– యువ కవులకు నవ స్వరాంజలి సత్కారాలు
– కే శ్రీనివాస్, ఖాదర్ మొయినుద్దీన్‌లకు మువ్వా పద్మావతి రంగయ్య పురస్కారం
– కే ఆనందాచారికి ఆవంత్స సోమసుందర్ పురస్కారం
– మువ్వా శ్రీనివాసరావు పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అక్షర యోధులకు, అభ్యుదయవాదులకు ఘన సత్కారం జరిగింది. దీనికి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదిక అయ్యింది. తెలంగాణ సాహితీ, జాషువా సాహిత్య వేదిక, ఖమ్మం మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో బహిరంగ సభలను తలదన్నేలా సాహిత్య సభ జరిగింది. సాహిత్య రంగంలో యోధానుయోధులైన మహా కవులు, రచయితలు భారీ సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2021వ సంవత్సరానికి గానూ ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్‌కు, 2022 సంవత్సరానికి ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌కు మొవ్వా పద్మావతి రంగయ్య పురస్కారాలను అందచేశారు. మరో ప్రముఖ కవి, రచయిత కే ఆనందాచారికి ఆవంత్స సోమసుందర్ పురస్కారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా 366 మంది రచయితలు రాసిన వ్యాసాలతో 1,347 పేజీలతో కూడిన కవితాంతరంగ విశ్లేషణల గ్రంథం ‘అనితరుడు’ను ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు.తొలి ప్రతిని రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి మౌళిరావుకు అందచేశారు. కోయి కోటేశ్వరరావు గ్రంధ పరిచయం చేశారు. అనంతరం ఆ పుస్తక సంపాదకవర్గానికి సన్మానం చేశారు. కొండ్రెడ్డి వెంకట్‌రెడ్డి రచించిన ‘దృశ్యంఏ576 మెగాఫిక్సెల్ ‘ పుస్తకాన్ని ప్రముఖ కవి శివారెడ్డి ఆవిష్కరించి, విక్టర్ రాజుకు తొలి ప్రతిని అందచేశారు. ఆచార్య పులికొండ సుబ్బాచారి పుస్తక పరిచయం చేశారు. శాంతసుందరి హిందీ అనువాద రచన ‘సమాంతర ఛాయలు’ పుస్తకాన్ని ప్రముఖ కవి నగముని ఆవిష్కరించి, తొలి ప్రతిని రచయిత జీవిత భాగస్వామి గణేశ్వరరావుకు అందచేశారు. ఈ పుస్తకాన్ని ఖాదర్ మొయినుద్దీన్ సభకు పరిచయం చేశారు. అనంతరం ఇదే పుస్తకం కన్నడ అనువాదాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరించి, తొలి ప్రతిని కొండపల్లి పవన్‌కు అందచేశారు. కన్నడ అనువాదాన్ని లక్కూరి ఆనంద్ చేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీ తలు తమ శుభాభినందనలు తెలిపారు. సాంప్రదాయ సన్మా నాలకు డిజిటల్ ప్రత్యామ్నాయం రావాలంటూ కే శ్రీనివాస్ చెప్పగా, సాహిత్య సభలను బహిరంగ సభలుగా నిర్వహిం చడం మొవ్వా శ్రీనివాసరావుకే చెల్లిందంటూ ఆనందాచారి అన్నారు. అనంతరం యువ కళాకారులకు ‘నవ స్వరాంజలి’ పేరుతో సన్మానించారు. కార్యక్రమంలో కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, ఆచార్య కాత్యాయనీ విద్మహే, తోటకూర ప్రసాద్, గుంటూరు లక్ష్మీనర్సయ్య, ఎన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మువ్వా పద్మావతి రంగయ్య ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) సభ్యులు ఆనందాచారిని సత్కరించారు.