతంగిలా వున్నాడు. కళ్లల్లో మాత్రం మినుకు మినుకుమంటున్న దీపాలున్నాయి. ఈ మనిషి పేరు సత్యం.
మడత నలగని ఇస్త్రీ చొక్కా వుంది. బ్రాండెడ్ ప్యాంటుంది. కాళ్లకు తళతళ మెరిసే బూట్లున్నయి. తలమీద జుట్టు లేదు కానీ లేనట్టు తెలీని రింగురింగుల జుట్టున్న విగ్గుంది. ముఖంలో నలుపు, తిని తొంగోడం, రికామీగా తిరగడం వల్ల క్రీంలు పూయడం వల్ల తెలుపులా కనిపిస్తున్నది. మనిషి డొక్క కనిపించకుండా దుక్కలా వున్నాడు. కళ్లల్లో ఎటు చూస్తున్నవో తెలీని దగుల్బాజీ మెరుపుంది. ఈ మనిషి పేరు సత్యం మాత్రం కాదు.
సత్యం అని పేరున్న మనిషికీ, సత్యం అని పేరు లేని మనిషికీ ఎంతో తేడా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. సత్యం అన్న పేరు ముందు ‘అ’ అన్న అక్షరం చేరిస్తే అది సత్యం అన్న పేరు లేని వాడి పేరవుతుంది. అసత్యం అన్న పేరు, అబద్దం అన్న పేరు సరిగ్గా పనికి వచ్చే సత్యం కాని సత్యం తానే సత్యాన్ని అని దబాయిస్తుంటాడు. సత్యాన్ని వెక్కిరిస్తుంటాడు.
ఒకనాడు చిగురుపాతల బరుగు బతుకున్న సత్యం, ఆహా ఓహోగా, పైలాపచ్చీసులా, పూల రంగడిలా బతికేస్తున్న అసత్యం ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఎవడ్రా నువ్వు నా పోలికలతో వున్నావు అన్నాడు అసత్యం సత్యంతో.
నేను సత్యాన్ని, నన్ను సత్యం అంటారు. నా గురించి తెలీదా? అన్నాడు సత్యం మినుకు మినుకు దీపాలున్న కళ్లతో వినయంగా.
నువ్వా? నువ్వు సత్యానివా? నికిక్కడేం పనిరా! చూస్తే అడుక్కుతినే వాడిలా కనిపిస్తున్నావు. ఇప్పుడు లోకంలో నడుస్తున్నది నా ‘హవా’నే. నేనే సత్యాన్ని అని అందరూ నమ్ముతున్నారు. నా చుట్టూ తిరుగుతున్నారు అన్నాడు అసత్యం.
ఇప్పుడర్ధమైంది. నేను సత్యాన్ని అయితే నువ్వు అసత్యానివి. పైపై మెరుగులు చూస్తే తెలుస్తున్నది. ఎల్లకాలమూ ఇలాగే వుంటానని తుళ్లిపడకు. టెంపరరీగా ఇట్లా కనిపిస్తున్నాను కానీ అంతిమ విజయం నాదే. సత్యమేవ జయతే అన్న మాట వినలేదూ అన్నాడు సత్యం.
సత్యమేవ జయతేనా. ఏ జమానా మనిషివోయీ, ఏ పురానా పురుషుడివోయీ! నా మాట విని ఈ మనుష్యుల మధ్య నుంచి పారిపో. నరికి పోగులు పెడ్తారు. కాల్చి బూడిద చేస్తాడు అన్నాడు సత్యం తలా, మెడా కాలర్ ఎగరేస్తూ, ఛాతీ పొంగేస్తూ.
నేను నీ మాటలకు బెదిరేదీ లేదు. ఇక్కడ్నుంచి కదిలేదీ లేదు. నేను సత్యాన్ని. నేనే శాశ్వత సత్యాన్ని. నువ్వు ఎన్ని డ్రామాలాడినా, ఎంత నోరు పారేసుకున్నా చివరి పంచ్ నాదే అవుతుంది. ఈ లోకం వున్నంత కాలం నేను ఉండితీరుతాను అంటూ సత్యం అక్కడ్నించి వెళ్లిపోయాడు.
