లోకాయుక్తకు ఆ అధికారాల్లేవు

A Lokayukta does not have those powers– హైకోర్టు స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రెవెన్యూ అధికారులు ఒకరికి బదులు మరొకరికి చెల్లించిన పరిహారాన్ని రికవరీ చేయాలని ఆ శాఖకు ఆదేశాలు జారీ చేసే పరిధి లోకాయుక్తకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లోకాయుక్త చట్టంలోని 7, 9 నిబంధనల ప్రకారం ఆ అధికారం లోకాయుక్తకు లేదని తేల్చింది. తోటపల్లి రిజర్వాయర్‌ భూసేకరణలో చెల్లించిన పరిహారాన్ని లోకాయుక్త ఉత్తర్వుల మేరకు డిపాజిట్‌ చేయాలని హుస్నాబాద్‌ ఆర్డీవో ఇచ్చిన నోటీసును ఎస్‌.కనకయ్య హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లోక్‌ అరాథే, జస్టిస్‌ ఎస్వీ శ్రవణ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ… రికవరీ ఆదేశాలు జారీ చేసే అధికారం లోకాయుక్తకు లేదన్నారు. లోకాయుక్త ఆదేశాల్ని రద్దు చేయాలని కోరారు. ప్రతివాది గుడారం బాలవ్వ తరఫు న్యాయవాది పొన్నం అశోక్‌ గౌడ్‌ వాదనలు వినిపిస్తూ, పరిహారం కోసం లోకాయుక్తను ఆశ్రయిస్తే ఉత్తర్వులు వెలువరించిందని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, లోకాయుక్త చట్టం ప్రకారం ఇలాంటి ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది. పరిహారం కోసం చట్టపరమైన విధానం ఉందని, ఆ మేరకు బాధితుడు చేసుకోవచ్చునని చెప్పింది. పిటిషన్‌పై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.
క్షమాభిక్షపై తగిన నిర్ణయం తీసుకోండి-హైకోర్టు
క్రిమినల్‌ కేసులో ముద్దాయిగా రుజువై, 27 ఏండ్లుగా యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలకు క్షమాభిక్ష విధించే అంశంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఒక కేసులో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదించారని, తన తండ్రి మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలీకి క్షమాభిక్ష ప్రసాదించలేదని అతని కుమారుడు మహ్మద్‌ అస్రఫ్‌ అలీ, ఇదే కేసులో మరో ఖైదీ అరిఫ్‌ ఖాన్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
వీటిని జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. కింది కోర్టు 1997లో తీర్పు చెప్పింది. దీనిపై అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. ముగ్గురికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తూ గత ఆగస్ట్‌ 19న జీవో 51 జారీ చేసింది. ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదించి ఇద్దరికి ఇవ్వకపోవడం వివక్ష కిందకే వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ల విషయంపై తగిన నిర్ణయం తీసుకుని నవంబర్‌ 21న జరిగే విచారణ నాడు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మాజీ సైనికుల కనీస మార్కులపై నిర్ణయం తీసుకోండి
రాష్ట్రంలో గ్రూప్‌-4 పోస్టుల్లో మాజీ సైనికులకు కనీస అర్హత మార్కులపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు జస్టిస్‌ మాధవీదేవి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్‌ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీ తోపాటు హౌంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ సిఫారసులకు పరిగణనలోకి తీసుకుని మాజీ సైనికుల కనీస అర్హత మార్కులపై 30రోజుల్లోగా ఒక నిర్ణయానికి రావాలనీ, అప్పటి వరకు మాజీ సైనికులకు కేటాయించిన పోస్టులను భర్తీ చేయరాదని చెప్పింది. కనీస మార్కుల అంశంపై నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొంటూ బీ భాస్కర్‌ మరో 9 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
పిల్‌ డిస్మిస్‌
రాష్ట్రంలోని దేవాదాయ శాఖ నిర్వహణలోని ఆలయాల్లో అన్యమతస్థులు ఉన్నారనే పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. అన్యమతస్థులకు చోటు లేదని, కమిటీల్లో కూడా ఆవిధంగా అస్కారం కల్పించడం లేదని ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను ఆమోదించింది. అన్యమతస్థులు లేకుండా తీర్పు చెప్పాలని కోరుతూ దాఖలైన పిల్‌ను డిస్మిస్‌ చేస్తూ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది.
జీఎస్టీ కరెక్టే – హైకోర్టు
కాలేజీలు, విద్యా సంస్థల నుంచి యూనివర్సిటీ, ఆయా కాలేజీల బోర్డులు నిర్వహించే గుర్తింపు, తనిఖీల ఫీజులపై జీఎస్టీ విధించడాన్ని హైకోర్టు సమర్ధించింది. కాళోజీ మెడికల్‌ వర్సిటీ ఇచ్చిన నోటీసులను పలు నర్సింగ్‌ కాలేజీలు వేర్వేరుగా వేసిన రిట్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పింది. గుర్తింపు, తనిఖీలు విద్యా సేవల కిందకు రాదని చెప్పింది.