ఇప్పటివరకు వెండితెరపై ఎన్నో బయోపిక్‌లను చూశాం. సినిమా జీవితాన్నే బయోపిక్‌గా తీస్తే పైగా భారతీయ సినిమా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తే, ఆ అద్భుతం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. భారతీయ సినిమాకు పునాది ఎక్కడ పడింది? ఆ తర్వాత ఏ విధంగా ఎదిగింది వంటి విషయాలతోపాటు భారతీయ సినిమాకు నివాళిగా ‘మేడ్ ఇన్ ఇండియా’ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా దర్శకుడు రాజమౌళి దీనికి శ్రీకారం చుట్టారు. ఆయన సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై వరుణ్ గుప్తా, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరాఠీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.