అసత్యం, వీడి మొహం… మేకపోతు గాంభీర్యం అనుకుంటూ ఈలవేసుకుంటూ వెళ్లిపోయాడు.
డాక్టర్ పేషెంట్ రిపోర్టులు చూస్తూ మీరేం భయపడొద్దు. మీ జబ్బు నయం చేసే పూచీ నాది. యువిల్ బి ఆల్ రైట్. కాకపోతే ఖర్చవుద్ది. బాగా ఎక్కువవుద్ది. బతకాలంటే ఆ మాత్రం అవుద్ది అన్నాడు తెల్లకోటు డాక్టర్.
ఎంత ఖర్చయినా పర్లేదు. ఇల్లూ వాకిలి, పొలమూ, పుట్రా, నగనట్రా అన్నీ అమ్మేసైనా బతికించుకుంటాం అన్నది పేషెంటు తాలూకు మనిషి.
అబద్దం.. అన్నీ అమ్ముకుని రోడ్డు మీద పడ్తావు అని అరిచాడు అక్కడే వున్న సత్యం. కానీ ఎవరికీ వినపడలేదు. డాక్టర్ పక్కన నిలబడ్డ అసత్యం నవ్వుకున్నాడు.
ఈ కేసు మనమే గెలుస్తాం. తప్పక గెలిచి తీరుతాం అన్నాడు నల్లకోటు లాయరు. ఎంత ఖర్చయినా పర్లేదు.. ఇల్లూ వాకిలి, పొలము, పుట్రా, నగా నట్రా అన్నీ అమ్మేసైనా కేసు గెలుచుకోవాలి అన్నాడు కేసు తాలూకు మనిషి.
అబద్ధం. అన్నీ అమ్ముకుని రోడ్డుమీద పడ్తావు అని అరిచాడు అక్కడే వున్న సత్యం. కానీ ఎవరికీ వినపడలేదు. లాయర్ పక్కన నిలబడివున్న అసత్యం నవ్వుకున్నాడు.
సత్యాన్ని బతికించాలనుకున్న సత్యాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ అంతకు ముందే వచ్చి రడీగా వున్న అసత్యం వెక్కిరించడం మొదలుపెట్టాడు. ఆఫీసుల్లో, కిరాణా షాపుల్లో, బట్టల కొట్లల్లో, ఇక్కడా అక్కడా అని కాదు… మనుషులు ఎక్కడుంటే అక్కడ అసత్యం తన తడాఖా చూపిస్తున్నాడు. అసత్యం విచ్చలవిడిగా ప్రవర్తించే చోటుకు వెళ్లి సత్యం గొంతు పెగలక తలదించుకుంటున్నాడు.
ఒకప్పుడు బాగా బతికిన సత్యం పూర్తిగా చితికిపోయాడు. చిల్లిగవ్వ కంటే, గడ్డిపోక కంటే హీనమైపోయాడు. తలకు విగ్గూ, ముఖానికి రంగూ పూసుకున్న అసత్యం రాజకీయ నాయకులకు తలలో నాలుకై పోయాడు. హామీల, వాగ్దానాల, గ్యారంటీల పథకాల కుంభవృష్టిగా కురవసాగాడు. దినపత్రికల్లో మెరవసాగాడు. యూట్యూబుల్లో విరగబడసాగాడు. మీడియా తలమీద తైతక్కలాడసాగాడు. అసత్యం పాముగా మారి జనాన్ని కాటు వేయసాగాడు. సమాజాన్ని విషపూరితం చేయసాగాడు.
జనం అసత్యాన్నే సత్యంగా ప్రచారం చేయడం, అసత్యాన్నే పూజించడం చూసిన సత్యానికి ఏం చెయ్యాలో తెలీడం లేదు. సత్యమేవ జయతే అన్న మాట సత్యమా? అసత్యమా? అన్న ఆలోచనతో చిక్కి శల్యమైపోసాగాడు. సత్యంవద, ధర్మంచర అన్న మాటలిప్పుడు ‘సత్యంవధ, ధర్మంచెర’గా మారినవని కుమిలిపోసాగాడు.
– చింతపట్ల సుదర్శన్, 9299809212