న్యాయంగా భాషాపండితులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2005లోనే పదోన్నతులు అందాలి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన మేధో దోపిడీకి గరై తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పదోన్నతులు అందించిన ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు నాటినుండి నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తే వారికి జరిగిన అన్యాయాన్ని కొంతమేరకు తగ్గించి న్యాయం చేసినట్లు అవుతుంది. భాషాపండితులకు పదోన్నతులు రావడంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా పండితుల మనోభావాలు గౌరవించబడడమే కాక విద్యార్థు లకు సరైననాణ్యమైన విద్యను అందించే అవకాశం కలిగింది. ఉన్నత తరగతుల విద్యార్థులు భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించి భవిష్యత్ సాహితీవారసులుగా ఎదిగే గొప్ప బోధనను అందించే అవకాశాన్ని ప్రభుత్వం వారికి కల్పించి నట్లయింది.
భాషింపబడునది భాష. భాష ఒక ప్రాంత అస్తిత్వానికి, చరిత్రకు, నాగరికతకు పునాదులువేసి, ఆ ప్రాంతాన్ని జాతిని తలెత్తుకునేలా చేస్తుంది. విద్యార్థిదశలో భాషాబోధన అందుకే కీలక పాత్ర వహిస్తుంది. అలాంటి భాషా బోధకులు గత నాలుగు దశాబ్దాలుగా అనుభవిస్తున్న వెతలను దూరం చేసి, వారిలోనున్న ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన 2 , 3ఉత్తర్వుల ప్రకారం భాషా పండితులకే పదోన్నతులు కల్పించడం, భాషాపండితుల్లో ఉత్సాహాన్ని నింపాయి. భాషాపండితుల ఆత్మఘోష ఈనాటిది కాదు. ఒకప్పుడు ఎంతో గౌరవాన్ని పొందిన పండితులను 1982లో జరిగిన రీగ్రూపింగ్స్ స్కేళ్ల సందర్భంగా స్థాయిని తగ్గించి వారికి తీరని అన్యాయాన్ని చేశారు. అప్పటినుండి నిన్నటి పదోన్నతులందుకునే వరకు మేధో దోపిడీకి గురవుతూనే గ్రేడ్.2 భాషాపండితులు విద్యార్థులకు ఉత్తమవిద్యను అందిస్తూనే ఉన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌లతోనే బోధన చేయించాలి. దానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లోని అన్ని పోస్టులను ఉన్నతీకరించవలసి ఉండగా భాషాపండితుల పోస్టులను అలాగే ఉంచి ఇతర విషయ పోస్టులను ఉన్నతీకరణ చేసి దాదాపు 50 వేల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్ కల్పించిన నాటి ప్రభుత్వం పండితులకు మొండిచేయి చూపింది. గ్రేడ్2 పండితులకు గ్రేడ్ 1 విద్యార్హతలు ఉన్నందున గ్రేడ్ 1గా గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి పండితులకు తీవ్ర నష్టాన్ని చేసింది. ఆ తరువాత 2009లో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు 11,12 లు క్రాస్ ప్రమోషన్‌లకు అవకాశం కల్పిస్తూ భాషాపండితుల పదోన్నతుల ఆశలను అధ:పాతాళానికి తొక్కేశాయి.
భాషాపండితులకు న్యాయం చేయాలని, గ్రేడ్2 పోస్టులను ఉన్నతీకరణ చేసి భాషాపండితుల కే అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మాహాసభలలో ఆప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భాషాపండితులకు హామీచిచ్చారు. తాను ఇచ్చిన హామీ ప్రకారం 16ఫిబ్రవరి2019 న జి.ఓ 15 ను విడుదల చేసి రాష్ట్రంలో 8000 పైగా భాషాపండితుల పోస్ట్ లను అప్‌గ్రేడ్ చేశారు.అయితే కొంతమంది సోదర ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించడం వలన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కోర్టు స్టే మంజూరు చేస్తూ 11,12 జిఓలను సవరిస్తూ, 15 జిఓను అమలు చేయవచ్చంటూ ప్రభుత్వానికి సూచించింది. సమస్యను మళ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా 5 ఫిబ్రవరిన కేవలం భాషాపండితులకే స్కూల్ అసిస్టెంట్ అవకాశం కల్పించే విధంగా 11,12 జీఓల సవరించి జీఓలు 2,3 విడుదల చేశారు. ఆ జీఓ లను కూడా సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా పండితులకు చుక్కెదురైంది. ఆ తరువాత పండితులకు డివిజన్ బెంచ్ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనంటూ తీర్పునీయడం ఉపశమనం కలిగించింది.
అయితే అంత సజావుగా సాగుతున్న తరుణంలో, పదోన్నతులు లభిస్తాయని ఆశించిన సమయంలో ప్రభుత్వాలు మారాయి. కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగిపోయిన పదోన్నతులు బదిలీల షెడ్యూల్ కొనసాగించాలని నిర్ణయించిన సందర్భంలో ఎస్జీటీలు మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆ వాదనను కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించడంతో పదోన్నతులు పొందడానికి భాషాపండితులకు ఉన్న అడ్డంకులు తొలగినట్లయింది. న్యాయంగా భాషాపండితులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2005లోనే పదోన్నతులు అందాలి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన మేధో దోపిడీకి గరై తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పదోన్నతులు అందించిన ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు నాటినుండి నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తే వారికి జరిగిన అన్యాయాన్ని కొంతమేరకు తగ్గించి న్యాయం చేసినట్లు అవుతుంది. భాషాపండితులకు పదోన్నతులు రావడంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా పండితుల మనోభావాలు గౌరవించబడడమే కాక విద్యార్థులకు సరైననాణ్యమైన విద్యను అందించే అవకాశం కలిగింది. ఉన్నత తరగతుల విద్యార్థులు భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించి భవిష్యత్ సాహితీవారసులుగా ఎదిగే గొప్ప బోధనను అందించే అవకాశాన్ని ప్రభుత్వం వారికి కల్పించినట్లయింది.
పదోన్నతి పొందిన భాషాపండితులంతా సంతోషంగా ఉంటే, అడేక్వసి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువందల మంది పండితులు పదోన్నతులు రాక నిరాశానిస్పృహతో ఉన్నారు. పండిత వ్యవస్థ రద్దువవుతుందని అందరికి స్కూల్ అసిస్టెంట్స్‌గా అవకాశం కల్పిస్తారని భావించిన వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తిచేసుకున్నారు. చివరిదశలో పదోన్నతి అందకపోవడంతో ఎలాగైనా తమకు కూడా న్యాయం చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నూతనంగా పదోన్నతులు అందుకున్న సంతోషంతో మరింత కర్తవ్యనిష్టతో భాషాబోధన చేయాల్సిన బాధ్యత కొత్త స్కూల్ అసిస్టెంట్(భాషలు) లపై ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్ది వారిని ఉన్నతంగా ఎదిగేట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ భారాన్ని ఉత్సాహంతో మోయడానికి సిద్ధంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ భాష పండితులందరికీ అభినందనలు.
– జి.తిరుమల కాంతికృష్ణ, 9490003295